
China Colleges: మంది ఎక్కువైతే మజ్జిగ పలచన అవుతుంది అంటారు. ఆ సామెత సంగతి ఏమోగానీ ఇప్పుడు జనాభా తగ్గుతోంది చైనా దేశం విలవిలలాడుతోంది. నిన్నా మొన్నటి దాకా అత్యధిక జనాభాతో ప్రపంచంలోనే నెంబర్ వన్ ర్యాంకులో చైనా దేశం ఉండేది. ఇప్పుడు ఆ స్థానాన్ని భారత్ ఆక్రమించేసింది. జనాభా తగ్గుతుండటం, అది మానవ వనరులపై తీవ్ర ప్రభావం చూపుతున్నది. పైగా ఇటీవల చైనాలో జననాలు, వివాహ శాతాలు దారుణంగా పడిపోతున్నాయి. గడచిన ఆరు దశాబ్దాలలో తొలిసారిగా గత ఏడాది చైనా దేశంలో జనాభా తగ్గుముఖం పట్టింది. దీంతో చైనా దిద్దుబాటు చర్యల్ని ప్రారంభించింది.
ప్రేమించుకోండి
సాధారణంగా కాలేజీలో పిల్లలు ప్రేమ అంటే మందలిస్తాం. అని చైనా మాత్రం తమ దేశ యువతీ యువకులను ప్రేమించుకోండి అంటూ ఉత్సాహపరుస్తోంది. విద్యార్థులు పీకల్లోతు ప్రేమలో మునిగి తేలేందుకు ఏకంగా ఏడు రోజులపాటు సెలవులు ఇస్తున్నది. దీంతోపాటు అదనంగా సెలవులు కావాలంటే కూడా ఇస్తామని ప్రకటిస్తోంది. ఎందుకంటే చైనాకు ప్రధాన బలం దాని ఉత్పాదక సామర్థ్యం. ప్రపంచ దేశాలను దాని ఉత్పాదక సామర్థ్యం ద్వారానే శాసిస్తోంది. అలాంటి చైనాలో ఇప్పుడు జనాభా తగ్గు ముఖం పట్టడంతో ఉత్పాదక సామర్థ్యం గణనీయంగా పడిపోతోంది. దీనివల్ల వివిధ వర్క్ ఆర్డర్లు భారత్ లాంటి దేశాలకు వెళ్ళిపోతున్నాయి. ఇది అంతిమంగా చైనా దేశపు ఆర్థిక ప్రగతిపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఈ సమస్యను పరిష్కరించాలంటే జనాభా పెరగడమే కారణమని చైనా ఒక నిర్ణయానికి వచ్చింది. అందులో భాగంగానే యువత ప్రేమకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గట్టిగా ప్రేమించుకునేందుకు వారం పాటు సెలవులు కూడా ఇస్తోంది. కార్పొరేట్ సంస్థలకు కూడా ఈ ఆదేశాలు జారీ చేసింది.
ఇక చైనాలో గత కొంతకాలంగా అనుకున్నంత స్థాయిలో వివాహాలు జరగడం లేదు. ఇందుకు కారణం లేకపోలేదు. కొన్ని కొన్ని ఫ్రావిన్స్ లలో ఆడపిల్లల శాతం చాలా తక్కువగా ఉంది. పైగా వరకట్నాలు కూడా తార స్థాయికి చేరుకున్నాయి. దీంతో చాలామంది ఆడపిల్లలను కనడమే మానేశారు. ఒకవేళ ఆడపిల్లలు పుడుతున్నారని తెలుసుకొని వారిని గర్భంలోనే చిదిమేశారు. దీంతో లింగ నిష్పత్తి దారుణంగా పడిపోయింది. ఫలితంగా చాలా మంది యువకులకు పెళ్లిళ్లు కాకుండా అలా ఉండిపోయారు. దీనికి తోడు కెరియర్ తాలూకు ఒత్తిడి వల్ల చాలామంది పెళ్లిళ్లు కూడా చేసుకోవడం లేదు.

మరో వైపు చైనా ప్రభుత్వం జనాభా నియంత్రణకు కఠినమైన నిబంధనలను అమలు చేసింది. ఒకరు ముద్దు లేకుంటే అసలు వద్దు అనే నినాదాన్ని తెరపైకి తీసుకురావడంతో జనాభా తగ్గిపోయింది. ఆ ప్రభావం ఇప్పుడు చైనా పై స్పష్టంగా కనిపిస్తోంది. ఈ నష్టాన్ని గుర్తించిన అక్కడి ప్రభుత్వం ఇప్పుడు మళ్లీ ప్రేమించుకోండి డూడ్ అంటూ యువతకు వాత్సాయన పాఠాలు చెబుతోంది. పాపం చైనా.. అటు పెరిగినా కష్టమే..ఇటు తగ్గినా కష్టమే..