
Chandrababu- BJP: అందితే జుత్తు.. లేకుంటే కాలు.. చంద్రబాబు నమ్మిన ఫార్ములా ఇది. ఈ విషయం తెలిసే ఆయన ఎంతలా ప్రయత్నిస్తున్నా బీజేపీ హైకమాండ్ కు మనసు మారడం లేదు. కలిసి వెళదామన్న ప్రతిపాదనను నమ్మడం లేదు. మొన్నటివరకూ బీజేపీ కోసం పాకులాడిన చంద్రబాబు ఇప్పుడు అదే పార్టీని లెక్కచేయడం లేదన్న టాక్ అయితే ప్రారంభమైంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో దక్కిన విజయంతో ఊపు మీద ఉన్న చంద్రబాబు ఇక వైసీపీ పని అయిపోయిందన్న స్థిర నిశ్చయానికి వచ్చేశారు. రాష్ట్ర ప్రజలు టీడీపీనే ప్రత్యామ్నాయంగా కోరుకుంటున్నారని బలంగా నమ్ముతున్నారు. అందుకే ఇక బీజేపీతో పనిలేదన్నట్టు భావిస్తున్నారు. ఇప్పటివరకూ జాతీయ స్థాయిలో ఎటువంటి మార్పులు, నిర్ణయాలు, విజయాలు దక్కినా బీజేపీని ఆకాశానికి ఎత్తేసేవారు. కానీ పట్టభద్రుల స్థానంలో టీడీపీకి విజయం దక్కడంలో ఓ మూడు పార్టీలకు భాగస్వామ్యం కల్పించిన చంద్రబాబు బీజేపీని మాత్రం పక్కన పడేశారు.
పట్టభద్రుల స్థానాల్లో విజయం ఒక్క టీడీపీదే కాదు. ప్రభుత్వంపై వ్యతిరేకత ఒక వైపు, పవన్ కళ్యాణ్ వైసీపీకి వ్యతిరేకంగా ఇచ్చిన పిలుపు మరోవైపు, ఇతర రాజకీయ పక్షాలు రెండో ప్రాధాన్యత ఓట్లు టీడీపీ అభ్యర్థికి వేయడం తదితర కారణాలు వెరసి టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు. కానీ చంద్రబాబు మాత్రం సీపీఎం, సీపీఐ, జనసేన పార్టీ రథసారథులకు ఆయన కృతజ్ఞతలు చెప్పారు. కానీ ఆయన బీజేపీని మరిచిపోయారు. ఉద్దేశపూర్వకంగా మరిచిపోయినట్టున్నారు. ఇన్నాళ్లూ తనతో కలిసి రావడానికి ఇష్టపడని బీజేపీకి వ్యూహాత్మకంగా దెబ్బకొట్టాలని భావించే ఇలా వ్యవహరించారంటూ టాక్ ప్రారంభమైంది.
వచ్చే ఎన్నికల్లో కలిసివెళదామన్న ప్రతిపాదనకు బీజేపీ రాష్ట్ర నాయకులే అడ్డు చెబుతున్నారని చంద్రబాబు భావిస్తున్నారు. వారిని వైసీపీ అనుకూలురుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు లాంటి టీడీపీ అనుకూలురు అయిన నేతలతో స్టేట్ మెంట్ ఇప్పిస్తున్నారు. బీజేపీ, వైసీపీ ఒకటేనన్న భావనతోనే పట్టభద్రులు బీజేపీకి ఓటు వేయలేదన్న భావన వచ్చేలా మాట్లాడిస్తున్నారు. వాస్తవానికి బీజేపీ సైతం తన రెండో ప్రాధాన్యత ఓట్లను టీడీపీకి బదలాయించింది. అటు పార్టీ శ్రేణులు సైతం వైసీపీ విధానాను వ్యతిరేకించి బలమైన అభ్యర్థి అయిన టీడీపీ క్యాండిడేట్లకు ఓటు వేశారు. అయితే ఇంత చేసినా తమకు కనీసం చంద్రబాబు కృతజ్ఞతలు చెప్పకపోవడంపై బీజేపీ నేతలు హర్ట్ అయ్యారు. చంద్రబాబు రాజకీయ అవసరాలను బట్టి వ్యవహరిస్తుంటారనేందుకు ఇదే నిదర్శనమంటున్నారు. ఇదే విషయాన్ని హైకమాండ్ కు చేరవేస్తున్నారు.

ఒక వైపు రాష్ట్రంలో బీజేపీని ఎంత నిర్వీర్యం చేయాలో అంతలా చేస్తున్నారు. లెఫ్ట్ పార్టీలను లైమ్ లైట్ లోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. అటు టీడీపీతో పొత్తు పెట్టుకోవాలని తన అనుకూలమైన బీజేపీ నేతలతో హైకమాండ్ కు ఒప్పించేందుకు పాకులాడుతున్నారు, అదే సమయంలో సోము వీర్రాజును అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించాలని పావులు కదుపుతున్నారు. ఎటుచూసినా అది బీజేపీకి నష్టంగానే కనిపిస్తోంది. బీజేపీకి చంద్రబాబు నీడలా వెంటాడుతున్నారని.. అందుకే ఏపీలో బీజేపీ ఎదగలేదకపోతోందని హార్ట్ కోర్ కాషాయ దళం తెగ బాధపడిపోతోంది. మరి చంద్రబాబు స్కెచ్ కు మరోసారి బీజేపీ చిక్కుతుందో.. లేక తెలివిగా బయటపడుతుందో చూడాలి మరీ.