https://oktelugu.com/

Bengal Tiger: బెంగాల్ టైగర్.. ఈ లక్షణాలే దాన్ని రాయల్ చేశాయి

సాధారణంగా రాయల్ బెంగాల్ టైగర్ లాలాజలం అత్యంత యాంటీబయాటిక్ లక్షణాలు కలిగి ఉంటుంది.. ఈ లాలాజలాన్ని గాయాల మీద రుద్దితే అవి తగ్గిపోతాయి. తీవ్రంగా రక్తస్రావం జరుగుతున్నప్పుడు దానిని అడ్డుకోవడానికి ఈ లాలాజలం తోడ్పడుతుంది..

Written By:
  • Velishala Suresh
  • , Updated On : March 1, 2024 1:41 pm
    Bengal Tiger:
    Follow us on

    Bengal tiger: అది నడుస్తుంటే మిగతా జంతువులు పక్కకు తప్పుకుంటాయి. అది వేటాడుతుంటే అడవి కంపించిపోతుంది. అది వేటాడి తినగా మిగిలిన మాంసంతో హైనాలు వారం పాటు పండగ చేసుకుంటాయి. అది గర్జిస్తే నాలుగు దిక్కులూ దద్దరిల్లిపోతాయి.. రాయల్ బెంగాల్ టైగర్ గురించి చెప్పాలంటే పై ఉపోద్ఘాతాలు అచ్చుగుద్దినట్టు సరిపోతాయి. ఇవి మాత్రమేనా.. ఇంకా ఏమైనా ఉన్నాయా? బెంగాల్ టైగర్ ను రాయల్ గా నిలిపే లక్షణాలు ఏంటంటే..

    సాధారణంగా రాయల్ బెంగాల్ టైగర్ లాలాజలం అత్యంత యాంటీబయాటిక్ లక్షణాలు కలిగి ఉంటుంది.. ఈ లాలాజలాన్ని గాయాల మీద రుద్దితే అవి తగ్గిపోతాయి. తీవ్రంగా రక్తస్రావం జరుగుతున్నప్పుడు దానిని అడ్డుకోవడానికి ఈ లాలాజలం తోడ్పడుతుంది.. రాయల్ బెంగాల్ టైగర్ 30 నుంచి 40 కిలోల మాంసాన్ని ఏకకాలంలో తినగలదు. వివిధ జంతువుల అరుపులను ఇది అనుకరించగలదు. వేట సమయంలో అలా అరుపులు చేసి మిగతా జంతువులను ఆకర్షించగలదు. ఆహార అన్వేషణ కోసం ఇది ఎంత దూరమైనా వెళ్తుంది. గంటకు 60 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తుతుంది.

    రాయల్ బెంగాల్ పులులు ప్రత్యేకమైన నమూనాలు కలిగి ఉంటాయి. ఏ రెండు పులులు కూడా ఒకేలా కనిపించవు. వేటాడే విషయంలో రాయల్ బెంగాల్ టైగర్ తీరు వేరే విధంగా ఉంటుంది..ఈ పులి దాడి చేసినప్పుడు ప్రత్యర్థి జంతువు వెన్నెముకను విచ్చిన్నం చేస్తుంది. అది లేవకుండా చేసి గొంతును గట్టిగా తన దంతాలతో చీల్చేస్తుంది. అలా వెచ్చటి రక్తాన్ని తాగిన తర్వాత తన పదునైన దంతాలతో జంతువు శరీర భాగాలను తృప్తిగా ఆరగిస్తుంది. రాయల్ బెంగాల్ టైగర్ పోరాడుతున్నప్పుడు గర్జించదు. ఆ సమయంలో అది ఈలలు వేస్తుంది. ఆ ఈలల శబ్దానికి ఇతర రాయల్ బెంగాల్ పులులు అక్కడికి వస్తాయి. మూకుమ్మడిగా పోరాడి ప్రత్యర్థి జంతువును చంపుతాయి. రాయల్ బెంగాల్ టైగర్ లు ఆడ పులుల పట్ల జాగ్రత్తగా ఉంటాయి. మగ పులులు వేటగా తీసుకొచ్చిన మాంసాన్ని ఆడ పులులు తింటాయి. రాయల్ బెంగాల్ టైగర్ లు మనదేశంలో ఎక్కువగా కనిపిస్తాయి. భూటాన్, నేపాల్, మయన్మార్, బంగ్లాదేశ్, చైనా వంటి దేశాల్లో ఇవి ఉన్నప్పటికీ.. మన దేశంతో పోల్చితే వాటి సంఖ్య చాలా తక్కువ. రాయల్ బెంగాల్ టైగర్స్ కేవలం మడ అడవుల్లో మాత్రమే నివసిస్తాయి. మనుషులతో పోలిస్తే ఇవి రాత్రి సమయంలో ఆరు రెట్లు ఎక్కువగా చూడగలవు. ఐదు రెట్లు ఎక్కువగా వినగలవు. వీటి గర్జన రెండు కిలోమీటర్ల దూరం వరకు వినబడుతుంది. పైగా ఈ పులులకు జ్ఞాపకశక్తి చాలా ఎక్కువ. చూసిన ముఖాలను ఇవి ఎప్పటికీ మర్చిపోవు.

    జింక, అడవి పంది, అడవి గేదెలు, దున్నలు, కంచర గాడిదలు, జిరాఫీ లను రాయల్ బెంగాల్ టైగర్స్ ఎక్కువగా వేటాడుతాయి. ఆడ రాయల్ బెంగాల్ టైగర్ బరువు 181 కిలోల వరకు ఉంటుంది.. 8 నుంచి 9 అడుగుల వరకు ఇవి పెరుగుతాయి. మగ పులి బరువు 300 కిలోల వరకు ఉంటుంది. వీటి పొడవు ఎనిమిది నుంచి పది అడుగుల వరకు ఉంటుంది. అరుదైన ఈ పులి చర్మానికి అంతర్జాతీయ మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉంది. దీని గోర్లను సంపన్నులు తమ హోదాను ప్రదర్శించుకునేందుకు మెడలో ధరిస్తారు. దీని పక్కటెముకలను ఔషధాలు తయారీలో ఉపయోగిస్తారు. అందువల్ల ఈ జాతి అంతరించిపోయే ప్రమాదంలో పడింది. దీని పరిరక్షణ కోసం ప్రాజెక్టు టైగర్, సేవ్ ది టైగర్ అనే ప్రాజెక్టులను కేంద్రం నిర్వహిస్తోంది.