Bihar Bride: పాత సినిమాల్లో సాధారణంగా వర కట్నం కోసం పెళ్లి ఆగడం చూసుంటాం. ఆ సన్నివేశం పండించేందుకు బ్యాక్ గ్రౌండ్ సంగీతం ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఇప్పుడు సీన్ మారిపోయింది. నిజ జీవితంలోను పెళ్లిళ్లు పీటల వరకు వచ్చి పెటాకులవుతున్నాయి. అయితే, కట్నం కోసం కాదు.. పైగా మొండికేస్తుంది వధువులే. తాజాగా ఇలాంటి ఘటన బీహార్‌లోని భాగల్‌పూర్‌లోని కహల్ గావ్ గ్రామంలో జరిగింది.
మరికాసేపట్లో పెళ్లనగా, వరుడు బాజా భజంత్రీలు, మేళ తాళాలతో గుర్రంపై ఊరేగుతూ ఊరంతా తిరిగి కల్యాణ మండపానికి చేరుకున్నాడు. అప్పటి వరకు వరుడు మొహం ఎరుగని సదరు వధువు తన కలల రాకుమారిడి కోసం వేయ్యి కళ్లతో ఎదురుచూస్తూ కూర్చొంది. మేళతాళాల మోత కల్యాణ మండపానికి దగ్గర పడుతున్న కొద్ది వధువులో టెన్షన్ మొదలైంది. కొంతసేపటి తరువాత గుర్రంపై ఊరేగుతూ వస్తున్న వరుడును వధువు చూసింది. అప్పటి వరకు ఉన్న టెన్షన్ వాతావరణం మొత్తం ఎగిరిపోయింది. పైగా కొంతసేపు నిర్ఘాంతపోయి నుంచొని ఉండిపోయింది.
ఆ తరువాత గుర్రం దిగిన వరుడు కల్యాణ మండపంలో వధువు కిట్టూ కుమారి వైపు అడుగులు వేశాడు. అప్పటికే శిలగా మారిపోయిన ఆమె ఒక్కసారిగి తేరుకుంది. వరుడు మెడలో పూలదండ వేయబోతుండగా అడ్డుకుంది. అతడిని పెళ్లాడబోనని మొండికేసింది. దీంతో ఒక్కసారిగా కల్యాణ మండపంలో కలకలం రేగింది. కారణం తెలుసుకునేందుకు ప్రయత్నం చేయగా, వరుడు నల్లగా ఉన్నాడని పేర్కొంది. అంతేగాక, వయసులో తనకంటే చాలా పెద్దవాడుగా ఉన్నాడని కాబట్టి పెళ్లి చేసుకోనని తెగేసి చెప్పింది.
దీంతో వధువు కిట్టూ కుమారిని నచ్చజెప్పేందుకు ఆమె తల్లిదండ్రులు, బంధువులు ప్రయత్నాలు చేశారు. రకరకాల హామీలు ఇచ్చారు. ఎలాగైనా పెళ్లికి ఒప్పించే ప్రయత్నం చేశారు. వరుడు ఆమె మెడలో దండ వేసి తిలకం దిద్దించేందుకు నచ్చజెప్పేందుకు చేసిన అన్ని ప్రయత్నాలు విఫలమయ్యాయి. చివరకు ఆమె పట్టుదల గెలిచింది. పెళ్లి రద్దు చేస్తున్నట్లు ఆమె తరుపు బంధువులు ప్రకటించారు. నల్లగా కర్ర మొద్దులా ఉన్న సదరు వరుడి పీడ విరగడైందని కిట్టూ కుమారి ఆనందంతో ఉబ్బితబ్బిబయ్యింది.