Hyderabad Murder: అది హైదరాబాదులోని కులుసుంపుర ప్రాంతం. రోడ్డంతా రద్దీగా ఉంది. బైక్ పై వెళ్తున్న ఓ 35 ఏళ్ల వ్యక్తిని బైక్ లపై వచ్చిన ముగ్గురు దుండగులు అడ్డగించారు. కిందపడేసి వేట కొడవలితో నరికారు. రాడ్డులతో కొట్టి కొట్టి చంపేశారు.. అటుగా వెళుతున్న వారు ఆ దారుణాన్ని ఆపే ప్రయత్నం చేయలేదు. కొందరైతే మాకెందుకులే అన్నట్టుగా వెళ్లిపోయారు. ఇంకొందరు ఆ దారుణాన్ని ఫోన్లలో చిత్రీకరించారు. తామేదో గొప్ప పని చేశామన్నట్టుగా సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు.. ఇది ఒకటే కాదు ఇటీవల కాలంలో చాలా సందర్భాల్లో ఇలాగే జరిగింది. జరుగుతోంది.. మొత్తానికి మానవత్వం అనేది మంట కలిసి పోతుంది. మనుషుల్లో సున్నితత్వం కుంచించుకుపోయి కళ్ళ ముందు హత్య జరుగుతుంటే అడ్డుకోవడం అటు ఉంచి… సెల్ ఫోన్ లో చిత్రీకరించి, ” నా కళ్ళముందే ఈ హత్య జరిగింది తెలుసా” అన్నట్టుగా ఆ వీడియోలను వైరల్ చేసే పైశాచికత్వం పెరిగిపోతోంది.. ఈ హత్యలను కూడా ఏదో చిన్నా చితక నేరాన్ని చూసినట్టు చూసి వెళ్ళిపోతున్న వారి సంఖ్య పెరిగిపోతున్నది. మారణాయుధంతో ఒక వ్యక్తిని చంపేంత ఆవేశంలో ఉన్న వారిని అడ్డుకోవాలన్నా, ఆపాలన్నా భయం ఉండడాన్ని అర్థం చేసుకోవచ్చు. కానీ పోలీసులకు సమాచారం ఇవ్వకపోవడం మాత్రం క్షమించరాని నేరమే కదా!

ఆదివారం కులుసుంపుర పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన దారుణాన్ని వీడియో తీసిన వారిలో ఈ ఒక్కరైనా డయల్ 100 కు కాల్ చేసి ఉంటే రెండు వైపులా రోడ్డును కవర్ చేసి పోలీసులు నిందితులను పట్టుకునే అవకాశం ఉండేది.. అని అలా జరగబోయే సరికి నిందితులు చంపి సేఫ్ గా వెళ్లిపోయారు. ఇలాంటి ఘటనల్లో నిందితులు సకాలంలో పట్టుబడకపోవడం, చెక్కిన సరైన సాక్ష్యా ధారాలు లేక వారికి శిక్ష పడటంలో జాప్యం వంటి సమస్యలు ఉంటాయి. ఇవి నేరగాళ్లకు వరాలుగా మారుతుంటాయి. నడిరోడ్డుపై హత్య చేసినా జైలు శిక్ష పడదని ధీమా వారిలో పెరుగుతుంది.
ప్రస్తుతం సెల్ ఫోన్లు మన జీవితంలోకి చర్చకు వచ్చాయి. ఇలాంటి వీడియోలు సామాజిక మాధ్యమాల ద్వారా చూడటం వల్ల పిల్లలు, సునీత మనస్కుల హృదయాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి.. మారణాయుధాలతో దారుణంగా దాడులు చేయడం, ఇష్టానుసారంగా కత్తులతో నాట్యమాడటం, తల్వార్లతో సంచరిస్తున్న వీడియోలు వైరల్ కావడంతో ప్రతి ఫోన్లోకి చేరుతున్నాయి.. ఇలాంటి వాటివల్ల సమాజంపై తీవ్ర ప్రభావం పడుతుందని మనస్తత్వ శాస్త్ర నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఎన్నో దారుణాలు
మూడు సంవత్సరాల క్రితం హైదరాబాదులోని అత్తాపూర్ వద్ద నడిరోడ్డు పై జరిగిన హత్య, ఆ సమయంలో పోలీసులు కూడా ప్రేక్షక పాత్ర వహించడం, ఆ క్లిప్పింగులు సోషల్ మీడియాలో వైరల్ కావడం ప్రజల్లో చర్చనీయాంశంగా మారాయి.
మీర్ చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఐసిఐసిఐ బ్యాంక్ ఎదురుగా చంచల్ గూడకు చెందిన ఆటో డ్రైవర్ అద్దె ఇచ్చే విషయంలో గొడవకు దిగి తన స్నేహితుడినే రోడ్డుపై దారుణంగా హతమార్చాడు. అతడు కత్తితో తాపీగా హత్య చేస్తుంటే చుట్టుపక్కల ఉన్న వారంతా వీడియోలు తీశారు.. తప్ప అడ్డుకునే ప్రయత్నం చేయలేదు.

వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని బిఎన్ రెడ్డి నగర్ లో నివసిస్తున్న వ్యక్తి వ్యాపార నిమిత్తం బయటకు రాగా… మాటు వేసిన కొంతమంది వ్యక్తులు వేట కొడవళ్ళు, ఇనుప రాడ్లతో దాడి చేసి అతడిని హత మార్చారు…
చార్మినార్ వద్ద జరిగిన టిడిపి నాయకుడి హత్య అప్పట్లో కలకలం సృష్టించింది.
మంగళ్ హాట్ లో తల్వార్లతో సంచరించి ఎమ్మెల్యేగా పోటీ చేసిన అభ్యర్థి వీడియో కూడా వైరల్ గా మారాయి. ఇలాంటి సందర్భాల్లో ప్రజలు ప్రేక్షక పాత్రకు పరిమితం కావడం వల్ల దారుణాలకు అడ్డుకట్ట పడటం లేదు.