Bihar: గయలో ఉక్రెయిన్‌ మహిళ పిండప్రదానం.. ఎవరి కోసమో తెలిస్తే కళ్లు చెమరుస్తాయి?

రష్యా–ఉక్రెయిన్‌ మధ్య దాదాపు ఏడాదిన్నరగా యుద్ధం కొనసాగుతోంది. ఇందులో తమ దేశం కోసం పోరాడి ప్రాణాలు వదిలిన వీర జవాన్లు, ప్రజలతోపాటు తన పూర్వీకుల ఆత్మశాంతి కోసం ఆ దేశ సైకాలజిస్ట్‌ జూలియా(33) ‘పిండాన్‌’ చేయాలని బీహార్‌లోని గయకు వచ్చింది.

Written By: Raj Shekar, Updated On : October 8, 2023 11:51 am

Bihar

Follow us on

Bihar: పిత్రుపక్షం.. దీనికి హిందూ సంప్రదాయంలో ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ పక్షంలో చనిపోయన వారికి పిండప్రదానం చేస్తే మంచిదని నమ్ముతారు. పితృదేవతల ఆత్మలు శాంతిస్తాయని, పిత్రుదోషాలు తొలగిపోతాయని విశ్వసిస్తారు. ఈనెల 15 వరకు పిత్రుపక్షాలు ఉన్నాయి. దీంతో దేశంలోని పవిత్రమైన గంగ, గోదావరి, కృష్ణ, తుంగభద్ర, కావేరీ, సరయు నదీతీరాల్లో పితృదేవతలకు పిండ ప్రదానాలు చేస్తున్నారు. అయితే బిహార్‌లోని గయకు ఓ విదేశీ మహిల వచ్చి పిండప్రదానం చేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. హిందూ సంప్రదాయ పద్ధతిలో ఆమె ఎవరి కోసం ఈ కార్యం నిర్వహించిందో తెలుసుకుందాం.

యుద్ధ వీరుల కోసం..
రష్యా–ఉక్రెయిన్‌ మధ్య దాదాపు ఏడాదిన్నరగా యుద్ధం కొనసాగుతోంది. ఇందులో తమ దేశం కోసం పోరాడి ప్రాణాలు వదిలిన వీర జవాన్లు, ప్రజలతోపాటు తన పూర్వీకుల ఆత్మశాంతి కోసం ఆ దేశ సైకాలజిస్ట్‌ జూలియా(33) ‘పిండాన్‌’ చేయాలని బీహార్‌లోని గయకు వచ్చింది. యుద్ధంలో మరణించిన సైనికులతోపాటు సామాన్య ప్రజల ఆత్మకు శాంతి చేకూరాలని శనివారం నదీ తీరంలో పిండప్రదానం చేసింది. జూలియాతోపాటు రష్యా, ఉక్రెయిన్, జర్మనీ, లిసా, యూకే నుంచి 35 మంది యాత్రీకులు ఇక్కడికి వచ్చారు.

సోషల్‌ మీడియాలో వైరల్‌..
గయలో యుక్రెయిన్‌ మహిళ తమ దేశ సైనికులు, సామాన్య ప్రజల కోసం హిందూ సంప్రదాయ పద్ధతిలో పిండప్రదానం చేసిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. హిందూ ఆచారాలను నిర్వహిస్తున్న ఆర్టర్, జూలియా మాట్లాడుతూ, ‘ఉక్రెయిన్‌లో యుద్ధం ఇంకా కొనసాగుతోంది. ప్రజలు బాధపడుతున్నారు. ఇప్పటికే రెండు వైపుల నుండి చాలా కన్నీళ్లు వచ్చాయి.

చాలా బాధగా ఉంది. చలికాలం వచ్చిందంటే పరిస్థితి మరింత దారుణంగా మారే అవకాశం ఉంది. శాంతి కోసం ప్రార్థిద్దాం’ ‘ఉక్రెయిన్‌లోని హిందూ జాగరణ్‌ సమితికి అనుబంధంగా ఉన్న నా ఆధ్యాత్మిక గురువు నటల్య సఫ్రోనోవా నుండి నేను దాని గురించి తెలుసుకున్నాను. పూర్వీకులకు గౌరవం ఇవ్వడానికి ఇది ఉత్తమ మార్గం. నేను 2012లో కూడా ఇక్కడకు వచ్చాను’ అని తెలిపింది. దీనిని చూసిన నెటిజన్లు సదరు మహిళను అభినందిస్తున్నారు. తమ దేశ పౌరులు, సైనికులు అర్ధంతరంగా తనువు చాలంచారని, వారి ఆత్మశాంతించాలని హిందూ సంప్రదాయం ప్రకారం పిండప్రదానం చేయడం గొప్ప విషయమని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

మణిపూర్‌ అల్లర్ల మృతుల కోసం..
మరోవైపు, ఒక సామాజిక కార్యకర్త, చందన్‌ కుమార్‌ సింగ్, వేలాది మంది అజ్ఞాత నిష్క్రమించిన ఆత్మలకు శాంతి కోసం సామూహిక పిండప్రదానం చేశారు. వారిని వారు ఎప్పుడు కలవలేదు. మణిపూర్‌ హింసాకాండలో మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆయన ‘తర్పణ్‌‘ అందించారు.