
బైక్ ను నీటిలో నడపటం ఎంత కష్టమో వాహనదారులందరికీ తెలిసిందే. ఎప్పుడూ వేగంగా వెళ్లే బైకు నీటిలో నడపడానికి ప్రయత్నిస్తే మెల్లిగా వెళుతూ వాహనదారులను ఇబ్బందులు పెడుతుంది. బైక్ సైలెన్సర్ లోకి నీళ్లు వెళ్లాయంటే బైక్ ముందుకు కదలనే కదలదు. భారీ వర్షాలు, వరదల వల్ల రోడ్లు జలమయమైతే ఆ సమయంలో బైక్ పై వెళ్లే వాళ్లు పడే ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. వరదల సమయంలో బైక్ పై తిరిగితే బైక్ పని చేయకపోయే అవకాశాలు కూడా ఉంటాయి.
అయితే తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో యువకులు పీకల్లోతు నీటిలో సైతం బైకును అవలీలగా నడుపుతున్నారు. పీకల్లోతు నీటిలో బైక్ ను నడిపితే బైక్ ముందుకు వెళ్లదు కదా…? అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయా….? అయితే యువకులు బైక్ లో చిన్నచిన్న మార్పులు చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. బైక్ కిందకు ఉండే సైలెన్సర్ ను యువకులు బైకర్ తలపైకి ఉండే విధంగా మార్చారు.
అయితే పెట్రోల్ ట్యాంకులోకి నీరు వెళ్లినా బైక్ పని చేయదు అందుకని యువకులు బాటిల్ నుంచి బైక్ లోకి పెట్రోల్ వెళ్లేలా ఏర్పాట్లు చేశారు. దీంతో ఇంజిన్ చక్కగా పని చేయడంతో సులభంగా బైక్ ముందుకు వెళుతోంది. ఐఏఎస్ అధికారి అవనీష్ శరణ్ ట్వీట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. యువకుల తెలివికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఐఏఎస్ అధికారి అవనీష్ తాను గతంలో ఇలా బైక్ నడపడం చూద్లేదని ఇలా చేయడం ప్రమాదకరం అని చెప్పారు.