Bihar : సేవా గుణాన్ని మించింది లేదు. తోటి వాళ్లను ఆదుకునే తత్వాన్ని మించిన వ్యక్తిత్వం మరొకటి లేదు. ఇలాంటి గుణాలు ఉన్న వాళ్లు గొప్ప వాళ్ళుగా వర్ధిల్లుతారు. సమాజంలో అద్భుతమైన వారుగా పేరు తెచ్చుకుంటారు. అయితే కొంతమంది పరోపకారాన్ని తమకు మైలేజ్ కోసం వాడుకుంటారు. సమాజం దృష్టిలో గొప్పవాళ్లుగా చెలా మణి అవ్వడానికి ఉపయోగించుకుంటారు. కరోనా సమయంలో ఇలాంటి దానకర్ణులు తెరపైకి చాలా మందే వచ్చారు. సోషల్ మీడియాలో ప్రచారం చేసుకున్నారు. మీడియాలో ప్రముఖంగా కనిపించారు. ఆ తర్వాత ఆ సేవా గుణాన్ని కొనసాగించలేదు. అన్నార్థులను, ఆపత్కాలంలో ఇబ్బంది పడుతున్న వారిపై కన్నెత్తి చూడలేదు. ఇక తాజాగా సేవా గుణాన్ని ప్రదర్శించబోయి.. పరోపకారాన్ని వ్యక్తం చేయబోయి ఓ మంత్రి అడ్డంగా బుక్కయ్యాడు. పదిమంది ముందు పలుచన అయ్యాడు.
Also Read : అక్కా చెల్లెళ్లతో పెళ్లికి రెడీ అయిన వరుడికి షాకిచ్చిన పోలీసులు!
ఎండాకాలంలో దుప్పట్లు పంపిణీ చేశారు
బీహార్ రాష్ట్రంలో త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పటికే నితీష్ కుమార్ ప్రభుత్వం అక్కడ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అనేక వరాలు ప్రకటించారు. మఖాన బోర్డును కూడా ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. త్వరలో ఎన్నికలు జరుగుతున్న బీహార్ రాష్ట్రంలో నితీష్ కుమార్ ప్రభుత్వం హడావిడిగా అభివృద్ధి పనులను చేయడం మొదలుపెట్టింది. ఇక బిజెపి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బీహార్ క్రీడా శాఖ మంత్రి సురేంద్ర మెహతా పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు.. వాస్తవానికి వేసవికాలంలో ఎవరైనా తాగునీటి సీసాల పంపిణీ చేస్తారు. లేదా మజ్జిగ ప్యాకెట్లు అందిస్తారు. కాస్త స్తోమత ఉన్న నాయకులయితే ఓఆర్ఎస్, లేదా ఇతర చలువ చేసే పదార్థాలను పంపిణీ చేస్తారు. కానీ బీహార్ రాష్ట్రంలో సురేంద్ర మెహతా దుప్పట్లు పంపిణీ చేయడం చర్చకు దారితీస్తోంది..”ఎండాకాలంలో ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయి. ఈ సమయంలో ప్రజలకు దాహార్తి అధికంగా ఉంటుంది. బిజెపి ఆవిర్భావ దినోత్సవం అయితే మంత్రి వాటర్ బాటిల్స్, ఓ ఆర్ ఎస్ ప్యాకెట్స్, లేదా ఇతర చలువ పదార్థాలు పంపిణీ చేస్తే బాగుండేది. కానీ మంత్రి దుప్పట్లు పంపిణీ చేయడం ఆశ్చర్యంగా అనిపిస్తోంది. ఇప్పుడేమీ చలికాలం కాదు కదా.. పోనీ మంత్రిగారు చలికాలంలో ఉన్నారు అనుకుంటే.. ఇప్పుడు ఎండాకాలం కదా.. ఆ మాత్రం లాజిక్ మర్చిపోతే ఎలా.. అభివృద్ధి అనే పదాన్ని పూర్తిగా మర్చిపోయి.. దుప్పట్లను పంపిణీ చేసి ఓటర్లను తన వైపు తిప్పుకోవాలనే మంత్రి ప్రయత్నం చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇలాంటివారు మంత్రులవడం ఏంటో.. ఇది ముమ్మాటికి బీహార్ ప్రజలు చేసుకున్న పాపమని.. ఈసారి ఎన్నికల్లో నైనా ఇలాంటి తప్పు చేయకుండా బీహార్ ప్రజలు సరైన నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నామని.. వారు ఈసారి మార్పు దిశగా ఆలోచించాలని” నెటిజన్లు సోషల్ మీడియాలో పేర్కొంటున్నారు.