
Ramoji Rao- Sailaja Kiran: టార్గెట్… చంద్రబాబు ఆర్థిక స్తంభాలను ఒక్కొక్కటిగా పెకిలించి వేయడం.. గత కొన్ని సంవత్సరాలుగా జగన్ అదే చేస్తున్నాడు. చంద్రబాబు చుట్టూ గట్టి ఉచ్చు బిగిస్తున్నాడు. అందులో తాజాగా చిక్కుకున్నది రామోజీరావు. తన తండ్రి బతికి ఉన్నప్పుడు చేయలేనిది.. తనయుడిగా ఇప్పుడు జగన్ చేస్తున్నాడు. అన్నదాత మ్యాగజిన్ మూత, డాల్ఫిన్ హోటల్ కు ప్రభుత్వపరంగా అధికారులు వెళ్లకుండా కోత, మార్గదర్శి లో ప్రజలు చిట్స్ వేయకుండా చూడటం.. ఇవీ జగన్ టార్గెట్ తాలూకు అస్త్రాలు. ఏ మాటకు ఆ మాటే కాకలు తీరిన రామోజీరావును వణికిస్తున్నాడంటే మామూలు విషయం కాదు. గతంలో రామోజీరావు మీద ఏదైనా ప్రభుత్వపరంగా చర్య తీసుకుంటే అతడు కాంగ్రెస్ పెద్దలకు చెప్పేవాడు.. వారు వైయస్ రాజశేఖర్ రెడ్డి దూకుడు తగ్గించేవారు. మార్గదర్శి మీద అంటి ముట్టనట్టు ఉండాలని సూచించేవారు. కానీ ఇప్పుడు జగన్ కు ఎవరు చెప్పగలరు? చెప్పినా జగన్ వింటాడన్న గ్యారెంటీ లేదు. పైగా జగన్మోహన్ రెడ్డి ది ప్రాంతీయ పార్టీ. తనకు తానే బాస్.. అంటే ఎవరి మాట వినాల్సిన అవసరం అతనికి లేదు.
ఇక మార్గదర్శి విషయంలో ఏపీ సిఐడి అధికారులు ప్రభుత్వ పెద్దల సూచనలతో అడుగులు వేగంగా వేస్తున్నారు. ఇప్పటికే మార్గదర్శి సంస్థ మీద కేసులు నమోదు చేశారు. సోమవారం మార్గదర్శి చిట్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండి శైలజా కిరణ్ ను ప్రశ్నించడం ప్రారంభించారు.. ఈనాడు గ్రూపు సంస్థల యజమాని రామోజీరావును కూడా ప్రశ్నించడం మొదలుపెట్టారు. 200 మంది సిఐడి అధికారులు ఒక బృందంగా వెళ్లి మార్గదర్శి వ్యవహారాలను కనుక్కునే పనిలో ఉన్నట్టు సమాచారం. ఇక అధికారులు ఎటువంటి ప్రశ్నలు అడుగుతున్నారు, ఎటువంటి వివరాలు సేకరించే పనిలో పడ్డారు అనే విషయాల్లో చాలా గోప్యత పాటిస్తున్నారు.
ఇక మార్గదర్శి చిట్ ఫండ్స్ విషయానికి వస్తే ఏపీ సిఐడి నమోదు చేసిన కేసుల వ్యవహారంలో వివరణ ఇవ్వాలని గతవారం రామోజీరావుకు, శైలజ కు నోటీసులు జారీ చేశారు. చిట్ ఫండ్ చట్టాన్ని విలంగించి డిపాజిటర్ల సొమ్మును ఇతర సంస్థల్లోకి మళ్లించడం, అక్రమంగా డిపాజిట్లు సేకరించడం వంటి వ్యవహారాలపై సిఐడి దర్యాప్తు జరుపుతున్నట్టు తెలుస్తోంది.. అయితే ఈ దర్యాప్తులో భాగంగానే మార్గదర్శి, ఈనాడు సంస్థల బాధ్యు లైన రామోజీ రావు, శైలజ ను సిఐడి అధికారులు విచారిస్తున్నారు. ” చందాదారుల సొమ్మును మ్యూచువల్ ఫండ్స్ లో, మార్కెట్లో ఎందుకు పెట్టుబడులుగా పెట్టారు? ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనలకు విరుద్ధమని మీకు తెలియదా? ఖాతాదారుల సొమ్మును డిపాజిట్లుగా సేకరించడం ఎంతవరకు కరెక్ట్? అనే విషయాలపై సిఐడి అధికారులు ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ వ్యవహారంలో సిఐడి జరిపిన హోదాల్లో నలుగురు మార్గదర్శి ఉద్యోగులను అరెస్టు చేశారు. మార్గదర్శి ఆడిట్ వ్యవహారాలు చూసిన బ్రహ్మయ్య అండ్ కో కంపెనీ ఆడిటర్ శ్రావణ్ ను కూడా ఎడి పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక ఇప్పటికే మార్గదర్శి ఫారం 21 సమర్పించలేదు.. ఆ సంస్థపై ఐపీసీ సెక్షన్లు 420, 409, 120 బీ, 477 రెడ్ విత్ 34 కింద సిఐడి పోలీసులు కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. గతంలో నిర్వహించిన తనిఖీల్లో మార్గదర్శి సంస్థ చిట్ ఫండ్స్ రెగ్యులేటరీ విరుద్ధంగా ఉమ్మడి ఖాతాలో నిర్వహిస్తోందని అధికారులు గుర్తించారు. చీటీ పాటల సొమ్మును ఒకే ఖాతాకు బదాలాయిస్తున్నట్టు గుర్తించారు.. ఖాళీగా ఉన్న చిట్లలో సొమ్మును ఎగవేయడం, బ్యాంకు ఫోర్ మెన్ తో సంబంధం లేకుండా ఏకీకృత ఖాతాలో లావాదేవీలు నిర్వహించడం వంటి అవకతవకలకు పాల్పడినట్టు అధికారుల తనిఖీల్లో గుర్తించారు. మార్గదర్శిపై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశించినప్పటికీ.. ఏపీ సిఐడి అధికారులు రామోజీరావు, శైలజను విచారిస్తుండటం విశేషం.