
Bandi Sanjay Arrested: తెలంగాణలో పదో తరగతి హిందీ ప్రశ్నపత్రం లీకేజీ కేసులో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌ని అరెస్ట్ చేయడం, రెండు గంటల తర్వాత అతనికి పేపర్ చేరినా.. ఈ కేసులో సంజయ్‌ను రిమాండ్ రిపోర్టులో ఏ1గా పేర్కొనడం పూర్తిగా కుట్రపూరితంగా జరిగినట్లు బీజేపీ భావిస్తోంది. దీంతో జాతీయ నాయకత్వం సైతం రగంలోకి దిగింది. ఎన్నికల వేళ బీఆర్‌ఎస్ చేస్తున్న కవ్వింపు చర్యలను ఎలా ఎదుర్కొవాలి.. అధికార పార్టీపై ఎలా ప్రతీకారం తీర్చుకోవాలి అన్న ఆలోచనలో కమలనాథలు ఉన్నట్లు తెలుస్తోంది.
కూతురు కోసం కేసీఆర్ ప్రతీకారం..
ఢిల్లీ లిక్కర్ స్కాంలో తెలంగాణ ముఖ్యమంత్రి కూతురు కవిత పీకల్లోతు వరకు కూరుకుపోయింది. ఇప్పటికే మూడు సార్లు ఈడీ విచారణ ఎదుర్కొంది. ఈడీ అడిగిన ఫోన్లలో కొన్ని అప్పగించింది. ఈ ఫోన్లను ఓపెన్ చేసిన ఈడీ కీలక సమాచారం రాబట్టింది. ఈ క్రమంలో కవిత అరెస్ట్ ఖాయం అన్న వార్తలు వస్తున్నాయి. దీంతో బీజేపీపై ప్రతీకారం తీర్చుకునే క్రమంలో గులాబీ బాస్ కేసీఆర్ కుట్రకు తెరతీశారని బీజేపీ నాయకులు భావిస్తున్నారు. ఇందులో భాగంగానే బండి సంజయ్‌తోపాటు జాతీయ నాయకులను కూడా ఇందులోకి లాగే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది.
టీఎస్‌పీఎస్సీ కేసులో అభాసుపాలు..
ఇక టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రం లీకేజీ కేసులో కల్వకుంట్లల కుటుంబమే ఎక్కువగా బదనాం అవుతోంది. ఇందులో తెలంగాణ ముఖ్యమైన మంత్రి కేటీఆర్ ఉన్నట్లు ఆరోపణల వస్తున్నాయి. కవిత పాత్రపై కూడా అనుమానాలు వస్తున్నాయి. గతంలో సింగరేణి ఉద్యోగాల భర్తీ విషయంలో మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఒకే సెంటర్‌లో 23 మందికి ఉద్యోగాలు వచ్చాయి. ఇందులో బీఆర్‌ఎస్ నాయకురాలు కవితపైనే ఆరోపణలు వచ్చాయి. ఇక టీఎస్‌పీఎస్సీ లీకేజీ వ్యవహారం మొత్తం కేటీఆర్ చుట్టూ తిరుగుతోంది. బీజేపీ, కాంగ్రెస్ అధ్యక్షులు బండి సంజయ్, రేవంత్‌రెడ్డి, బీఎస్పీ చీఫ్ ప్రవీణ్‌కుమార్ లీకేజీలో కేటీఆర్ పాత్రను ప్రజల ముందు పెడుతున్నారు. విపక్షాల ఆరోపణలకు బలం చేకూర్చేలా ఈ విచారణను త్వరగా క్లోజ్ చేయించేలా కేటీఆర్ వ్యవహరిస్తున్నారు. విపక్ష నేతలకు నోటీసులు ఇచ్చేలా సిట్‌పై ఒత్తిడి చేస్తున్నారు. దీంతో అనుమానాలు బలపడుతున్నాయి. మొత్తంగా ఈ వ్యవహారంలో కల్వకుంట్ల కుటుంబం బదనాం అవుతోంది.
బీజేపీపై వ్యతిరేకత పెంచేలా..
టీఎస్‌పీఎస్సీ వ్యవహారంతో కేసీఆర్, కేటీఆర్ ఎలా బదనాం అవుతున్నారో.. దానిని మరిపించేలా బీజేపీని ప్రజల్లో బదనాం చేసేందుకు, తెలంగాణలో ఆ పార్టీని బలహీన పర్చేందుకు బీఆర్‌ఎస్ ఎత్తుగడ వేసిందని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్‌పై కుట్ర జరిగిందని పేర్కొంటున్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం తరహాలో ఈ కేసులోకి బీజేపీ జాతీయ నాయకులను సైతం ఇరికించేందుకు యత్నిస్తున్నట్లు తెలుస్తంది.

దెబ్బకు దెబ్బ కొట్టేలా బీజేపీ వ్యూహం..
బీఆర్‌ఎస్ బీజేపీపై చేస్తున్న కుట్రలను ఛేదించడంతోపాటు ఆ పార్టీని దెబ్బకొట్టేలా బీజేపీ వ్యూహరచన చేస్తోంది. ఈ క్రమంలో ఢిల్లీ లిక్కర్ స్కాంతోపాటు టీఎస్‌పీఎస్పీ లీకేజీ పై ఈడీని రంగంలోకి దించాలని చూస్తోంది. అసరమైతే టెన్త్ పేపర్ వ్యవహారంలో కూడా జోక్యం చేసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే.. నెక్ట్స్ బీజేపీ కొట్టే దెబ్బకు ఇక బీఆర్‌ఎస్ కోలుకునే అవకాశం ఉండదని ఆ పార్టీ నాయకులు అభిప్రాయపడుతున్నారు.