Homeజాతీయ వార్తలుBRS MLSs Dissatisfaction: బీఆర్‌ఎస్‌లో కాంగ్రెస్‌ కల్చర్‌.. కేసీఆర్‌ సహిస్తాడా? 

BRS MLSs Dissatisfaction: బీఆర్‌ఎస్‌లో కాంగ్రెస్‌ కల్చర్‌.. కేసీఆర్‌ సహిస్తాడా? 

BRS MLSs Dissatisfaction: పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యానికి కేరాఫ్‌ తెలంగాణన కాంగ్రెస్‌. ఈ ముసుగులో నాయకుల మీద సొంత పార్టీ వారే విమర్శలు చేయడం.. ఒకరి వెనుక ఒకరు గోతులు తవ్వడం, ఒకరి మీద మరొకరు విమర్శలు కురిపించడం ఇదంతా కాంగ్రెస్‌ పార్టీలో సర్వసాధారణం. ఆ పార్టీ ఈ పోకడలకు ఎన్నడూ సిగ్గుపడింది కూడా లేదు. మా పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువ అని గర్వంగా చెప్పుకోవడం గమనార్హం. కానీ, సాధారణంగా వ్యక్తి కేంద్రంగా ఉండే ప్రాంతీయ పార్టీల్లో ఇలాంటి ధిక్కార ధోరణులు, తిరుగుబాటు వ్యవహారాలు చాలా తక్కువ. తెలంగాణన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు లాంటి మోనార్క్‌ నాయకత్వంలో అయితే.. అసలు పార్టీ వ్యవహారాల గురించి బయట మాట్లాడడానికి నోరు మెదిపే నాయకులు కూడా మనకు కనిపించరు. కానీ.. ఇప్పుడు మంత్రి మల్లారెడ్డి పుణ్యమా అని అలాంటి ధోరణి బీఆర్‌ఎస్‌లో కనిపిస్తోంది.

BRS MLSs Dissatisfaction
BRS MLSs Dissatisfaction

మల్లన్నపై తిరుగుబాటు..
మంత్రి మల్లారెడ్డి తన ఒంటెత్తు పోకడలతో పార్టీకి నష్టం చేస్తున్నారని, అయిదుగురు భారత రాష్ట్ర సమితి(బీఆర్‌ఎస్‌) ఎమ్మెల్యేలు ఉమ్మడిగా ఒక మీటింగు పెట్టుకున్నారు. మంత్రి మల్లారెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడుకున్నారు. ఈ పరిణామాలన్నీ ఒక ఎత్తు. ఆ మీటింగు తర్వాత.. విలేకర్లసమావేశం పెట్టి మరీ.. మల్లారెడ్డి వ్యవహారాలు పార్టీకి చేటుచేస్తున్నాయని చెప్పడం ఇంకో ఎత్తు. ఎమ్మెల్యేలతో మాట్లాడకుండా మంత్రి అధిష్టానాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారనేది వారి ఆరోపణ. కార్యకర్తలకు న్యాయం జరిగేలా సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ దృష్టికి ఈ విషయం తీసుకువెళతాం అని వారు ప్రకటించడం గమనార్హం. అంటే ఇప్పటిదాకా వారు పార్టీ అగ్రనాయకులకు ఈ సంగతి చెప్పలేదు.

అధినేతకు చెప్పకుండా..
వ్యక్తి కేంద్రమైన బీఆర్‌ఎస్‌లో చీమ చిటుక్కుమన్నా అధినేత కేసీఆర్‌కు తెలియాల్సిందే. కానీ మంత్రి మల్లారెడ్డికి వ్యతిరేకంగా ఐదుగురు ఎమ్మెల్యేలు సమావేశం నిర్వహించడం మీడియాలో వచ్చే వరకూ అధిష్టానానికి తెలియలేదు. సాయంత్రం వరకు కూడా దీనిని అధినేత దృష్టికి తీసుకెళ్లలేదు. ముందు పార్టీలో చెప్పకుండా.. డైరక్టుగా ప్రెస్‌ మీట్‌ పెట్టి చెప్పడాన్ని ఏ పార్టీ అయినా (కాంగ్రెస్‌ తప్ప) తీవ్రంగా పరిగణిస్తుంది. పార్టీ అధిష్ఠానంపై ధిక్కారస్వరంగా భావిస్తుంది. అలాంటిది.. అసలే మోనార్క్‌గా పార్టీని నడిపించే కేసీఆర్‌.. ఈ వైఖరిని సహిస్తారా? అనేది ఇప్పుడు అనుమానంగా ఉంది. పార్టీ పెద్దలు పిలిచి మాట్లాడితే వెళ్లి అన్ని విషయాలు వివరిస్తాం అని కూడా వీరు అంటున్నారు. అంటే బంతిని కేసీఆర్‌ కోర్టులోకి నెట్టేశారన్న మాట.

ఒత్తిడిలో కేసీఆర్‌..
బీఆర్‌ఎస్‌ బాస్‌ కేసీఆర్‌ ఇప్పుడు తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నారు. ఆయన జాతీయ పార్టీని ప్రారంభించేశారు గానీ.. తొలిఅడుగులకు ఆయన అనుకున్నంత స్పందన రాలేదు. జాతీయ స్థాయిలో ఇతర పార్టీల నాయకులను కూడగట్టే ప్రయత్నాల్లో తలమునకలై ఉన్నారు. ఇలాంటి సమయంలో.. పార్టీలో ఇలాంటి లొల్లి పంచాయతీలను పట్టించుకోవడం ఎంతవరకు కుదురుతుందో చెప్పలేం. పైగా.. ఈ అయిదుగురు ఎమ్మెల్యేల స్వరం వింటోంటే.. పార్టీని వీడిపోవడానికి కూడా వీరు సిద్ధంగా ఉన్నట్లుగానే కనిపిస్తోంది. ఆ నిర్ణయానికి వచ్చిన తర్వాతనే.. వారు ప్రెస్‌మీట్‌ పెట్టేంత సాహసం చేసినట్టు తెలుస్తోంది.

BRS MLSs Dissatisfaction
KCR

బీజేపీ ఎర..
నలుగురు ఎమ్మెల్యేలకు ఎర వేశారని.. బీజేపీపై కేసీఆర్‌ నానా రభస చేస్తోంటే.. అసలు గుట్టు చప్పుడు కాకుండా.. అయిదుగురు ఎమ్మెల్యేలకు బీజేపీ వలవేసినట్టుగా కూడా కొందరు భావిస్తున్నారు. కొన్ని వారాల వ్యవధిలోనే మరింత స్పష్టత వస్తుందని.. అయిదుగురు ఎమ్మెల్యేలు బీఆర్‌ఎస్‌లోనే ఉంటారా? ఇంకోదారి చూసుకుంటారా? ఆ దారి ఎటువైపు? అనేది తెలియాలంటే వేచిచూడాలి.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Exit mobile version