Tea Shop Memories: లీలగా రేడియో పాటలు.. పొగలు కక్కే డికాషన్.. ఎర్రగా మరిగే పాలు.. స్వచ్ఛంగా మెరిసే గాజు గ్లాసు.. నురగలు కక్కుతూ ఉంటే చాయ్. ఉషోదయానికి ముందే అక్కడ చాయోదయం అవుతుంది. వణికించే చలికి.. తడిపే వానకు.. ఉక్క పోసే ఎండకు అక్కడ సాంత్వన దొరుకుతుంది. గల్లి రాజకీయాల నుంచి ఢిల్లీ పొత్తుల వరకు అన్నింటి గురించి చర్చ నడుస్తుంది. వీధి కుళాయిలో పంచాయతీ నుంచి సర్పంచ్ ఎన్నికల దాకా అక్కడ భారీ కసరత్తు నడుస్తుంది. ఒక్కొక్కరిది ఒక్కొక్క అభిప్రాయం.. చర్చలు అక్కడే మొదలవుతాయి.. పంచాయతీలు అక్కడే మొదలవుతాయి. పరిష్కార మార్గాలు కూడా అక్కడే లభిస్తాయి. అదేం అసెంబ్లీ కాదు.. న్యాయ కోవిదులు ఉండే కోర్టు కాదు. జస్ట్ ఓ టీ కొట్టు.. కోట్లాది అనుభూతుల పెట్టు.
ప్రస్తుత యుగంలో టీ కొట్టు రూపం మారిపోయి ఉండవచ్చు గాక.. కార్పొరేట్ కంపెనీలు ఈ రంగంలోకి వచ్చి ఉండవచ్చు గాక.. కానీ ఇప్పటికీ గ్రామాలకు వెళ్లి చూడండి.. ఊరు నడిమధ్యలో, లేక ఎక్కడో వచ్చి చివరో ఒక టీ కొట్టు ఉంటుంది. ఆడంబరం అనిపించదు గాని.. అది చాలామందికి ఒక వ్యాపకం. గుండెను తట్టి లేపే ఒక ఎమోషన్. మాటలకు, చర్చలకు, వాక్ యుద్ధాలకు ఒక వేదిక. ఇప్పుడంటే కార్పొరేట్ కంపెనీలు టీ ని కూడా ఒక వ్యాపార వస్తువుగా మార్చాయి కానీ.. ఒకప్పుడు టీ కొట్లు వ్యాపారం చేస్తూనే మనుషుల మధ్య అనుసంధాన వేదికలుగా మారేవి. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇది ముమ్మాటికి నిజం. తెలంగాణ మలిదశ ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ ఉద్యమం పాల్వంచలో పురుడు పోసుకుంది. ఆ ఉద్యమం తెరలేవడానికి కారణం కేటీపీఎస్ సమీపంలో సాంబయ్య అనే ఒక వ్యక్తి నిర్వహించే టి కొట్టు అంటే మీరు నమ్ముతారా? అక్కడిదాకా ఎందుకు టాటా చక్ర గోల్డ్ అనే టీ పౌడర్ బ్రాండ్ మొదలైంది కూడా ఒక టీ కొట్టులోనే. టీ కొట్టు మాత్రమే కాదు టీ ఆధారంగా జరిగే వ్యాపారం కూడా వేల కోట్లల్లో ఉందంటే మామూలు విషయం కాదు. ఎన్ని రకాలుగా చెప్పుకున్నా టీ గురించి ముచ్చట ఒడవదు. ఇక సోషల్ మీడియా ప్రాచుర్యంలోకి వచ్చిన తర్వాత టీ గురించి రకరకాల వ్యాఖ్యలు, రకరకాల వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే వీధి చివరన ఉండే టీ కొట్టు గొప్పతనం గురించి సోషల్ మీడియాలో ఒక వీడియో తెగ ప్రాచుర్యం పొందింది. దానిని ఓ నెటిజన్ ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేయగా మిలియన్ వ్యూస్ దక్కించుకుంది.
నోటాన్ దీ మ్యాప్ అనే ఐడీ నుంచి ఈ వీడియో పోస్ట్ అయింది. ఎక్కడో కేరళ రాష్ట్రంలో మారుమూల గ్రామంలో ఉన్న ఓ కొట్టులో ఓ వ్యక్తి టీ తయారు చేస్తున్నాడు. పక్కనే ఉన్న రేడియో నుంచి పాత మలయాళ పాటలు వస్తున్నాయి. వాతావరణం కూడా చాలా చల్లగా ఉంది. కొబ్బరి చెట్లు ఉండడంతో అక్కడి ప్రకృతి కూడా రమణీయంగా ఉంది.. తెల్ల పంచె, బూడిద వర్ణంలో ఉన్న చొక్కా వేసుకున్న వ్యక్తి అదేపనిగా టీ తయారు చేస్తున్నాడు. వేడివేడి డికాషన్, మరిగిన పాలను గాజు గ్లాసులో పోసి తన చేయిని వాలుగా వంచి టీ తయారు చేస్తున్నాడు. అతడు పోసే వేగానికి టీ నురగలు కక్కుతోంది. అతడు తయారు చేసే ఛాయ్ తాగడానికి చాలామంది అక్కడి గ్రామస్తులు రెడీగా ఉన్నారు. ఒక్కొక్కరిది ఒక్కో నేపథ్యం. ఒక్కొక్కరిది ఒక్కో వ్యాపకం. కానీ వారందరినీ కలిపింది ఒక టీ కొట్టు. వారందరి జిహ్వను సంతృప్తిపరిచింది ఒక టీ కొట్టు. అక్కడ ఎన్నో రకాల మాటలు.. ఇంకా ఎన్నో రకాల చర్చలు.. కొన్నిసార్లు బేధాభిప్రాయాలు.. ఇంకొన్నిసార్లు సదాభిప్రాయాలు.. అలాగని అదేం లాంజ్ కాదు.. హార్డ్ రాక్ లాంటి కార్పొరేట్ హంగులు లేవు. జస్ట్ ఓ చిన్న రేకుల షెడ్.. అదేం అడ్డు కాలేదు.. అడ్డు కాదు.. మనుషులు కలుసుకోవడానికి.. మాట్లాడుకోవడానికి వేదికలు కావాలి గానీ.. అడ్డుతెరలు ఎందుకు..
View this post on Instagram