Pawan Kalyan- kondagattu: ‘ఏంటయ్యా.. తెలుగువాళ్లంతా సెటిమెంటల్ ఫూల్స్‌లా ఉన్నారు.. ఒక్కడి కోసం ఇంతమంది దెబ్బలు తింటున్నారేంటి’ ఠాకూర్ సినిమాలో ఓ సన్నివేశంలోని డైలాగ్ ఇదీ. ‘తెలుగు ప్రజలు ప్రేమిస్తే ప్రాణమిస్తారు.. అభిమానిస్తే గుండెల్లో పెట్టుకుని చూసుకుంటారు’ అని అదే సినిమాలో పోలీస్ ఆఫీసర్‌కు మెగాస్టార్ చిరంజీవి చెప్పిన సమాధానం ఇదీ. సెంటిమెంట్ అనేది తెలుగు రక్తంలోనే ఉంది. రాజకీయ నాయకుల్లో ఇవి ఎక్కువ. అయితే చాలామంది బయటకు కనిపించరు. కేసీఆర్ ఏ పని మొదలు పెట్టినా రాజశ్యామల యాంగం చేస్తారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరెడ్డి ఏ కార్యక్రమమైనా చేవెళ్ల నుంచి ప్రారంభించేవారు. కొంతమంది ప్రచారం పుణ్యక్షేత్రాల నుంచి ప్రారంభిస్తారు. అలాగే నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా సెంటిమెంట్ ఎక్కువే. కొండగట్టు ఆంజనేయస్వామిని పవర్‌స్టార్ బాగా సెంటిమెంట్‌గా భావిస్తారు. అందుకే ఆయన ఏ పని చేసినా మొదట కొండగట్టు ఆంజనేయస్వామి దర్శనం తర్వాతనే మొదలుపెడతారు. జనవరి 24న(మంగళవారం) జగిత్యాల జిల్లాలోని కొండగట్టులోని ఆంజనేయస్వామి ఆలయంలో తన ప్రచార వాహనం ‘వారాహి’కి ప్రత్యేక పూజలు చేయనున్నారు. ధర్మపురి శ్రీలక్ష్మీనారసింహస్వామిని దర్శించుకోనున్నారు.

నాటి నుంచే నమ్మకం..
ఆంధ్ర ప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడూ… ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ విభజించబడిన తర్వాత కూడా కరీంనగర్ జిల్లాకు రాజకీయంగా ఓ ప్రత్యేక స్థానం ఉంది. తెలంగాణ ఉద్యమం మొదలైనప్పటి నుంచి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి 8 ఏళ్లు గడుస్తున్నప్పటికి కూడా ఈ జిల్లాకు జనసేనానికి విడదీయలేని బంధం ఉంది. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు ఈ నెల 24 వస్తుండటంతో మళ్లీ కరీంనగర్ జిల్లా పేరు ఉమ్మడి రాష్ట్రాల్లో చర్చనియాంశం అయింది. 2009లో మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించినప్పుడు పవన్ కల్యాణ్ యువరాజ్యం అధ్యక్షుడిగా ఉన్నారు. మెగా కుటుంబానికి ఆంజనేయస్వామి ఇలవేల్లు. నాడు ఎన్నికల సమయంలో కూడా తమ ఇలవేల్పుగా భావించే ఆంజనేయస్వామిని దర్శించుకున్న తర్వాతే ప్రచారం మొదలుపెట్టాలని భావించారు పవన్ కల్యాణ్. అందులో భాగంగానే 2009 లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్న ప్రసిద్ధ పుణ్యకేత్రం అయిన కొండగట్టుకు వెళ్లిన పవన్ అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ప్రచారం మొదలుపెట్టారు. అదేరోజు ప్రచారంలో భాగంగా హుస్నాబాద్ చేరుకున్నారు. అక్కడ భోజనం చేసి ప్రచారం చేస్తున్న సమయం లో 11 కేవీ విద్యుత్ వైర్లు తగిలి కరెంట్ షాక్‌తో పవన్ కింద పడిపోయారు. 30 నిమిషాల వరకు స్పృహలోకి రాలేదు. ఆ తర్వాత కోలుకున్న పవన్ మళ్లీ ప్రచారాన్ని కొనసాగించారు. కొండగట్టు ఆంజనేయ స్వామి ఆశీస్సులతోనే అంత పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకోగలిగానని ధృడంగా నమ్మిన పవన్ అప్పటి నుండి కొండగట్టు ఆలయంపై నమ్మకం పెంచుకున్నారు.

కొండగట్టు నుంచే వారాహి ప్రారంభం..
ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో 2024 ఎన్నికల సమరానికి సిద్ధమవుతున్న పవన్ గత నెలలో ప్రత్యేకంగా రూపొందించిన ‘వారాహి’ వాహనాన్ని ఆవిష్కరించారు. ప్రచార వాహనంలో హై–సెక్యూరిటీ ఫీచర్లు ఉన్నాయి. ఇందులో పబ్లిక్ అడ్రస్ సిస్టమ్, హై రెజల్యూషన్ సీసీ కెమెరాలు ఉన్నాయి. హైదరాబాద్‌లోని ముస్తాబైన ఈ వాహనాన్ని ఉద్దేశించి ‘వారాహి ఎన్నికల సమరానికి సిద్ధంగా ఉన్నాడు’ అని ఇప్పటికే పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. మిలటరీ బస్సును తలపించే ఈ వాహనాన్ని పవన్ కళ్యాణ్ క్షుణంగా పరిశీలించాడు. సాంకేతిక నిపుణులతో వాహనం వివిధ ఫీచర్లను చర్చించి, కొన్ని మార్పులను సూచించాడు. ఏప్రిల్–మే 2024లో ఎన్నికలు జరగనున్న ఆంధ్రప్రదేశ్ అంతటా ప్రచారం చేయడానికి పవన్ ఈ వాహనాన్ని ఉపయోగిస్తాడు.
https://www.youtube.com/watch?v=bQaglwStEMY