
BBQ On Bullet Bike: బిబిక్యూలో తినాలంటే ఎంత ఖర్చు అవుతుంది? తక్కువలో తక్కువ 1500 దాకా వదిలించుకోవాలి.. దీనికి తోడు జీఎస్టీ బిల్లు. అంత ఖర్చు చేయకుండా జస్ట్ ₹300 లోనే బిబిక్యూ చికెన్ తినొచ్చు. నచ్చిన లెగ్ పీస్ ను స్మోకీ ఫ్లేవర్ తో ఎంజాయ్ చేయొచ్చు. చికెన్ టిక్కాను మైనిస్ లో ముంచుకుని లాగించవచ్చు. గార్లిక్ చికెన్ ను లొట్టలు వేసుకొని తినొచ్చు. అందులోనూ ఎటువంటి రెడీమేడ్ కలర్లు లేకుండా, అజినో మోటో భయం లేకుండా హాయిగా తినొచ్చు. ఇంత చదువుతుంటే దీని అడ్రస్ ఎక్కడో తెలుసుకోవాలని ఉందా? ఇంత మంచి హోటల్ కు వెళ్లాలని ఉందా? అయితే ఇది అలాంటి ఇలాంటి హోటల్ కాదు. ఆ హోటల్ పేరు చెప్తే మీరు కచ్చితంగా ఆశ్చర్యపోతారు.
సాధారణంగా బుల్లెట్ బండి ని యువతరం ఎందుకు వాడుతారు? లాంగ్ డ్రైవ్ కోసం, లేక ప్యాషన్ కోసం.. అలాంటిది ఒక యువకుడు ఏకంగా తనకున్న బుల్లెట్ బండిని బీబీక్యూ హోటల్ చేశాడు. మండే బొగ్గులపై చికెన్ కాల్చుతూ మాంసాహారుల జిహ్వ చాపల్యాన్ని తీర్చుతున్నాడు.. ఇంతకీ అతని పేరు చెప్పలేదు కదు. ఆ యువకుడి పేరు వినయ్. స్వగ్రామం నిజామాబాద్ జిల్లా మైసమ్మ గడ్డ. హోటల్ మేనేజ్మెంట్ పూర్తి చేశాడు. హైదరాబాదులోని హోటల్లో చెఫ్ గా పనిచేస్తున్నాడు. కోవిడ్ సమయంలో ఇంటికి వచ్చాడు. ఎవరి దగ్గరా పని చేయడం ఇష్టం లేక ఇంట్లోనే ఉండిపోయాడు. ఆ తర్వాత తనకు వచ్చిన ఒక ఆలోచనను ఆచరణలో పెట్టాడు.. అది సూపర్ సక్సెస్ అయింది.

వినయ్ కి బుల్లెట్ బండిని బీబీ క్యూ కిచెన్ గా మార్చాడు.. మైసమ్మ గడ్డను అడ్డగా మార్చుకున్నాడు. బొగ్గుల కుంపటి రాజేసి అందులో చికెన్ 65, లాలీపాప్, గార్లిక్ చికెన్, చికెన్ టిక్కా,చికెన్ పకోడీ చేయడం ప్రారంభించాడు. అయితే వీటి తయారీలో ఎక్కడ కృత్రిమ రంగులు వాడకపోవడం, అజినోమోటో వినియోగించకపోవడంతో జనాలకు నచ్చింది. జస్ట్ 300 రూపాయల రేటుతో వినియోగదారులు కోరుకున్న రెండు ఐటమ్స్ సర్వ్ చేస్తున్నాడు. దీంతో అతడికి గిరాకీ పెరిగింది. మొదట్లో 5 కిలోల చికెన్ తో ప్రారంభమైన అతడి వ్యాపారం ఇవాళ 50 కిలోల స్థాయికి చేరుకుంది. తనతో పాటు మరో ఇద్దరికి ఉపాధి చూపించే స్థాయికి తన వ్యాపారం పెరిగింది. దీంతోపాటు మరొక సెంటర్లో కూడా బుల్లెట్ బిబిక్యూ ఏర్పాటు చేసేందుకు వినయ్ ఏర్పాట్లు చేస్తున్నాడు. ఇతడి బిబీక్యూ వంటకాలు నచ్చడంతో యూత్ లొట్టలు వేసుకుని తింటున్నారు. ఇన్నాళ్ళూ బుల్లెట్ బండిని స్టైల్ కోసమే వాడటం చూశాం. కానీ దానిని బీబీక్యూ కిచెన్ గా మార్చడమే గమ్మతి ఉన్నది. అయినా పుర్రెకో బుద్ది, జిహ్వకో రుచి.
View this post on Instagram