Homeజాతీయ వార్తలుBJP- BRS: బీఆర్‌ఎస్‌పై బీజేపీ కౌంటర్‌ ఎటాక్‌ షురూ!

BJP- BRS: బీఆర్‌ఎస్‌పై బీజేపీ కౌంటర్‌ ఎటాక్‌ షురూ!

BJP- BRS: వచ్చే ఎన్నికల్లో బీజేపీని దెబ్బకొట్టడం.. ప్రధాని మోదీని గద్దె దించడమే ఏకైక లక్ష్యంగా తెలంగాణ ఉద్యమ పార్టీ టీఆర్‌ఎస్‌ను ఆ పార్టీ అధినేత, తెలంగాణముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు బీఆర్‌ఎస్‌గా మార్చారు. పార్టీ ఏర్పాటు చేసిన రెండు నెలల తర్వాత ఖమ్మం వేదికగా జనవరి 18న ఆవిర్భావ సభ నిర్వహించారు. ఈ సభకు పంజాబ్, ఢిల్లీ, కేరళ సీఎంలను, కమ్యూనిస్టు పార్టీ నేతలను ఆహ్వానించారు. సభా వేదికగా కేంద్రంలోని బీజేపీ సర్కారపైనే అందరూ విమర్శలు గుప్పించారు. కేసీఆర్‌ తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామో సభలో ప్రకటించారు. అయితే ఈ సభపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి స్పందించారు. కేసీఆర్‌ సభలో కేంద్రంపై చేసిన ప్రతీ విమర్శకు తనదైన శైలిలో కౌంటర్‌ ఇచ్చారు.

BJP- BRS
BJP- BRS

మోదీని తిట్టడం కోసమే సభ..
బీఆర్‌ఎస్‌ ఒక కలల పార్టీ అని, ఢిల్లీకి పోతానని కేసీఆర్‌ పగటి కలలు కంటున్నారంటూ కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన కేంద్ర మంత్రి ఖమ్మంలో బీఆర్‌ఎస్‌ పార్టీ కేవలం మోదీని తిట్టడం కోసమే సభ నిర్వహించారని పేర్కొన్నారు. ఒక్క నేత కూడా బీఆర్‌ఎస్‌ ఉద్దేశం గురించి మాట్లాడలేదని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌ పెట్టుకున్న టోపీ, ఆయన మాటలు జనం నవ్వుకునేలా ఉన్నాయని ఎద్దేవా చేశారు.

లక్ష్యం లేని పార్టీ బీఆర్‌ఎస్‌..
ఎలాంటి లక్ష్యం లేని పార్టీ బీఆర్‌ఎస్‌ అని, తొమ్మిదేళ్లు సెక్రటేరియట్‌కు రాకుండా పరిపాలన సాగిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. మోదీని ఎంత విమర్శిస్తే తమకు అంత బలం, గౌరవం పెరుగుతుందని వారు భావిస్తున్నట్టుగా ఉందని అభిప్రాయపడ్డారు. ఖమ్మం సభలో కేసీఆర్‌తోపాటు ముఖ్యమంత్రుల తీరు కొండను తవ్వి ఎలుకను పట్టినట్టు ఉందని ఎద్దేవా చేశారు. మొత్తం 4,500 వెల్నెస్‌ సెంటర్లను కేంద్రం ఇచ్చిందని, వాటి పేరు మార్చి బస్తీ దవాఖానాలుగా తామే ఇచ్చినట్టు చెప్పుకుంటున్నారని కేసీఆర్‌ను విమర్శించారు.

సీఎంగానే పనికిరానోడు దేశాన్ని ఉద్ధరిస్తాడట..
సీఎంగానే పనికిరాని కేసీఆర్‌ దేశాన్ని ఉద్దరిస్తానని బయల్దేరాడని కేసీఆర్‌పై సెటైర్లు వేశారు కిషన్‌రెడ్డి. దేశంపై కేసీఆర్‌కు ప్రేమలేదని, ఆయన ప్రేమంతా తన కుటుంబంపైనే అని విమర్శించారు. కొడుకు సీఎం కావాలని, అధికారం చేయి జారొద్దని ఆయన ఆరాటపడుతున్నారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో దోచుకున్న కేసీఆర్‌ ఇక దేశాన్ని దోచుకునేందుకు బయల్దేరారని ఆరోపించారు. గ్రామపంచాయతీలకు కేంద్రం ఇస్తున్న నిధులను కూడా దారి మళ్లించిన వ్యక్తి కేసీఆర్‌ దేశానికి ఏం చేస్తారని ప్రశ్నించారు.

ఇండిపెండెంట్‌ అభ్యర్థిలా కేసీఆర్‌ మాటలు..
ఎన్నికల్లో పోటీచేసే ఇండిపెండెంట్‌ అభ్యర్థులు గెలుపు కోసం ప్రజలకు సాధ్యం కాని హామీలు ఇస్తారని, కేసీఆర్‌ కూడా ఖమ్మం సభ వేదికగా అలాంటి హామీలే ఇచ్చారని కిషన్‌రెడ్డి విమర్శించారు.
కేసీఆర్‌ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి ఏమిటో చూపించాలని సవాల్‌ విసిరారు. కేసీఆర్‌ మిగులు బడ్జెట్‌తో ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల్లోకి నెట్టారని ఆరోపించారు. తెలంగాణలో కేసీఆర్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల ఆత్మహత్యలు తగ్గలేదన్నారు. హాస్టల్లో కలుషిత ఆహారం తిని విద్యార్థులు చనిపోతున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందని విమర్శించారు.

BJP- BRS
kishan reddy

దేశ దోపిడీకి కుట్ర..
రాష్ట్రాన్ని దోపిడీ చేసింది చాలక కేసీఆర్‌ దేశం మీద పడుతున్నారని, బీఆర్‌ఎస్‌ వెనుక పెద్ద కుట్రే ఉందని కిషన్‌రెడ్డి ఆరోపించారు. కేసీఆర్‌ చెబుతున్న వెలుగులు జిలుగులు కేవలం ప్రగతి భవన్, ఫామ్‌ హౌస్‌కు మాత్రమే పరిమితమయ్యాయని కేంద్ర మంత్రి వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌æ చెబుతున్నట్టు ప్రమాదంలో ఉంది దేశం కాదని తెలంగాణ సమాజమని పేర్కొన్నారు. వచ్చే శాసనసభ ఎన్నికల్లో కేసీఆర్‌ కుటుంబాన్ని ఫామ్‌హౌస్‌కు మాత్రమే పరిమితం చేయడం తమ ముందున్న లక్ష్యమని స్పష్టం చేశారు.

మొత్తంగా ఖమ్మం వేదికగా కేసీఆర్‌ కేంద్రంపై చేసిన ప్రతీ విమర్శకు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి దీటుగా కౌంటర్‌ ఇచ్చారు. ఎక్కడా తగ్గేదేలే అన్నట్లుగా కేంద్రమంత్రి సెటైర్లు ఉన్నాయి.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Exit mobile version