KCR BRS: ‘గుజరాత్‌కు మూడుసార్లు ముఖ్యమంత్రి అయ్యాడు.. గుజరాత్ మోడల్‌ను దేశానికి చూపి ప్రధాని పదవి దక్కించుకున్నాడు.. ఇప్పుడు విశ్వగురువుగా కీర్తించబడుతున్నాడు.. నేను కూడా ఆయనతో సమానమే.. నేనూ తెలంగాణకు రెండుసార్లు ముఖ్యమంత్రి అయిన.. మూడోసారి అయిత.. తర్వాత తెలంగాణ మోడల్‌ను దేశానికి చూపిస్తా.. అన్నీ కలిసి వస్తే ప్రధాన మంత్రి పదవి చేపడతా.. ఏం తెలుగోడు ప్రధాని కాకూడదా’ ఇదీ తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావులో కనిపిస్తున్న కాన్ఫిడెన్స్. క్వాలిఫికేషన్ ఉన్నప్పుడు ట్రై చేస్తే తప్పేముంది అన్నట్లుగా మోదీతో పోల్చుకుంటూ కేసీఆర్ టీఆర్‌ఎస్‌ను జాతీయ రాజకీయాల కోసం బీఆర్‌ఎస్‌గా మార్చారు. ఇటీవలే ఖమ్మంలో ఆవిర్భావ సభ అట్టహాసంగా నిర్వహించారు. అయితే ఇక్కడ తేడాను కేసీఆర్ గమనించినట్లు లేరు. మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉండి బీజేపీని జాతీయ పార్టీగా మార్చలేదు. ఎన్నో ఏళ్ల శ్రమ ఫలితంగా బీజేపీ దేశవ్యాప్తంగా విస్తరించింది. ఇందులో ప్రతీ కార్యకర్త శ్రమ ఉంది. అప్పటి వరకు కాంగ్రెస్ పాలనతో విసిగిపోయిన ప్రజలు ప్రత్యామ్నాయంగా ఉన్న బీజేపీకి పట్టం కట్టారు. ప్రస్తుతం దేశంలో అలాంటి పరిస్థితి లేదు. మోదీ రోజురోజుకూ మరింత బలపడుతున్నారు. ఈ పరిస్థితిలో బీఆర్‌ఎస్ జాతీయ రాజకీయాల్లో నిలదొక్కుకోవడం సవాలే.. అయితే అసాధ్యం మాత్రం కాదు.

ఆ మూడు రాష్ట్రాలో ఎన్నికల్లో పోటీ..
ఖమ్మంలో ఇటీవల నిర్వహించిన బీఆర్‌ఎస్ సభతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం కంటే.. కేసీఆర్‌లో తొందర ఎక్కువగా కనిపిస్తోంది. ఎంత త్వరగా అయితే అంత త్వరగా ప్రధాని పీఠం నుంచి మోదీని దించి తాను కూర్చోవాలన్న ఆతృత పెరుగుతోంది. ఈ క్రమంలో జాతీయ పార్టీగా మార్చిన బీఆర్‌ఎస్‌ను దేశవ్యాప్తంగా విస్తరించే ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ క్రమంలో ఇటీవల ఎన్నికల సంఘం మూడు ఈశాన్య రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిని తమకు అనుకూలంగా మార్చుకోవాలని గులాబీ బాస్ భావిస్తున్నారు. జాతీయ పార్టీగా తొలి ఎన్నికలను ఈశాన్యం నుంచే ఎదుర్కోవాలని ఆలోచిస్తున్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
తెలంగాణలో ఆ మూడు రాష్ట్రాల నేతలు..
అసెబ్లీ ఎన్నికలు జరిగే నాగాలాండ్, మేఘాలయ, త్రిపుర రాష్ట్రాలు చెందిన కొంత మంది నేతలు.. ఇటీవల హైదరాబాద్‌లో కనిపించడం, బీఆర్‌ఎస్ నేతలతో మాట్లాడడం ఇందుకు బలం చేకూరుస్తోంది. తమకు ఆర్థిక సహాకారం అందిస్తే.. తాము బీఆర్‌ఎస్ తరఫున పోటీ చేస్తామని వారు ప్రతిపాదనలు ఇస్తున్నట్లుగా సమాచారం. కొద్ది రోజుల కిందట బీఆర్‌ఎస్ ప్రముఖుల్ని నాగాలాండ్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు లోథా కలిశారు. తాను నాగాలాండ్ ఎన్సీపీని బీఆర్‌ఎస్‌లో విలీనం చేస్తానని బీఆర్‌ఎస్ తరఫున పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పుకొచ్చారు. ఆయన ఢిల్లీలో బీఆర్‌ఎస్ కార్యాలయం ప్రారంభోత్సవలో కూడా పాల్గొన్నారు. ఇతర ఈశాన్య రాష్ట్రాలతో పోలిస్తే త్రిపురలో రాజకీయం వేరుగా ఉంటుంది. అక్కడ కూడా కొంత మంది నేతల్ని బీఆర్‌ఎస్ ప్రతినిధులు సంప్రదిస్తున్నారు. అలాగే 70 శాతానికిపైగా క్రిస్టియన్లు మేఘాలయలో ఆ కోణంలో నేతల్ని సంప్రదిస్తున్నారు.

ఓట్ల శాతంపై గురి..
ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ఒక పార్టీ జాతీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే కేంద్ర ఎన్నికల సంఘం నిబంధన –1968 ప్రకారం పార్లమెంట్ లేదా అసెంబ్లీ స్థానాల్లో నాలుగు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల్లో అభ్యర్థులు పోటీ చేయాలి. ఎన్నికల్లో పోలై చెల్లిన ఓట్లలో ఆరు శాతం ఓట్లు సాధించాలి. బీఆర్‌ఎస్ జాతీయ పార్టీగా మారాలంటే నాలుగు రాష్ట్రాల్లో పోటీ చేయాలి. పోలైన ఓట్లలో 6 శాతం సాధించాలి. ఇక్కడే కేసీఆర్ తన వ్యూహానికి పదును పెడుతున్నారు. మూడు ఈశాన్య రాష్ట్రాలు చాలా చిన్నవి. ఇక్కడ పోటీ చేయడం ద్వారా పోలైన ఓట్లలో 6 శాతం ఓట్లు సులభంగా తెచ్చుకోవచ్చని భావిస్తున్నారు. ఆ రాస్ట్రాల్లో నియోజకవర్గానికి 30 వేల మంది కూడా ఓటర్లు ఉండరు. ఇదే ప్లాస్ పాయంట్‌గా ఓట్ల శాతాన్ని పెంచుకోవాలన్న ఆలోచన కేసీఆర్ చేస్తున్నారని అంటున్నారు. తెలంగాణలో ఎలాగూ అధికారంలో ఉంది కాబటి, చిన్న రాష్ట్రాలైన ఈ మూడింటిలో ఒక్కో రాష్ట్రంలో ఆరు శాతం ఓట్లు సాధిస్తే బీఆర్‌ఎస్‌కు జాతీయ హోదా వస్తుందని కేసీఆర్ లెక్కలు వేస్తున్నట్లు తెలిసింది.
మొత్తంగా ఆయా రాష్ట్రాల అభ్యర్థులకు ఆర్థికసాయం అందించి ఎన్నికల్లో నిలబెట్టే యోచనలో కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది. మరి కేసీఆర్‌కు ఈశాన్యం కలిపి వస్తుందో లేదో తెలియాలంటే ఆ మూడు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు వేచిచూడాలి.