
Chandrababu- Kodali Nani: ఏపీలో అధికార పార్టీలో ఓ సంస్కృతి నడుస్తోంది. ఎక్కడా పార్టీ కీలక నాయకులు ఎవరూ వాయిస్ వినిపించరు. పెద్దగా కనిపించరు. ఎక్కువగా మాట్లాడేది కొందరు తాజా మాజీ మంత్రులు మాత్రమే. జగన్ పై ఎవరైనా విమర్శలు చేసినా.. పార్టీపై, ప్రభుత్వంపై ఆరోపణలు చేసినా వారే రియాక్టవుతారు. నోటికి ఎంత పనిచెప్పాలో అంతగా చెబుతారు. అయితే ఇటువంటి నోరున్న నేతల్లో కొడాలి నాని ఒకరు. ఆయనలా చంద్రబాబు, లోకేష్ పై కౌంటర్ ఎటాక్ చేసిన నేతలెవరూ లేరు. బహుశా ఏ ప్రభుత్వంలోనూ.. ఏ నేతా చేయని విధంగా కొడాలి నాని తండ్రీ కొడుకులను టార్గెట్ చేస్తూ మాట్లాడుతుంటారు. వయసు, హోదా అని చూడకుండా నోటికి ఎంతొస్తే అంత మాట మాట్లాడేస్తుంటారు. అందుకే కొడాలి నానిని ఓడించాలని చంద్రబాబు ధ్యేయంగా పెట్టుకున్నారు. గత రెండుసార్లు ప్రయోగం చేశారు. కానీ సక్సెస్ కాలేదు. కానీ ఈసారి గుడివాడలో బలమైన ప్రత్యర్థిని బరిలో దించే పనిలో పడ్డారు.
2004 నుంచి నాని వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. గుడివాడ నుంచి తనను ఎవరు ఓడించేది అంటూ బహిరంగంగానే కామెంట్స్ చేస్తుంటారు. చంద్రబాబు, ఆయన కుమారుడు గుడివాడ నుంచి పోటీ చేయాలని సవాల్ విసురుతుంటారు. నందమూరి కుటుంబసభ్యలను కార్నర్ చేసుకొని చంద్రబాబుపై విమర్శలకు దిగుతుంటారు. అందుకే ఈ సారి నందమూరి కుటుంబసభ్యులతో పోటీ చేయించాలని భావించారు. అదో ఆప్షన్ గా పెట్టుకున్నారు. ఇప్పుడు బలమైన నేత ఒకరు గుడివాడ నుంచి పోటీచేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఆర్థిక, అంగ బలం ఉండడంతో ఆయన సరైన అభ్యర్థి అవుతారని టీడీపీ శ్రేణులు భావిస్తున్నాయి.

ప్రస్తుతం టీడీపీ నియోజకవర్గ ఇన్ చార్జిగా రావి వెంకటేశ్వరరావు ఉన్నారు. ఆయన నేతృత్వంలోనే పార్టీ కార్యక్రమాలు జరుగుతున్నాయి. గత ఎన్నికల్లో కూడా రావి టిక్కెట్ ఆశించారు. కానీ చంద్రబాబు అనూహ్యంగా దేవినేని అవినాష్ ను రంగంలోకి దించారు. అయినా నిరాశే ఎదురైంది. ఎన్నికల అనంతరం అవినాష్ వైసీపీ గూటికి చేరిపోయారు. దీంతో మళ్లీ రావి వెంకటేశ్వరావు పార్టీ బాధ్యతలు చూస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీచేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. తనకే టిక్కెట్ లభిస్తుందని నమ్మకంగా ఉన్నారు.
అయితే నియోజకవర్గంలో ఎన్ఆర్ఐ వెనిగండ్ల రాము సామాజిక కార్యక్రమాలను గత కొంతకాలంగా చేపడుతున్నారు.ప్రజల్లోకి బలంగా వెళుతున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ టిక్కెట్ తనకేనంటూ ఆయన అనుచరులు చెబుతున్నారు. దీంతో టీడీపీ శ్రేణుల్లో గందరగోళం నెలకొంది. ఇది ఇలాగే కొనసాగితే అసలుకే ఎసరు వస్తుందని భావించిన హైకమాండ్ రావి వెంకటేశ్వరరావు, వెనిగండ్ల రామును పిలిపించుకుంది. సుదీర్ఘంగా చర్చించింది. రాము వైపే అధిష్టానం మొగ్గుచూపినట్టు సమాచారం. రావి వెంకటేశ్వరరావుకు ప్రత్యామ్నాయంగా పదవి ఇస్తామని చెప్పినట్టు తెలుస్తోంది. దీంతో సమావేశం అనంతరం బయటకు వచ్చిన రావి వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ రాముతో తమకు విభేదాలు లేవన్నారు. వచ్చే ఎన్నికల్లో గుడివాడ టిక్కెట్ ఎవరికి ఇచ్చినా కలిసి పనిచేస్తామని ప్రకటించారు. దీంతో కొడాలి నానికి చెక్ చెప్పేందుకు కరెక్ట్ నేతను చంద్రబాబు ఎంపిక చేసినట్టయ్యింది.