Naga Shaurya Marriage: హీరో నాగ శౌర్య ఊహించిన ట్విస్ట్ ఇచ్చాడు. సడన్ గా పెళ్లి ప్రకటన చేశాడు. అది కూడా మరో పది రోజుల్లో వివాహం అంటూ సర్ప్రైజ్ చేశాడు. నాగ శౌర్య వివాహ వార్త టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. నాగ శౌర్య ఇంటిలో పెళ్లి కార్యక్రమాలు మొదలయ్యాయి. నాగ శౌర్య పెళ్లి పత్రిక సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వేడుకకు బెంగుళూరు వేదిక కానుంది. JW మార్రియట్ లో రెండు రోజులు వివాహ వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. నవంబర్ 19న మెహందీ వేడుక జరగనుంది. నవంబర్ 20 ఉదయం 11 గంటల 25 నిమిషాలకు నాగ శౌర్య వివాహ ముహూర్తంగా నిర్ణయించారు.

ఇక నాగ శౌర్యకు కాబోయే భార్య పేరు అనూష. ఈమె వివరాలు తెలియాల్సి ఉంది. అదే సమయంలో ఇది ప్రేమ వివాహం అన్న ప్రచారం జరుగుతుంది. నాగ శౌర్య వివాహం పై ఎలాంటి ముందస్తు సమాచారం లేదు. దీంతో అందరూ షాక్ అవుతున్నారు. కొన్నాళ్లుగా నాగ శౌర్యకు పేరెంట్స్ పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఆయనకు పెళ్లి చేయాలనే ప్రయత్నాలు చేస్తున్నారు. నాగ శౌర్య ప్రస్తుత వయసు 33 ఏళ్ళు కాగా, ఆ మూడు ముళ్ల తంతు పూర్తి చేయాలని తల్లిదండ్రులు ఫిక్స్ అయ్యారు.
ఏలూరు చెందిన నాగ శౌర్య సినిమాపై మక్కువతో టాలీవుడ్ లో ప్రయత్నాలు మొదలుపెట్టారు. 2011లో ‘క్రికెట్ గర్ల్స్ అండ్ బీర్’ అనే ఒక చిన్న సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. శ్రీనివాస్ అవసరాల దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఊహలు గుసగుసలాడే’ మూవీతో నాగ శౌర్య హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఛలో మూవీ నాగ శౌర్య కెరీర్లో పెద్ద కమర్షియల్ హిట్ గా ఉంది. వెంకీ కుడుముల తెరకెక్కించగా రష్మిక మందాన హీరోయిన్ గా నటించారు.

ఈ మధ్య ఆయన వరుస పరాజయాలు ఎదుర్కొంటున్నారు. స్పోర్ట్స్ డ్రామా ‘లక్ష్య’ కోసం నాగ శౌర్య చాలా కష్టపడ్డారు. సిక్స్ ప్యాక్ బాడీ సాధించి పూర్తి మేక్ ఓవర్ అయ్యాడు. సినిమాలో కంటెంట్ లేకపోవడంతో లక్ష్య ఆడలేదు. ఆయన లేటెస్ట్ రిలీజ్ కృష్ణ వ్రింద విహారి సైతం నిరాశపరిచింది. జయాపజయాలతో సంబంధం లేకుండా నాగ శౌర్య సినిమాలు చేసుకుంటూ పోతున్నారు. ప్రస్తుతం ఆయన హీరోగా ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి, పోలీస్ వారి హెచ్చరిక, నారీ నారీ నడుమ మురారీ చిత్రాలు తెరకెక్కుతున్నాయి.