
Telangana Teachers MLC Election: తెలంగాణలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనూహ్య ఫలితం వచ్చింది. బీజేపీ బలపరిచిన ఏవీఎన్.రెడ్డి విజయం సాధించి బీఆర్‌ఎస్‌కు ఊహించని షాక్ ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల సమరానికి ముందు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రధాన పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఎన్నికలకు వెళ్లాయి. అయితే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ మెజారిటీ కారణంగా ముగ్గురు బీ ఆర్‌ఎస్ ఎమ్మెల్సీలు ఏకగ్రీవంగా విజయం సాధించారు. కానీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు మాత్రం ఊహించని విధంగా బీఆర్‌ఎస్‌కు షాక్ ఇచ్చాయి.
సెబీస్‌గా భావించిన పార్టీలు..
ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలను అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రధాన పార్టీలు సెమీస్‌గా భావించాయి. తాము బలపర్చిన అభ్యర్థి విజయం కోసం పెద్ద ఎత్తున ప్రచారం చేశాయి. ఏ ఎన్నికల్లో అయినా కీలక భూమిక పోషించేది ఉపాధ్యాయులే. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలను అటు బీఆర్‌ఎస్, ఇటు బీజేపీ ప్రతీష్టాత్మకంగా తీసుకున్నాయి. అయితే బీజేపీ ఈ ఎన్నికల్లో అనూహ్య విజయం సాధించి గులాబీ బాస్ కేసీఆర్‌కు షాక్ ఇచ్చింది. ఉద్యోగ, ఉపాధ్యాయులకు అనేక హామీలు ఇచ్చి మరీ బండి సంజయ్ చేసిన ప్రచారం, అభ్యర్థి మీద ఉన్న నమ్మకం ఏవీఎన్.రెడ్డిను గెలిపించాయి.
అర్ధరాత్రి వరకు కౌంటింగ్..
ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలో టీచర్ ఎమ్మెల్సీ ఎన్నిక హోరాహోరీగా సాగింది. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపులో ఊహించని విధంగా ఫలితాలు రావడం ఇప్పుడు వచ్చే ఎన్నికలపై అందరిని ఆలోచించేలా చేస్తుంది. హోరా హోరీగా సాగిన వీరి పోటీలో గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఫలితాలు వెలువడ్డాయి. బీజేపీ బలపరిచిన అభ్యర్థిగా బరిలోకి దిగిన ఏవీఎన్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి బీఆర్‌ఎస్ బలపర్చిన పీఆర్టీయూ అభ్యర్థి గుర్రం చెన్నకేశవరెడ్డిపై 1,150 ఓట్ల తేడాతో విజయం సాధించారు.

ఉత్కంఠగా సాగిన కౌంటింగ్ ..
మొదటినుంచి ఉత్కంఠ భరితంగా సాగిన ఈ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ గురువారం అర్ధరాత్రి 1:40 నిమిషాల వరకు కొనసాగింది. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఫలితాలు తేలకపోవడంతో, రెండో ప్రధానితో ఓట్ల లెక్కించాల్సి వచ్చింది. ఇందుకోసం మూడో స్థానంలో ఉన్న టీఎస్‌టీయూ అభ్యర్థి పాపన్నగారి మాణిక్‌రెడ్డికి వచ్చిన 6,079 ఓట్లను రెండో ప్రాధాన్యత ఆధారంగా మొదటి రెండు స్థానాల్లో ఉన్న అభ్యర్థులకు సర్దుబాటు చేశారు. దీంతో బీజేపీ బలపరిచిన అభ్యర్థిగా బరిలోకి దిగిన ఏవీఎన్.రెడ్డి విజయం సాధించారు.
మొత్తానికి అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీ మద్దతు ఇచ్చిన అభ్యర్థి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించడం బీఆర్‌ఎస్‌కు షాక్ అనే చెప్పాలి.