
President Rule On Telangana: తెలంగాణలో రాష్ట్రపతి పాలన దిశగా బిజెపి పావులు కదుపుతోందా, దీనికి తెర వెనుక ప్లాన్లు గవర్నర్ సిద్ధం చేశారా, రాష్ట్రంలో వరసగా జరుగుతున్న సంఘటనలు దానికి బలం చేకూర్చుతున్నాయా? దీనికి అవును అనే సమాధానం చెబుతున్నారు విశ్లేషకులు. ఎందుకంటే గత కొంతకాలంగా తెలంగాణ రాష్ట్రంలో అధికార భారత రాష్ట్ర సమితికి, ప్రతిపక్షంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి ఉప్పు నిప్పులాగా వ్యవహారం కొనసాగుతోంది.. ఒకరిని ఒకరు కార్నర్ చేసుకోవడంలో పోటీ పడుతున్నారు. ఇందులో గవర్నర్ వచ్చి చేరడంతో రోజురోజుకు కాక మరింత పెరుగుతోంది. ఎన్నికలకు ఏడు నెలల సమయం ఉన్నప్పటికీ.. ఇప్పుడే ఎన్నికల జరుగుతాయి కావచ్చు అనేంత ఆసక్తికరంగా మారాయి.
అయితే తాజాగా టెన్త్ హిందీ ప్రశ్న పత్రం లీక్ అయిన ఘటనలో భారత రాష్ట్ర సమితి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ని కార్నర్ చేసింది. అత్యంత హై డ్రామా మధ్య బుధవారం తెల్లవారుజామున ఒంటి గంటకి అదుపులోకి తీసుకుంది. ఇందుకు చెబుతున్న కారణం బండి సంజయ్ కి హెచ్ఎంటీవీ వరంగల్ మాజీ బ్యూరో చీఫ్ ప్రశాంత్ ప్రశ్నపత్రం ఫార్వర్డ్ చేయడమే.. కానీ ప్రశాంత్ చాలామందికి ప్రశ్నపత్రం ఫార్వర్డ్ చేశాడు. వారందరినీ పట్టించుకోకుండా సంజయ్ ని మాత్రమే ప్రభుత్వం టార్గెట్ గా పెట్టుకుంది.. ఇదే క్రమంలో తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ క్యూస్షన్ పేపర్ లీక్ విషయాన్ని చాలా తెలివిగా డైవర్ట్ చేసింది. అయితే ఇక్కడ ప్రభుత్వం మర్చిపోయింది ఏంటంటే ఈ కేసు నిలబడే అవకాశాలు లేవని న్యాయవాద నిపుణులు చెబుతున్నారు.. అయితే ఈ ఎపిసోడ్ మొత్తం జరుగుతుండగానే తెలంగాణ భారతీయ జనతా పార్టీ ఐటీ సెల్ నిపుణులు గవర్నర్ తమిళీ సై సౌందర రాజన్ ను కలిశారు. భారతీయ జనతా పార్టీ మీద ఏ విధంగా కక్ష కట్టిందో పూర్తి వివరాలతో ఆమెకు ఒక ఫిర్యాదు చేశారు. తక్షణం ప్రభుత్వంపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు..
అయితే ఈ వ్యవహారం జరుగుతుండగానే గవర్నర్ పేషీ నుంచి రాష్ట్రపతి భవన్ కు సమాచారం వెళ్ళింది. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని గవర్నర్ కోరుతున్నారని ఓ వర్గం ప్రచారం చేసింది. అయితే ఈ ప్రచారాన్ని కొట్టి పారేయడానికి లేదు. ఎందుకంటే గత కొంతకాలంగా గవర్నర్ కు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఘర్షణ జరుగుతోంది.. కనీసం ఆమెకు ప్రోటోకాల్ కూడా ప్రభుత్వం పాటించడం లేదు. చివరికి బడ్జెట్ సమావేశాల్లో ఆమెకు నామ మాత్రమైన ప్రాధాన్యం కూడా దక్కడం లేదు. పైగా తనకు దక్కాల్సిన గౌరవం కోసం ఆమె ఏకంగా న్యాయస్థానం వైపు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.. రాష్ట్ర ప్రభుత్వంపై పీకల దాకా కోపం ఉన్నప్పటికీ.. గవర్నర్ ఆ ప్రతాపాన్ని వివిధ బిల్లుల మీద చూపిస్తున్నారు.

అయితే బండి సంజయ్ మీద కేసు నమోదైన నేపథ్యంలో, భారతీయ జనతా పార్టీ నాయకులు ఇచ్చిన కీలక సమాచారం ఆధారంగా గవర్నర్ తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించేందుకు రాష్ట్రపతి కార్యాలయానికి కీలకమైన సమాచారం అందించారని తెలుస్తోంది.. అయితే గవర్నర్ ఇచ్చిన సమాచారం ఆధారంగా రాష్ట్రపతి పాలన విధిస్తారా? లేదా? ఒకవేళ విధిస్తే అది కెసిఆర్ కు ఎంత మేర లాభం చేకూర్చుతుంది? అనే లెక్కల్లో ఢిల్లీ వర్గాలు ఉన్నట్టు తెలుస్తోంది.. మరికొద్ది నెలల్లో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో చంద్రశేఖర రావుకు ఎటువంటి మైలేజ్ దక్కకూడదు అనేది బీజేపీ ప్లాన్. అలాంటప్పుడు ఇప్పటికిప్పుడు రాష్ట్రపతి పాలన వైపు మొగ్గు చూస్తే కేసీఆర్ నెత్తిన పాలు పోసినట్టే అవుతుందని బిజెపి నేతల మాటగా చెబుతున్నారు. మరి ఇలాంటప్పుడు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సి ఉంది..