KCR BRS: ఆ మధ్య బీహార్ వెళ్ళి నితీష్ కుమార్ ను కేసీఆర్ కలిశాడు. గాల్వాన్ లోయలో మరణించిన సైనికుల కుటుంబాలకు చెక్కులు ఇచ్చాడు.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తో ప్రెస్ మీట్ పెట్టాడు. ఇలాగే జార్ఖండ్, ఢిల్లీ, పంజాబ్ వెళ్ళాడు. గాల్వాన్ లోయ ప్రమాదం జరిగిన చాలా రోజుల తర్వాత ఉన్నట్టుండి కేసీఆర్ కు సైనికుల మీద అంత ప్రేమ కలగడానికి ప్రధాన కారణం రాజకీయం. వినటానికి ఆశ్చర్యంగా ఉన్నా…ఇదే నిజం. కానీ, ఇక్కడ కేసీఆర్ కు కొంత మోదం, కొంత ఖేదం.

కేసీఆర్ ఫోల్డ్ లోకి రాలేదు
బీహార్ లో భేటీ అనంతరం నితీష్ కుమార్ కేసీఆర్ ఫోల్డ్ లోకి వెళ్తారని అందరూ భావించారు. కానీ, నితీష్ కేసీఆర్ ఆలోచనలకు భిన్నంగా వ్యవహరించారు. బీహార్ రాష్ట్రాన్ని తేజస్వీ యాదవ్ కు వదిలి పెట్టి ఆయన ఢిల్లీ మీద పడ్డారు. ఇది కేసీఆర్ కు మింగుడు పడని పరిణామం. ఏ మాటకు ఆ మాటే…మోడీ, యోగీ తర్వాత కాస్తో కూస్తో చరిష్మా ఉంది అంటే అది నితీష్ కే. ఈ రో లో కేసీఆర్ ఉండడు. ఉండలేడు కూడా.. సరే అదంతా వేరే చర్చ. సో ఇప్పుడు కేసీఆర్ అర్జెంటుగా ఢిల్లీలో చక్రాలు తిప్పాలి..మోడీని గద్దె దింపాలి. అందుకు కేసిఆర్ జాతీయ స్థాయిలో ఫోకస్ కావాలి. అదిగో అప్పుడు మొదలయింది అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అనే నినాదం.

అందుకే జట్టు కట్టారు
తెలంగాణ శాసనసభ లో వామపక్ష పార్టీ నాయకులను సూది, దబ్బుణాలుగా పేరు పెట్టిన కేసీఆర్…తర్వాత వారిని ప్రగతి భవన్ పిలిపించారు..మాకు ఇదే పది వేలు అనుకుంటూ పోలో మంటూ వెళ్ళిపోయారు. మునుగోడు లో మద్దతు ఇచ్చారు. ఇక్కడ పడిన అడుగుతో కేసీఆర్ మరింత సన్నిహిత్యాన్ని వామపక్షాలతో పెంచుకున్నారు. తర్వాత బీఆర్ఎస్ ను ఏర్పాటు చేశారు. ఎలాగూ ఆప్ దోస్త్ కాబట్టి ఇటు కమ్యూనిస్టులు, అటు ఆప్ తో కలిసి కూటమి కట్టే ప్రయత్నాలను కేసీఆర్ చేస్తున్నట్టు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.. అటు నితీష్, ఇటు మమత ఎవరికివారు సొంత ప్రయత్నాల్లో ఉన్నారు..ఇటు కేసీఆర్ కూటమి కడుతున్నారు. మొత్తానికి మోడీ నెత్తి మీద మూడో సారీ పాలు పోసే ప్రయత్నం జోరుగా సాగుతోంది. అంతే. అంతకు మించి ఏమీ లేదు.