
Chandrababu- Lokesh: టీడీపీలో లోకేష్ పాత్ర పెరిగిందా? పార్టీ హైకమాండ్ అంటే లోకేషే అన్న నిర్ణయానికి శ్రేణులు వచ్చారా? పార్టీకి కర్త,కర్మ, క్రియ అన్నీ ఆయనేనని డిసైడయ్యారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. ప్రస్తుతం లోకేష్ యువగళం పాదయాత్ర కొనసాగుతోంది. దాదాపు 70 రోజులు పూర్తిచేసుకుంది. మరో ఏడాది పాటు పాదయాత్ర మిగిలి ఉంది. అయితే గతం కంటే మెరుగైన పరిణితిని లోకేష్ కనబరుస్తున్నారు. పార్టీ శ్రేణుల అంచనాలకు చేరువ అవుతున్నారు. అయితే పార్టీ శ్రేణుల్లో ఈ ఫీలింగ్ తేవడానికే చంద్రబాబు లోకేష్ పాదయాత్రకు ప్లాన్ చేసినట్టు విశ్లేషణలు ఉన్నాయి.
తనయుడి విషయంలో తప్పటడుగులు..
చంద్రబాబు లోకేష్ పొలిటికల్ ఎంట్రీ విషయంలో తప్పటడుగులు వేశారన్న కామెంట్స్ అయితే ఉన్నాయి. 2014లో అధికారంలోకి వచ్చిన తరువాత లోకేష్ కు టీడీపీలో యాక్టివ్ రోల్ ఇచ్చారు. వస్తూవస్తూనే ఎమ్మెల్సీగా పదవి ఇచ్చారు. తరువాత మంత్రిగా చేశారు. అయితే విద్యాధికుడిగా.. అడ్మినిస్ట్రేటర్ గా లోకేష్ రాణించే చాన్స్ ఉన్నా.. నాయకుడిగా ఎదిగేందుకు మాత్రం ఇవేవీ దోహదపడలేదు. దొడ్డిదారిన పార్టీలో రుద్దబడ్డారన్న అపవాదు లోకేష్ పై పడింది. ప్రత్యక్ష రాజకీయాల ద్వారా అరంగేట్రం చేయించకుండా.. పరోక్షంగా ఎమ్మెల్సీ పదవి ఇచ్చి ఎంకరేజ్ చేయడంతో లోకేష్ ను టీడీపీ శ్రేణులు సైతం నాయకుడిగా గుర్తించలేకపోయాయి. 2019 ఎన్నికల్లో లోకేష్ ఓటమితో అనుమానాలు మరింత పెరిగాయి. దీంతో చంద్రబాబు పునరాలోచనలో పడ్డారు. అందుకే యువగళం పాదయాత్ర చేయిస్తున్నారు.
ఎంట్రీతోనే పార్టీపై పట్టు..
అయితే టీడీపీలో చంద్రబాబు ఎదుగుదల అనూహ్యం. ముందుగా పార్టీపై పట్టు సాధించడం ద్వారానే ఈ స్థాయికి రాగలిగారు. ఎన్టీఆర్ సీఎంగా ఉన్న సమయంలో కాంగ్రెస్ నుంచి చంద్రబాబు వచ్చారు. అప్పటికే దగ్గుబాటి వెంకటేశ్వరరావు, ఉపేంద్ర వంటి వారు ఎన్టీఆర్ తరువాత నాయకులుగా చలామణి అవుతున్నారు. అటువంటి సమయంలో ప్రభుత్వం కంటే పార్టీకే చంద్రబాబు ప్రాధాన్యమిచ్చారు. బూత్ లెవల్ నాయకుల నుంచి సర్పంచ్ లు, ఎంపీపీలు, ఎమ్మెల్యేలతో మమేకమై పనిచేశారు. దీంతో పార్టీని చూసుకునేది చంద్రబాబు అన్న ఫీలింగ్ అప్పట్లో కల్పించారు. 1995 టీడీపీ సంక్షోభ సమయంలో పార్టీ టేకోవర్ చేసుకోవడానికి చంద్రబాబుకు ఆ కారణమే దోహదపడింది. ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచారన్న అంశాన్ని అధిగమించడానికి, టీడీపీ శ్రేణులు తమ నాయకుడిగా యాక్సప్ట్ చేయడానికి ఆ ఫీలింగ్ సజీవంగా ఉంచడమే కారణమని ఇప్పటికీ విశ్లేషణలు వెలువడుతున్నాయి.

లోకేష్ పై అప్లయ్..
నాడు తాను అనుసరించిన ఫార్ములానే ఇప్పుడు లోకేష్ పై చంద్రబాబు అప్లయ్ చేస్తున్నారు. లోకేష్ తమ భావి నాయకుడు అని ఫీలింగ్ తెచ్చేలా పావులు కదుపుతున్నారు. ప్రస్తుతం యువగళం పాదయాత్రలో లోకేష్ చేస్తున్నది కూడా అదే. నేరుగా కిందిస్థాయి కేడర్ తోనే మమేకమవుతున్నారు. అటు తన పాదయాత్రలో కీలకమైన కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థుల పేర్లను సైతం లోకేష్ తోనే ప్రకటన చేస్తున్నారు. దీంతో పార్టీలో లోకేష్ ఫైనల్ అన్న ఫీలింగ్ వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. మొత్తానికైతే నాడు తండ్రి ఫార్ములాతో పార్టీపై పట్టుకు గట్టి స్కెచ్ వేస్తున్నారన్న మాట. ఇది ఎంతవరకూ వర్కవుట్ అవుతుందో చూడాలి మరీ.