Brutal Murder On Hyderabad: హైదరాబాద్ విశ్వనగరంగా మారుతోంది.. అత్యంత భద్రత ఉన్న నగరాల్లో మన హైదరాబాద్ ఒకటి.. నగరంలో ప్రతీ ఇంచు నిఘా నీడలో ఉంది.. చీమ చిటుక్కుమన్నా పోలీసులు ఘటన స్థలానికి చేరుకుంటారు.. ఎలాంటి గొడవలు.. అల్లర్లు జరుగకుండా అత్యంత రక్షణ ఉన్న నగరం కాబట్టే పెట్టుబడులు తరలివస్తున్నాయి.. ఇవీ మన పాలకులు చెప్పుకునే గొప్పలు. వాస్తవ పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. నగరంలో సగటు పౌరులకు, మహిళలకు, ఆడ పిల్లలకు భద్రత కరువైంది. ఇక పక్కోడికి ఏమైతే మనకేంటి అన్న భావన కాంక్రీట్ జంగల్‌గా మారిన విశ్వనగరం వాసుల్లో పెరుగుతోంది. కళ్ల ముందే కిడ్నాప్‌లు, వేధింపులు, హత్యలు జరుగుతున్నా నగరవాసులు చేష్టలుడిగి చూస్తున్నారు. కొంతమంది యువకులు పుట్టుకతో వృద్ధులు అని శ్రీశ్రీ చెప్పినట్లు.. నగర ప్రజలు ఎవరేమైపోతే మనకేంటి అన్న భావనలో ఉంటున్నారు. ఆడపిల్లపై అఘాయిత్యం జరిగినా.. దిశలాగా అమ్మాయిలను సజీవ దహనం చేసినా.. పసికందుపై పైశాచికం ప్రదర్శించినా.. కత్తులు గొడ్డులతో తరుముతూ నరికి చంపుతున్నా విశ్వనగరం చోద్యం చూస్తోంది. ఇందుకు తాజాగా ఆదివారం నగరంలో పట్టపగలు జరిగిన హత్యే నిదర్శనం.

పట్టపగలు.. నడిరోడ్డుపై..
హైదరాబాద్ పాతబస్తీలోని జియాగూడలో నడి రోడ్డుపై పట్టపగలే ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ముగ్గురు ఆగంతుకులు దాడి చేసి హతమార్చారు. అదే మార్గంలో వస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్‌ను గమనించి పారిపోయారు. హత్యకు గురైన వ్యక్తిని జంగం సాయినాథ్(29)గా గుర్తించారు. అంబర్‌పేట బతుకమ్మకుంట వాసి అయిన సాయినాథ్ ఓ కార్పెంటర్. ఆదివారం ఒంటరిగా ద్విచక్ర వాహనంపై పురానాపూల్ వైపు నుంచి జియాగూడ మేకలమండీ మార్గంలో వెళ్తున్నారు. పీలిమండవ్ శివాలయం సమీపంలో ముగ్గురు ఆగంతుకులు అడ్డుగా వచ్చారు. ఇనుపరాడ్‌తో ఒకరు సాయినాథ్ తల వెనక బలంగా కొట్టడంతో కిందపడిపోయాడు. కొడవలి, కత్తి, ఇనుపరాడ్‌తో అతనిపై దాడి చేశారు. బాధితుడు సాయం కోసం కేకలు వేశాడు.. పరుగెత్తాడు.. అయినా వదలకుండా వెంటపడి వేటాడారు. కత్తితో ముఖం, చేతులు, కాళ్లు, పొట్ట భాగంలో నరికారు. అదే సమయంలో పురానాపూల్ వైపు నుంచి ద్విచక్ర వాహనంపై వస్తున్న గోషామహల్ ట్రాఫిక్ కానిస్టేబుల్ జనార్దన్.. ఈ దారుణాన్ని గమనించాడు. అరుచుకుంటూ ఘటనాస్థలానికి వస్తుండగానే.. నిందితులు మూసీ నదిలోకి వెళ్లే మెట్లమార్గం నుంచి దూకి పారిపోయారు. రక్తపు మడుగులో పడివున్న బాధితుడిని కాపాడేందుకు కానిస్టేబుల్ ప్రయత్నించినా.. ఫలితం లేకుండా పోయింది. అప్పటికే మృతి చెందినట్లు గుర్తించి డయల్ 100 ద్వారా పోలీసులకు సమాచారం అందజేశాడు. కుల్సుంపుర పోలీసులు కేసు నమోదు చేశారు. ఆర్థిక లావాదేవీలు, వివాహేతర సంబంధం కోణాల్లో దర్యాప్తు చేపట్టారు.

ఇంత జరుగుతున్నా..
మాయమై పోతున్నడమ్మా మనిషన్నవాడు.. అని ఓ కవి రాసిన సత్యాన్ని హైదరాబాద్ నగరవాసులు నిజం చేస్తున్నారు. ఒక కాకి చనిపోతే వంద కాకులు వచ్చి దానిచుట్టూ చేరుతాయి. ఒక కోతి చనిపోతే.. పదుల సంఖ్యలో కోతులు దానిచుట్టూ మూగుతాయి. కళేబరాలను ముట్టుకోవడానికి కూడా అనుమతించవు. మనిషిని ఎదురించే శక్తి తమలో లేదని తెలిసినా ప్రతిదాడికి ప్రయత్నిస్తాయి. ప్రతిఘటిస్తాయి. కానీ హైదరాబాద్ నగరవాసుల్లో ఆమాత్రం సోయి కూడా లేకుండా పోతోంది. మానవత్వం మచ్చుకైనా కనిపించడం లేదు. జియాగూడలో నడిరోడ్డుపై వెంటపడి.. వేటాడి కత్తులతో దాడి చేస్తున్నా.. అడ్డుకునేందుకు ఎవరూ ముందుకు రాలేదు. పక్క నుంచే కార్లు, ద్విచక్ర వాహనాలు, ఆటోల్లో వెళ్తున్నవారు అనేకమంది సెల్‌ఫోన్లలో అక్కడి దృశ్యాలను చిత్రీకరించారు. కళ్లెదుట జరుగుతున్న దారుణంపై వెంటనే డయల్ 100కు సమాచారమిచ్చినా.. ప్రాణం నిలిచేదంటూ పోలీసు అధికారులు పేర్కొంటున్నారు. చీమ చిటుక్కుమన్నా తెలిసే పెద్దపెద్ద హబ్‌లను నిర్మించి ఏం లాభం. మనుషుల ప్రాణాలు కాపాడలేకపోయినప్పుడు.