Homeజాతీయ వార్తలుRahul Gandhi- BJP: రాహుల్ బహిష్కరణకు బిజెపి స్కెచ్: అందుకు ఈ అస్త్రాలు వాడుకుంటున్నది

Rahul Gandhi- BJP: రాహుల్ బహిష్కరణకు బిజెపి స్కెచ్: అందుకు ఈ అస్త్రాలు వాడుకుంటున్నది

Rahul Gandhi- BJP
Rahul Gandhi- BJP

Rahul Gandhi- BJP: భారత్ జోడో యాత్ర పేరుతో దేశాన్ని చుట్టి వచ్చిన రాహుల్ గాంధీకి కని విని ఎరుగని రీతిలో షాక్ ఇచ్చేందుకు భారతీయ జనతా పార్టీ రంగం సిద్ధం చేస్తోంది. ఏకంగా పార్లమెంటు ఉభయ సభల నుంచి బహిష్కరించేందుకు పకడ్బందీ ప్రణాళిక రూపొందించింది. వాటిని అమలులో కూడా పెట్టింది. ఇప్పుడు ఈ పరిణామం కాంగ్రెస్ ను కలవరపాటుకు గురిచేస్తోంది. అదానీపై కాంగ్రెస్‌, విపక్షాలు.. యూకేలో రాహుల్‌ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ.. పార్లమెంటు కార్యకలాపాలను రోజూ స్తంభింపజేస్తున్నాయి. పార్లమెంటు రూల్స్‌ ఆధారంగా పరస్పరం దెబ్బతీసుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. ప్రధానంగా రాహుల్‌ను బీజేపీ టార్గెట్‌ చేసుకుంది. భారత్‌లో ప్రజాస్వామ్యంపై క్రూరమైన దాడి జరుగుతోందని ఆయన కేంబ్రిడ్జి వర్సిటీలో చేసిన వ్యాఖ్యలపై బీజేపీ మండిపడుతోంది. విదేశీ గడ్డపై భారత్‌ను అవమానించారని.. ఇందుకు ఆయన క్షమాపణ చెప్పాలని.. అప్పటిదాకా ఆయన్ను సభలో మాట్లాడనిచ్చేది లేదని స్పష్టం చేస్తోంది. రాహుల్‌ తప్పు చేయలేదని.. ఆయన క్షమాపణ చెప్పరని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే, ఆ పార్టీ ఎంపీ శశిథరూర్‌ అంటున్నారు. ఈ నేపథ్యంలో రాహుల్‌ వ్యాఖ్యలపై ప్రత్యేక పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేసి విచారించాలని.. దాని నివేదిక ఆధారంగా ఆయన్ను సభ నుంచి బహిష్కరించవచ్చేమో పరిశీలించాలని బీజేపీ ఎంపీ నిశికాంత్‌ దూబే స్పీకర్‌ ఓం బిర్లాకు తాజాగా లేఖ రాశారు. రాహుల్‌ పార్లమెంటుకు అతీతుడు కాదని.. క్షమాపణ చెప్పి తీరాలని కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌, కిరెన్‌ రిజిజు, గోయల్‌ డిమాండ్‌ చేస్తున్నారు.

బ్రిటన్‌లో చేసిన వ్యాఖ్యలకు తొలుత ఆయన పార్లమెంటు వెలుపల దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్ చేస్తున్నది. ఓ కుటంబ అహం దేశ అత్యున్నత సంస్థ పార్లమెంటును అధిగమించడం విషాదకరమని అంటున్నది. ఇదే సమయంలో ప్రధాని మోదీపై కాంగ్రెస్‌ సభాహక్కుల తీర్మానం ప్రతిపాదించింది. గత నెలలో లోక్‌సభలో ప్రసంగిస్తూ నెహ్రూ కుటుంబాన్ని అవమానించేలా మాట్లాడారని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్‌ అంటున్నారు.

గతంలో ఇలా..

పరాయిగడ్డపై పార్లమెంటు, ప్రభుత్వాన్ని విమర్శించినందుకు 1976లో (అప్పట్లో దేశంలో అత్యవసర పరిస్థితి అమల్లో ఉంది) నాటి రాజ్యసభ సభ్యుడు సుబ్రమణ్యంస్వామిని సభ నుంచి బహిష్కరించారు. భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా బ్రిటన్‌, అమెరికా, కెనడాల్లోని రేడియోలు, టీవీలు, జర్నల్స్‌కు ఇంటర్వ్యూలు ఇవ్వడమే దీనికి ప్రధాన కారణం. అంతేకాదు.. ప్రధాని ఇందిరాగాంధీని హత్య చేస్తారేమోనని ప్రవాసంలో ఉన్న ఎంపీ అంటున్నారని ‘టొరంటో స్టార్‌’లో వచ్చిన వ్యాసాన్ని అప్పటి పార్లమెంటరీ దర్యాప్తు కమిటీ ప్రస్తావించింది. ‘‘నాడు సుబ్రమణ్యస్వామి చేసినట్లే ఇప్పుడు రాహుల్‌ కూడా చేశారు. పార్లమెంటుపై, ప్రధాని ప్రవర్తనపై సందేహాలు వ్యక్తంచేయడం ప్రజాస్వామ్యానికి హానికరం. లోక్‌సభలో రాహుల్‌ ప్రసంగాన్ని స్పీకర్‌ రికార్డుల నుంచి తొలగించారు. అయినప్పటికీ ఆయన ట్విటర్‌ హ్యాండిల్‌, యూట్యూబ్‌ చానళ్లలో అది అలాగే ఉంది. ఇది స్పీకర్‌ అధికారాన్నే సవాల్‌ చేయడం’’ అని నిశికాంత్‌ దూబే స్పీకర్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు.

Rahul Gandhi- BJP
Rahul Gandhi- BJP

యూపీఏ-1 సర్కారు హయాంలో 2008లో ఓటుకు నోట్ల స్కాం వెలుగులోకి వచ్చినప్పుడు విచారణకు ప్రత్యేక పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేశారు. దాని నివేదిక ఆధారంగా పది మంది లోక్‌సభ సభ్యులను, ఒక రాజ్యసభ సభ్యుడిని సభల నుంచి బహిష్కరించారని దూబే గుర్తుచేశారు. మరోవైపు.. రాహుల్‌పై దేశద్రోహ అభియోగం మోపాలన్న వాదన బీజేపీ నుంచి వస్తోంది.
లైవ్‌ ప్రొసీడింగులకు అంతరాయంశుక్రవారం పార్లమెంటు ఉభయసభల్లో బీజేపీ, కాంగ్రెస్‌ ఎంపీల పోటాపోటీ నినాదాలతో రెండు సభలు ఎలాంటి చర్చ లేకుండానే సోమవారానికి వాయిదాపడ్డాయి. సభ్యుల నినాదాలతో లోక్‌సభలో కొద్దిసేపు మైకులను ఆపు చేశారు. సంసద్‌ టీవీలో కూడా లోక్‌సభ ప్రొసీడింగుల ప్రత్యక్ష ప్రసారంలో ఆడియోను కొద్దిసేపు నిలిపివేశారు(మ్యూట్‌ చేశారు). దీనిపై కాంగ్రెస్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అయితే, సాంకేతిక కారణంగానే ఇలా జరిగిందని ప్రభుత్వం వివరణ ఇచ్చింది. తాజా పరిణామాల నేపథ్యంలో రాహుల్ గాంధీకి సుబ్రహ్మణ్య స్వామికి పట్టిన గతే పడుతుందా అనేది తేలాల్సి ఉంది.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular