India vs England- T20 World Cup 2022: అది 2007.. పొట్టి క్రికెట్ ప్రపంచానికి పరిచయమైన ఏడాది. ఇంగ్లాండ్ టీం భారత జట్టుతో లీగ్ మ్యాచ్ ఆడుతోంది. యువరాజ్ సింగ్ ఒక ఎండ్ లో బ్యాటింగ్ లో ఉన్నాడు. ఆండ్రూ ప్లిటాంప్ నోటికి పని చెప్పాడు. యువి కూడా తగ్గ లేదు.. అసలే పంజాబ్ పౌరుషం కదా! మనసు లో పెట్టుకున్నాడు. తర్వాత బ్రాడ్ బౌలింగ్ చేశాడు. కోపమో, కసో, మరెంటో కాని యువి రెచ్చి పోయాడు. నెవర్ బిఫోర్, ఎవర్ ఆఫ్టర్ అన్నట్టుగా బ్యాటింగ్ చేశాడు. ఆరు బంతులకి ఆరు సిక్సర్లు బాదాడు. ఏకంగా 12 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. ఇప్పటికీ ఆ రికార్డు అలాగే ఉంది. దెబ్బకు టీ ట్వంటీ కప్ భారత్ క్రాంతమైంది. చాలా ఏళ్ళ తర్వాత ఇండియా సెమీస్ వెళ్ళింది. ఇంగ్లీష్ టీంతో ఇవాళ తలపడింది. కానీ..

జోస్ తుఫాన్
పెను తుఫాన్ తల వంచి చూసే తొలి నిప్పుకణం అతడే అని మహేష్ బాబు అతడు సినిమాలో ఒక పాట ఉంటుంది కదా. ఇవాళ ఆ పాటను ఇంగ్లాండ్ ఓపెనర్లకు ఏమాత్రం మొహమాటం లేకుండా ఆపాదించవచ్చు. చేజింగ్ కు దిగింది మొదలు ఇన్నింగ్స్ ఎడింగ్ దాకా ఊచకోత అనే పదం చిన్న బోయేలా ఆడారు. 5 గురు బౌలర్లకు నిద్రలేని రాత్రులు పరిచయం చేశారు. ముఖ్యంగా జోస్ అయితే ఆకాశమే హద్దు అన్నట్టుగా చెలరేగిపోయాడు. ఫోర్లు, సిక్సర్లు మంచి నీళ్ల ప్రాయం లాగా కొట్టాడు. దెబ్బకు భారత్ నిర్దేశించిన కొండంత లక్ష్యం మంచు లాగా కరిగిపోయింది.

బ్రాడ్ హ్యాపీ ఇప్పుడు
2007 సంవత్సరంలో ఆరు బాళ్ళకు ఆరు సిక్సర్లు సమర్పించుకొని స్టువర్ట్ బ్రాడ్ చాలా ఏళ్ళ పాటు ఇబ్బంది పడ్డాడు. యువి దెబ్బకి జట్టులో స్థానం కోల్పోయాడు. తర్వాత తనని తాను నిరూపించుకునేందుకు చాలా ఏళ్ళు పట్టింది. ఇక ఇవాళ భారత్ బౌలింగ్ చూసి ఆనందపడి ఉంటాడు. ఎందుకంటే ఒకప్పుడు తాను కూడా ఇటువంటి పరిస్థితినే ఎదుర్కొన్నాడు కనుక. యువి సిక్సర్లు కొడుతుంటే ప్రేక్షకుల్లా ఇంగ్లీష్ క్రికెటర్లు చూస్తూ ఉండిపోయారు . ఇవాళ కూడా ఇంగ్లీష్ ఓపెనర్లు కసితీరా బ్యాట్ తో బాదుతుంటే భారత క్రికెటర్లు కూడా అలాగే ఉండిపోయారు. ఇవాళ ఇండియా ఓటమి భారత ప్రేక్షకులను బాధించవచ్చు. కానీ బ్రాడ్ కు మాత్రం సంతోషాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే తను కూడా ఒకప్పుడు బాధితుడు కాబట్టి.