
Jagan -KCR రాష్ట్ర విభజన జరిగి పదేళ్లవుతోంది. కానీ ఇరు రాష్ట్రాల మధ్య విభజన సమస్యలు అలానే ఉండిపోయాయి. ఇప్పటికీ కొన్నిసంస్థల విభజన జరగలేదు. సరిహద్దు జల వివాదాలు నడుస్తున్నాయి. అయితే ఇరు రాష్ట్రాల సీఎంలు సన్నిహితంగా ఉంటున్నారు. కానీ సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదు. రాజకీయంగా పరస్పర, వ్యక్తిగత ప్రయోజనాలకు పెద్దపీట వేసుకొని.. రాష్ట్ర ప్రయోజనాల విషయానికి వచ్చేసరికి మాత్రం రాజీ పడుతున్నారన్న అపవాదు ఇద్దరి సీఎంలపై పడింది. అటు రాజకీయంగా కేసీఆర్ తో స్నేహం వదులుకోలేక.. చాలా విషయాల్లో రాజీ ధోరణితో కేసీఆర్ కు, తెలంగాణకు జగన్ ఆయాచిత లబ్ధి చేకూర్చుతున్నారన్న టాక్ ఉంది. ఇప్పుడు ఓ కీలక ప్రాజెక్టు విషయంలో కూడా కేసీఆర్ ఒత్తిడికి జగన్ తలొగ్గడం చర్చనీయాంశంగా మారింది.
ఏపీకి జీవనాడి పోలవరం ప్రాజెక్ట్. ఏళ్లు గడుస్తున్నా ప్రాజెక్టు నిర్మాణం ఒక కొలిక్కి రాలేదు. రాష్ట్ర విభజన అనంతరం కేంద్ర ప్రభుత్వం పోలవరం నిర్మాణానికి అనుమతించింది. అంతేకాదు భవిష్యత్ లో తెలంగాణ నుంచి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను సైతం ఏపీలోనే కలిపింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో ఏడు మండలాల్లో వందలాది ఎకరాల భూములు నీట మునుగుతున్నాయని అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. రాష్ట్ర విభజనతో తెలంగాణ సర్కారు నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యే అవకాశముండడంతో ఆ మండలాలను ఏపీలో విలీనం చేసింది. దీంతో వివాదం అక్కడితో ముగుస్తుందనుకున్న తరుణంలో తెలంగాణ సర్కారు మాత్రం అభ్యంతరాలు వ్యక్తం చేస్తూనే ఉంది.

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో.. వరదల సమయంలో ఉమ్మడి ఏపీలో వేలాది ఎకరాల పంట భూములు మునిగిపోతున్నాయని తెలంగాణ వాదిస్తోంది. ఇదే అంశంపై న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించింది. పోలవరం నిర్మాణంతో జరుగుతున్న నష్టాన్ని అంచనా వేసేందుకు ఉమ్మడి సర్వే చేపట్టాలని డిమాండ్ చేస్తోంది. అప్పట్లో చంద్రబాబు సర్కారు దీనికి ఒప్పకోలేదు. గత మూడున్నరేళ్లుగా జగన్ ప్రభుత్వం సైతం పెద్దగా ఆసక్తి చూపలేదు. పోలవరం ప్రాజెక్టులో 150 అడుగుల నీరును స్టాక్ చేసే క్రమంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వేలాది ఎకరాల పంట భూములు ముంపుబారిన పడుతున్నాయని సుప్రీం కోర్టులో పిటీషన్లు దాఖలు చేసింది. దానిపై విచారణ కొనసాగుతోంది.
జల వివాదాలను సామరస్యంగా పరిష్కరించాలని సుప్రీం కోర్టు కేంద్ర జల సంఘాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో గత నెల 25న పోలవరం బాధిత రాష్ట్రాలైన ఏపీ , తెలంగాణ, చత్తీస్ గడ్, ఒడిశా రాష్ట్రాల అధికారులతో కేంద్ర జల సంఘం ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. పోలవరం నష్టంపై ఉమ్మడి సర్వేకు ఏపీ అధికారులు అంగీకారం తెలిపినట్టు కేంద్ర జల సంఘం తాజాగా ప్రకటించింది. సుప్రిం కోర్టులో జరిగే తదుపరి విచారణలో దీనిపై పూర్తి క్లారిటీ రానుంది.