India-China Border Clash: అరుణాచల్ ప్రదేశ్ లో చైనా తాజా దురాక్రమణకు సంబంధించి పూర్తి వివరాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ ప్రాంతాన్ని మరో గాల్వాన్ లోయ లాగా మారుద్దామని చైనా అనుకున్నది. అంతేకాదు మేకులు కొట్టిన కర్రలు, టీజర్ గన్లను ఆయుధాలుగా సైనికులకు ఇచ్చింది. ఏకంగా 400 మందిని గీత దాటి పంపింది. అంతేకాదు భారత్ చెక్ పోస్ట్ ను ఆక్రమించేందుకు పన్నాగం పన్నింది. అయితే దీనిని గుర్తించిన భారత సైన్యం అరగంటలోనే చైనా సైనికులను తరిమి తరిమి కొట్టింది. ఈ ఘటనతో వైమానిక దళం అప్రమత్తమైంది. యుద్ధ విమానాలను భారీగా మోహరించింది.

ఆరోజు ఏం జరిగిందంటే
డిసెంబర్ 9న తవాన్ సెక్టార్లో మూడు వందల నుంచి 400 మందికి పైగా చైనా సైనికులు మేకులు కొట్టిన కర్రలు, ఇనుప ముళ్ల కంచెలు చుట్టిన కర్రలను టీజర్ గన్ లను తీసుకొని భారత భూభాగంలోకి వచ్చారు.. రెండున్నర సంవత్సరాల క్రితం గాల్వాన్ లోయలో దాడి చేసినట్టే ఇక్కడ కూడా సంప్రదాయేతర ఆయుధాలతో దాడికి దిగారు.. భారత సైన్యం ఏర్పాటు చేసిన పోస్టును తొలగించుకునేందుకు ప్రయత్నించారు.. అక్కడ పెట్రోలింగ్ చేస్తున్న భారత సైన్యాన్ని వెళ్ళిపోవాలని హెచ్చరించారు. అయితే అక్కడ కొద్ది సంఖ్యలో ఉన్నప్పటికీ భారత సైన్యం వారికి ధీటుగా సమాధానం చెప్పింది. లిప్త పాటు కాలంలోనే అదనపు బలగాలను తెప్పించుకొని ఎదురుదాడికి దిగింది.. కేవలం అరగంటలో వాస్తవాధీన రేఖ అవతలకు తరిమికొట్టింది. ఈ క్రమంలో భారత సైన్యంలో దాదాపు 15 మందికి గాయాలయ్యాయి. ఇద్దరి జవాన్ల ఎముకలు విరిగాయి.. భారత్ కన్నా చైనా వైపు ఎక్కువ మంది గాయపడ్డారు. ఇరువైపులా మరణాలు నమోదు కాలేదు. సముద్ర మట్టానికి 17 వేల అడుగుల ఎత్తున ఈ ఘటన జరిగింది. ఈ ప్రాంతమంతా ప్రస్తుతం మంచుతో నిండిపోయి ఉంది. ఘటన తర్వాత సంఘటనా స్థలం నుంచి ఇరుపక్షాల సైన్యాలు వెనక్కి తగ్గాయి.
గౌహతి ఆసుపత్రికి తరలింపు
ఈ ఘటనలో క్షతగాత్రులైన సైనికులను చికిత్స కోసం గౌహతి ఆసుపత్రికి తరలించారు.. 2001 అక్టోబర్ లోనూ ఇదే చోట ఇలాంటి ప్రయత్నమే జరగడంతో అప్పట్లో సైనికులు తిప్పికొట్టారు. ఈ ఘటనకు ముందు చైనా తన డ్రోన్లను భారత భూభాగంలోకి తరచూ పంపింది. వాటిని తిప్పికొట్టేందుకు భారత సైన్యం మూడు సందర్భాల్లో ఎస్ యూ _ 30 ఎంకేఐ జెట్ విమానాలను రంగంలోకి దింపింది.. అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ లో చైనా గగనతల దాడులను అడ్డుకునేందుకు భారత సైన్యం ఇప్పటికే ఎస్_400 విమాన/ క్షిపణి విధ్వంసక వ్యవస్థను సిద్ధం చేసింది.. తవాంగ్ సెక్టార్ లో దురాక్రమణ నేపథ్యంలో భారత వైమానిక దళం పూర్తిగా అప్రమత్తమైంది. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తోంది. యుద్ధ విమానాలను సిద్ధం చేస్తోంది.. పరిస్థితి ప్రశాంతంగా ఉందని లెఫ్టినెంట్ జనరల్ సీబీ పొన్నప్ప చెప్తున్నారు.

2006 నుంచి..
భారత భూభాగంలోకి చొచ్చుకువచ్చేందుకు 2006 నుంచి చైనా ప్రయత్నాలు సాగిస్తోంది.. 2020లో గల్వాన్ లోయ ఘటన లో 20 మంది భారత సైనికులు, 40 మంది చైనా సైనికులు మరణించారు. నియంత్రణ రేఖ విషయంలో కొన్ని ప్రాంతాల్లో ఇరు దేశాల మధ్య భిన్నాభిప్రాయాలు ఉండడంతో ఒకే ప్రాంతంలో రెండు దేశాల సైనికులు పెట్రోలింగ్ చేసే పరిస్థితి ఉంది. తాజా ఘటన నేపథ్యంలో ఇరు దేశాల కమాండర్లు ప్లాగ్ మీటింగ్ కు హాజరయ్యారు. శాంతిని పునరుద్ధరించే చర్యల గురించి చర్చించారు. ప్రస్తుతం వాస్తవధీన రేఖ వద్ద ఇరుదేశాల సైనికులు భారీగా మొహరించారు. పార్లమెంట్లో కూడా దీనిపై వాడి వేడి చర్చ జరుగుతున్నది.