Homeట్రెండింగ్ న్యూస్Odisha Train Accident: శవాల మధ్య కొనఊపిరితో కొడుకు.. రైలు ప్రమాదంలో కదిలించే స్టోరీ

Odisha Train Accident: శవాల మధ్య కొనఊపిరితో కొడుకు.. రైలు ప్రమాదంలో కదిలించే స్టోరీ

Odisha Train Accident: ప్రాణం నీటి బుడగలాంటిది. ఎప్పుడు ఎలా కాలం తీరుతుందో తెలియదు. అనుకోకుండా చోటు చేసుకునే ప్రమాదాలతో కుటుంబాల్లో తీరని విషాదం నెలకొంటుంది. ప్రమాదాల్లో బిడ్డలను పోగొట్టుకున్న తల్లిదండ్రులు, తల్లి దండ్రులను పోగొట్టుకున్న పిల్లలు, ఆత్మీయులను కోల్పోయిన కుటుంబ సభ్యులు తీవ్ర దుఖంలో మునిగిపోతారు. అప్పటి వరకు తమతో ఉన్న వారు ఒక్కసారిగా ప్రాణాలతో లేరు.. ఇక తిరిగి రారు అని తెలిస్తే వారి కుటుంబసభ్యులు ఎంతటి క్షోభకు గురవుతారో ఊహకందని పరిణామం. శుక్రవారం రాత్రి జరిగిన కోరమండల్‌ రైలు ప్రమాదంలో గుండెల్ని పిండేసే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఓ తండ్రి తన కొడుకు కోసం ఆస్పత్రుల్లో వెతుకుతున్న తీరు.. తన కొడుకు బతికే ఉన్నాడన్న నమ్మకం.. అందరినీ కంటతడి పెట్టించింది. తండ్రి నమ్మకం నిజమైంది.. చివరకు శవాల మధ్య కొన ఊపిరితో కొడుకు దొరికాడు.

కొడుకు కోసం వెతుకులాట..
ఈ ఘోర రైలు ప్రమాదంలో ఇప్పటి వరకు ప్రయాణికులు దాదాపు 300 వరకు మరణించినట్లు తెలుస్తోంది. గాయపడిన వారు వందల్లో ఉన్నారు. క్షతగాత్రులకు స్థానిక ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో ఓ తండ్రి తన కొడుకు ఆచూకి కోసం శవాల మధ్య వెతుకుతూ కన్నీటిపర్యంతమైన వీడియో ఒకటి నెట్టింట వైరల్‌ గా మారింది. కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులోనే తన కొడుకు ప్రయాణించినట్లు తెలిపాడు. ఇప్పటి వరకు తన కొడుకు ఆచూకీ దొరకలేదని, తన కొడుకు బతికే ఉన్నాడని దుఖాన్ని దిగమింగుకుంటూ చెప్పాడు. ఇదే విషయాన్ని పోలీసులకు కూడా చెప్పాడు.

తీవ్ర గాయాలతో…
కోల్‌కతాలోని హౌరాకు చెందిన హేలరామ్‌ మాలిక్‌ అనే దుకాణదారుడు కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌లో ఎక్కడానికి షాలిమార్‌ స్టేషన్‌లో తన 24 ఏళ్ల కొడుకు బిశ్వజిత్‌ను దింపాడు. రైలు బయల్దేరిన కొన్ని గంటలకే ఒడిశాలో రైలు ప్రమాదం వార్త తెలిసింది. హేలరామ్‌ వెంటనే తన కొడుకు బిశ్వజిత్‌కు ఫోన్‌ చేశాడు. తీవ్ర బాధలో ఉన్న బిశ్వజిత్‌ ఫోన్‌ లిఫ్ట్‌చేసి.. నీరసంగా మాట్లాడాడు. తాను ఇంకా బతికే ఉన్నానని చెప్పాడు. గాయాలయ్యాయని తెలిపాడు.

వెంటనే ఘటన స్థలానికి...
ఒక్క క్షణం కూడా వృథా చేయకుండా హేలరామ్‌ అంబులెన్స్‌ డ్రైవర్‌ పలాష్‌ పండిట్‌ను సంప్రదించాడు. ఒడిశాలోని బాలాసోర్‌లోని రైలు ప్రమాద స్థలికి వెళ్లాలని కోరాడు. తన బావ దీపక్‌దాస్‌ను వెంట తీసుకెళ్లాడు. శుక్రవారం అర్థరాత్రి బాలాసోర్‌ చేరుకున్నారు. రైలు ప్రమాద బాధితులు చికిత్స పొందుతున్న చుట్టుపక్కల ఉన్న అన్ని ఆసుపత్రుల్లో విచారించినప్పటికీ హేలరామ్‌ తన కొడుకు ఆచూకీ లభించలేదు.

తండ్రి నమ్మకం నిజమైంది..
ఎన్ని ఆస్పత్రులు తిరిగినా ఆచూకీ దొరకకపోవడం, ఫోన్‌ స్విచ్‌ఆఫ్‌ రావడంతో హేలరామ్‌ దిగాలు చెందాడు. అయినా తన కొడుకు బతికే ఉన్నాడని నమ్మకంతో ఉన్నాడు. అక్కడే ఉన్న ఓ వ్యక్తి.. శవాల గదిలో చూడడంని తెలిపాడు. బిశ్వజిత్‌ బతికే ఉన్నాడని గట్టిగా నమ్ముతూనే శవాల గదివైపు నడిచారు హేలరామ్, అతడి బావ దీపక్‌దాస్‌.. శవాల మధ్య వణుకుతూ ఉన్న యువకుడు కనిపించాడు. వెంటనే అక్కడికి వెళ్లి చూడగా, అతను బిశ్వజితే. అపస్మారక స్థితిలో ఉన్నాడు. వెంటనే అతడిని అంబులెన్స్‌లో బాలాసోర్‌ ఆసుపత్రికి తరలించారు, అక్కడ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం వైద్యులు కటక్‌ మెడికల్‌ కాలేజ్‌ ఆసుపత్రికి రెఫర్‌ చేశారు.

కొడుకు బతికాడన్న సంతోషం.. పరిస్థితి విషమంగా ఉందన్న బాధ..
కొడుకు బతికి ఉండడంతో ఒకవైపు సంతోషంగా ఉన్న హేలరామ్‌.. పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడి ఆస్పత్రి వైద్యులకు బాండ్‌ రాసి ఇచ్చి.. మెరుగైన వైద్యం కోసం కోల్‌కతాలోని ఎస్‌ఎస్‌కెఎం ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉంది, కానీ స్థిరంగా ఉందని వైద్యులు తెలిపారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular