https://oktelugu.com/

Chandrayaan 3 Technician: 18 నెలలుగా జీతం లేదు.. ఇడ్లీలు అమ్ముతున్న చంద్రయాన్_3 టెక్నీషియన్

ఇటీవల ఇస్రో విజయవంతంగా ప్రయోగించిన చంద్రయాన్_3 ప్రయోగం వల్ల భారత కీర్తి ప్రపంచవ్యాప్తంగా రెపరెపలాడింది. చంద్రుడి దక్షిణ ధ్రువం మీద కాలు మోపిన నాలుగవ దేశంగా భారత్ రికార్డు సృష్టించింది.

Written By:
  • Rocky
  • , Updated On : September 20, 2023 / 01:20 PM IST

    Chandrayaan 3 Technician

    Follow us on

    Chandrayaan 3 Technician: నెల మొత్తం పని చేస్తే ఒకటో తారీఖు ఖాతాలో నగదు జమ కాకుంటే.. ఆ ఉద్యోగి పరిస్థితి ఎలా ఉంటుంది? చాలా దారుణంగా ఉంటుంది. ప్రస్తుతం ఖర్చులు నింగిని అంటిన నేపథ్యంలో ఒక నెల జీతం సరిగ్గా రాకపోయినా ఆ ఉద్యోగి పడే ఇబ్బందులు అన్ని ఇన్ని కావు. అలాంటిది ఏకంగా 18 నెలలపాటు అతడికి వేతనం రాలేదు. పైగా అతడు పనిచేస్తోంది ఏ చిన్న పాటి ప్రైవేటు కంపెనీ కాదు. అతను పని చేస్తున్న సంస్థ ఆషామాషిది అంతకన్నా కాదు. అధికారులకు చెప్పినా పట్టించుకోకపోవడంతో అతడు ఇడ్లీలు అమ్ముకుంటున్నాడు. అతని పరిస్థితి చూసి కొంతమంది వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. దీంతో అతడు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాడు.

    ఇటీవల ఇస్రో విజయవంతంగా ప్రయోగించిన చంద్రయాన్_3 ప్రయోగం వల్ల భారత కీర్తి ప్రపంచవ్యాప్తంగా రెపరెపలాడింది. చంద్రుడి దక్షిణ ధ్రువం మీద కాలు మోపిన నాలుగవ దేశంగా భారత్ రికార్డు సృష్టించింది. అయితే ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్_3 కి లాంచ్ ప్యాడ్ తయారుచేసిన సభ్యుల్లో ఒకరైన దీపక్ కుమార్ ఉప్రారియా ప్రస్తుతం ఇడ్లీలు అమ్ముకుంటున్నారు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది ముమ్మాటికీ నిజం. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన దీపక్ కుమార్ 2019లో భారత ప్రభుత్వ రంగ సంస్థలైన హెవీ ఇంజనీరింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ లో టెక్నీషియన్ గా చేరారు. కొన్ని రోజులు ఆయన కుటుంబ పోషణ కోసం రాంచీలో రోడ్డు పక్కన ఇడ్లీ బండి పెట్టుకున్నారు. ఉదయం ఇడ్లీలు అమ్మి ఆఫీసుకు వెళ్తూ.. తిరిగి సాయంత్రం వచ్చి అదే పని చేస్తున్నారు. దీనికి కారణం 18 నెలలుగా తాను పనిచేస్తున్న సంస్థలో ఉద్యోగులకు జీతాలు అందకపోవడమే.

    అయితే దీపక్ కుమార్ ఇడ్లీలు అమ్ముతున్న తీరుపై కొందరు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టారు. దీంతో ఒక్కసారిగా దీపక్ కుమార్ వైరల్ వ్యక్తిగా మారిపోయారు..”మొదట క్రెడిట్ కార్డు తీసుకుని కుటుంబాన్ని నెట్టుకొచ్చాను. రెండు లక్షల అప్పు తీర్చకపోవడంతో వారు నన్ను డిఫాల్టర్ గా ప్రకటించారు. అనంతరం నా భార్య నగలు తాకట్టుపెట్టి కుటుంబాన్ని కొన్ని రోజులపాటు పోషించాను. ఇక ఆకలితో చావకూడదని నిర్ణయించుకుని ఇడ్లీ బండి పెట్టాను. భార్య ఇడ్లీలు బాగా చేస్తుంది. రోజుకు మాకు మూడు నుంచి 400 వస్తున్నాయి. పెట్టుబడి పోను 50 నుంచి 100 వరకు మిగులుతున్నాయి. వీటితోనే కుటుంబాన్ని పోషించుకుంటున్నాను”అని దీపక్ కుమార్ ఆ వీడియోలో పేర్కొన్నారు. కాగా ఈ వీడియో చూసిన నెటిజన్లు ప్రభుత్వం తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వందల కోట్లు ఖర్చుపెట్టి ప్రయోగాలు చేస్తున్న సంస్థ.. ఆ విజయానికి కారణమైన ఉద్యోగులకు జీతాలు ఇవ్వకపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.. ప్రయోగం విజయవంతమైతే చప్పట్లు కొట్టే అధికారులు.. ఉద్యోగుల విషయంలో ఎందుకు ఇంత ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని వారు ధ్వజమెత్తుతున్నారు. మరి కొంతమంది దీపక్ కుమార్ కు అండగా ఉంటామని ముందుకు వచ్చారు. అతడి అకౌంట్ నెంబర్ చెబితే తాము సహాయం చేస్తామని ప్రకటించారు. అయితే దీపక్ కుమార్ ఉదంతం బయటి ప్రపంచానికి తెలియడంతో హెచ్ ఈ సీ అధికారులు అప్రమత్తమైనట్టు తెలుస్తోంది.