Coconut Water : ఎండాకాలంలో శీతల పానీయాల కంటే.. చక్కర వేసి తయారుచేసిన ద్రవాల కంటే కొబ్బరి నీళ్లు ఎంతో శ్రేయస్కరం. పైగా కొబ్బరి నీళ్ళు అనేవి ప్రకృతి ప్రసాదించిన వరం.. ఇందులో లెక్కకు మిక్కిలి పోషకాలు ఉంటాయి. అదే స్థాయిలో ఖనిజ లవణాలు ఉంటాయి. శరీరానికి సత్వర శక్తిని ఇస్తాయి. కొబ్బరి నీళ్లు తాగ గానే శరీరం కొత్త శక్తిని సంపాదించుకుంటుంది. తద్వారా వెంటనే హైడ్రేట్ అయ్యి ఎప్పటిలాగే ఉత్సాహంగా ఉంటుంది. అందువల్లే ఎండాకాలంలో నీరసానికి గురైన వారు.. వాంతులు విరోచనాల బారిన పడినవారు కొబ్బరి నీళ్లను తక్షణ శక్తి కోసం తీసుకుంటారు.. కొబ్బరి నీళ్లు మాత్రమే కాదు.. కొబ్బరిలో కూడా పోషకాలు మెండుగా ఉంటాయి. అందువల్లే లేత కొబ్బరిని పోషకాలకు గని అని వైద్యులు చెబుతుంటారు.
Also Read : కొబ్బరి బోండాంలోకి నీళ్లు ఎలా వస్తాయో తెలుసా?
వినూత్న ప్రయోగం
సాధారణంగా మనం ఎండాకాలంలో మాత్రమే కాదు.. ఏ కాలంలో అయినా కొబ్బరి బోండాలలో ఉన్న నీటిని తాగడానికి స్ట్రా లను ఉపయోగిస్తాం. ఆ తర్వాత వాటిని పడేస్తాం. స్ట్రా లను అత్యంత సూక్ష్మమైన పాలిథిన్ తో తయారు చేస్తారు. ఇది శరీరానికి ఎంతో ప్రమాదకరం. ఇందులో ప్రమాదకరమైన పాలిథిన్ రేణువులు ఉంటాయి. అవి దీర్ఘకాలంలో శరీరానికి క్యాన్సర్ వ్యాధిని కలగజేస్తాయి. అయితే వీటి నివారణ కోసం తమిళనాడులోని తంజావూర్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి అద్భుతమైన ప్రయోగం చేశాడు. అంతేకాదు దాన్ని అమలులో కూడా పెట్టాడు. అది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మనదేశంలోని కోస్తా ప్రాంతాలు ఉన్న రాష్ట్రాలలో తమిళనాడు కూడా ఒకటి. తమిళనాడు రాష్ట్రంలో తంజావూరు జిల్లాలో కొబ్బరి తోటలు విస్తారంగా ఉంటాయి. ఇక్కడ కొబ్బరికాయలు అధికంగా ఉత్పత్తి అవుతుంటాయి. తంజావూరు ప్రాంతం మీదుగా జాతీయ రహదారులు వెళుతున్న నేపథ్యంలో.. చాలామంది వ్యాపారులు తమ కొబ్బరి బోండాల దుకాణాలను జాతీయ రహదారికి ఇరువైపులా పెట్టుకుంటారు. అలా ఓ వ్యాపారి తన కొబ్బరి బోండాల దుకాణాన్ని జాతీయ రహదారికి పక్కన ఏర్పాటు చేశాడు. అయితే స్ట్రాల వల్ల ఆరోగ్యం పాడవుతుందనే ఉద్దేశంతో.. అతడు వాటికి బదులుగా బొప్పాయి ఆకులతో స్ట్రా లు తయారు చేయడం మొదలుపెట్టాడు. దీనికోసం లేత ఆకులను ఉపయోగించాడు. దీనివల్ల ప్లాస్టిక్ స్ట్రాలు ఉపయోగించే అవకాశం లేకుండా పోయింది. పైగా పర్యావరణహితమైన ఆకులతో తయారుచేసిన స్ట్రా లు ఆరోగ్యానికి ఎంతో మంచిది. అతడు చేసిన ఈ ప్రయోగం అందరిని ఆకట్టుకుంటున్నది. పైగా అతని బోండాల వ్యాపారాన్ని కూడా మూడు పువ్వులు ఆరుకాయలుగా వర్ధిల్లేలా చేస్తోంది. ఇక తోటి వ్యాపారులు కూడా ఇతడినే అనుసరిస్తున్నారు. వారు కూడా బొప్పాయి ఆకులతో స్ట్రాలు తయారు చేస్తూ.. కొబ్బరి బోండాలను విక్రయిస్తున్నారు. తమ వ్యాపారాన్ని కూడా భారీగానే పెంచుకుంటున్నారు.
Also Read : లాయర్, అడ్వకేట్, బారిస్టర్ ల మధ్య తేడా ఏంటి? ఎవరు ఎవరి వైపు ఉంటారు?