
Telangana Early Elections: తెలంగాణలో మళ్లీ ముందస్తు ఎన్నికల మాట తెరపైకి వచ్చింది. ముందస్తు ముచ్చటే లేదని, షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని ముఖ్యమంత్రి, అధికార బీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. కానీ ఆ విషయాన్ని ఉటంకిస్తూ.. బీఆర్‌ఎస్ ఎంపీ నామా నాగేశ్వర్‌రావు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. అక్టోబర్‌లో అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతాయని ప్రకటించి సరికొత్త చర్చకు తెరతీశారు.
ఖమ్మం ఆత్మీయ సభలో..
ఖమ్మం జిల్లాలో బీఆర్‌ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి పువ్వాడ, నామా నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఆదదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు హాట్ కామెంట్స్ చేశారు. అక్టోబర్ లేదా నవంబర్‌లో ఎప్పుడైనా ఎన్నికలు జరుగుతాయని ఎంపీ నామా నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. మూడోసారి కూడా కేసీఆరే ముఖ్యమంత్రి అవడం ఖాయమన్నారు. రాబోయే ఎన్నికల్లో పువ్వాడ గెలిచితీరుతారన్నారు. వచ్చే ఎన్నికల్లో గెలుపు బాధ్యతను.. మంత్రిగా పువ్వాడ మీద, ఎంపీగా తనమీద సీఎం కేసీఆర్ పెట్టారని వ్యాఖ్యానించారు.
ప్రచారం మొదలు పెట్టాలని ఆదేశం..
ఇక తెలంగాణలో బీఆర్‌ఎస్ ఎన్నికల ప్రచారం మొదలు పెట్టాలని ఎంపీ నామా నాగేశ్వర్‌రావు, మంత్రి పువ్వాడ అజయ్ క్యాడర్‌కు సూచించారు. ‘కేసీఆర్ సపోర్ట్‌తో ఎదిగి ఆయన్నే గద్దెదించుతానంటున్నాడని.. 2014, 2018 ఎన్నికల్లో ఒక్క సీటు ఇచ్చినా.. జిల్లా అభివృద్ధికి కృషి చేసినందుకు ఆయన్ను గద్దెదించాలా?.. కేసీఆర్‌ను ఎందుకు గద్దె దించాలంటూ పొంగులేటికి సవాల్ విసిరారు మంత్రి పువ్వాడ అజయ్. కొందరు ఇక్కడ పోటీ చేస్తారు కాని.. ఖమ్మంలో ఓటు హక్కు ఉండదన్నారు. తాను పెరిగిందీ, చదివిందీ ఇక్కడేనని, చచ్చేది కూడా ఇక్కడేననీ, మీకు ఇక్కడి మట్టిలో కలిసే దమ్ముందా అని ప్రశ్నించారు పువ్వాడ అజయ్.

మొత్తంగా ముందస్తు ముచ్చటే లేదని కేసీఆర్ ప్రకటించగా, తాజాగా మంత్రి అజయ్, ఎంపీ నామా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణలో సరికొత్త చర్చ మొదలైంది. మరి వీటిని వారు సమర్థించుకుంటారా లేక, మీడియా వక్రీకరించిందని తప్పించుకుంటారా అనేది చూడాలి.