
Tarakaratna- Balakrishna: సినీ, రాజకీయ నేపథ్యం ఉన్న నందమూరి కుటుంబంలో అనుబంధం ఎక్కువ. చిన్నచిన్న అరమరికలు తప్ప తమ మధ్య అగాధాలు లేవని చాలా సందర్భాల్లో ఆ కుటుంబసభ్యులు ప్రూవ్ చేశారు. రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి, సినీ సెలబ్రిటీలు కాబట్టి వారిపై ఎన్నో రూమర్స్ కామన్. అయితే వారూ మనుషులే కదా..పైగా అనుబంధాలు, అప్యాయతలూ ఉంటాయి. అందునా అన్నగారి కుటుంబం అనేసరికి అందరి దృష్టి వారిపైనే ఉంటుంది. అయితే ఈ విషయంలో బాధ్యతగా వ్యవహరిస్తున్నారు నందమూరి బాలక్రిష్ణ. తారకరత్న ఆరోగ్యం విషయంలో ఆయన కేరింగ్ రాజకీయ ప్రత్యర్థుల ప్రశంసలు అందుకుంది. ఇప్పటివరకూ బాలక్రిష్ణలో ఉన్న కొత్త కోణాన్ని ఆవిష్కరించింది.
నారా లోకేష్ యువగళం పాదయాత్ర ప్రారంభించిన నాడు తారకరత్న గుండెపోటుకు గురయ్యారు. సుమారు 23 రోజుల పాటు అత్యవసర వైద్యం అందుతున్న ఆయన మృత్యువుతో పోరాడారు. శనివారం మృతిచెందారు. జనవరి 27న తారకరత్న గుండెపోటుకు గురైన సమయం నుంచి మృతిచెందే వరకూ అతడ్ని బతికించడానికి బాలక్రిష్ణ తపన పడ్డారు. గుండెపోటకు గురైన వెంటనే కుప్పం ఆస్పత్రికి తరలించారు. అతి తీవ్రగుండెపోటు కావడంతో బెంగళూరు నారాయణ హృదయాలయం నుంచి నిపుణులైన డాక్టర్లను రప్పించి వైద్యం అందించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో కర్నాటక ప్రభుత్వంతో మాట్లాడి గ్రీన్ చానల్ ద్వారా వైద్యుల పర్యవేక్షణలో బెంగళూరు ఆస్పత్రికి తరలించారు. బాలక్రిష్ణ కీలకంగా వ్యవహరించారు.

తారకరత్నకు బెంగళూరు ఆస్పత్రికి తరలించి వైద్యం అందించేవరకూ బాలక్రిష్ణ అక్కడే ఉండిపోయారు. గంట గంటకూ వైద్యులతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకునేవారు. అటు సోదరుడి కుటుంబానికి ధైర్యం చెబుతూ.. అభిమానులు ఆందోళన చెందకుండా మనోధైర్యాన్ని ఇచ్చారు. ఆ సమయంలో బాలక్రిష్ణ కేవలం రెండుసార్లు మాత్రమే ఇంటికి వెళ్లినట్టు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. సినిమాలతో పాటు ఇతర కార్యక్రమాలను వాయిదా వేసుకొని బాలక్రిష్ణ ఆస్పత్రి వద్ద గడిపిన పరిస్థితిని తెలుసుకొని రాజకీయ ప్రత్యర్థులు సైతం అభిమానించారు. అటు సోషల్ మీడియాలో నెటిజన్లు సైతం అభినందనలు తెలుపుతున్నారు.
ఆస్పత్రి బిల్లుల నుంచి అత్యవసర వైద్యం వరకూ అన్ని ఖర్చులు బాలక్రిష్ణే భరించినట్టు ప్రచారం జరుగుతోంది. తారకరత్నను కాపాడుకోవాలని బాలయ్య తపించారు. ప్రయత్నంలో ఎక్కడా లోపం లేదు. వైద్యులు చివరి నిమిషం వరకు ప్రయత్నాలు చేసారు. తారకరత్న దక్కలేదు. కానీ, బాలయ్య చేసిన ప్రయత్నాలు.. చివరి నిమిషం వరకు అన్నీ తానై వ్యవహరించిన తీరు మాత్రం ప్రస్తావించకుండా ఉండలేని పరిస్థితి ఏర్పడింది. తారకరత్నను పరామర్శించడానికి వచ్చిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అక్కడ పరిస్థితిని చూసి తన అభిప్రాయాన్ని వెల్లడించారు. మీడియాతో మాట్లాడుతూ తారకరత్న విషయంలో బాలక్రిష్ణ చేస్తున్న ప్రయత్నాన్ని అభినందించారు. కాగా విజయసాయిరెడ్డి తారకరత్నకు సమీప బంధువు.