
BJP-TDP Alliance: బీజేపీ, టీడీపీ దగ్గరవుతున్నాయా? వచ్చే ఎన్నికల్లో ఆ రెండు పార్టీలు జనసేనతో కలిసి నడవనున్నాయా? పొత్తుకు బీజేపీ హైకమాండ్ చంద్రబాబుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇటీవల ఇరు పార్టీల అధినేతల మధ్య ట్విట్ల శుభాకాంక్షలు చూస్తే అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. 2019 ఎన్నికల్లో ఓటమి తరువాత చంద్రబాబు బీజేపీని కలుపుకొని వెళ్లేందుకు అన్నిరకాల ప్రయత్నాలు చేశారు. కానీ హైకమాండ్ పెద్దలు పెద్దగా స్పందించలేదు. రాష్ట్ర బీజేపీ నాయకులు మాత్రం అసలు టీడీపీతో పొత్తు ఉండదని కుండబద్దలు కొట్టి చెబుతున్నారు. అయితే ఇవేవీ పట్టించుకోని చంద్రబాబు తన ప్రయత్నాలను మాత్రం పట్టువదలని విక్రమార్కుడిలా చేస్తూనే ఉన్నారు. అయితే ఎట్లకేలకు ఆయన ప్రయత్నం ఒక కొలిక్కి వచ్చినట్టు కనిపిస్తోంది.
అండమాన్ నికోబర్ దీవుల్లోని పోర్టుబ్లెయర్ మునిసిపల్ పీఠం పై టీడీపీ జెండా రెపరెపలాడింది. మునిసిపల్ చైర్ పర్సన్ గా టీడీపీ కి చెందిన సెల్వీ ఎన్నికయ్యారు. భారతీయ జనతా పార్టీ సహకారంతో ఘనత సాధించారు. 2022లో జరిగిన మునిసిపల్ ఎన్నికల్లో బీజేపీకి 10 స్థానాలు, కాంగ్రెస్, డీఎంకే కూటమికి 11 స్థానాలు దక్కాయి. టీడీపీ రెండు స్థానాల్లో విజయం సాధించింది. దీంతో టీడీపీ ఇద్దరు సభ్యులు కీలకమయ్యారు. కాంగ్రెస్ కూటమి టీడీపీ సభ్యుల కోసం ఎంతగానో ప్రయత్నించింది. కానీ టీడీపీ ఏపీ నాయకత్వం ఎంటరైంది. చంద్రబాబు ఆదేశాలతో ఆ ఇద్దరు టీడీపీ సభ్యులు బీజేపీకి మద్దతు పలికారు. దీంతో మునిసిపాల్టీని బీజేపీ కైవసం చేసుకుంది. ఫస్ట్ టర్మ్ బీజేపీ అభ్యర్థి మునిసిపల్ చైర్మన్ అయ్యారు. ఇప్పుడు ఒప్పందం మేరకు టీడీపీ అభ్యర్థి సెల్వీకి చైర్ పర్సన్ పదవిని అప్పగించారు.
అయితే అధికార మార్పిడి జరిగిన నేపథ్యంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా స్పందించారు. బీజేపీ, టీడీపీ కూటమి విజయానికి శుభాకాంక్షలు తెలిపారు. ఇలానే ఐక్యతగా కొనసాగాలని సూచించారు. ఇది నరేంద్ర మోదీ పాలనకు ప్రజలు అందిస్తున్న ఆదరణగా పేర్కొన్నారు. పోర్లుబ్లెయిర్ ప్రజలకు బీజేపీ, టీడీపీ కూటమి మెరుగైన సేవలకు గుర్తింపుగా అభివర్ణించారు. దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు కూడా స్పందించారు. బీజేపీ, టీడీపీ కూటమిపై ప్రజలకు ఎంతో విశ్వాసం ఉందని వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఈ ఇద్దరి అధినేతల ట్విట్లు వైరల్ అవుతున్నాయి. ఏపీలో కూడా కొత్త సమీకరణలు తెరపైకి రానున్నాయని చర్చలు మొదలయ్యాయి.

వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి నడవనున్నాయని సంకేతాలు వస్తున్నాయి. అందుకు తగ్గట్టుగానే రెండు పార్టీల మధ్య సానుకూల వాతావరణం ఉంది. బీజేపీ తమతో వస్తుందని రెండు పార్టీలు భావిస్తున్నాయి. కానీ రాష్ట్ర బీజేపీ నాయకులు మాత్రం విభిన్న ప్రకటనలు చేస్తున్నారు. తాము జనసేనతో మాత్రమే+కలిసి నడుస్తామని చెబుతూ వస్తున్నారు. దీంతో పొత్తులకు ఒకరకమైన సందిగ్ధ వాతావరణం నెలకొని ఉంది. ఈ తరుణంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా స్పందన సానుకూలంగా ఉండడంతో టీడీపీలో ఆశలు చిగురించాయి. ఏపీలో కొత్త రాజకీయ సమీకరణలకు అవకాశముందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.