
Balagam Story Controversy: స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు రోజుకో వివాదంలో చిక్కుకుంటున్నారు. ఈసారి ఆయన కాపీ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆయన నిర్మాతగా విడుదలైన లేటెస్ట్ మూవీ బలగం మూవీ కథ నాదే అంటూ జర్నలిస్ట్ సతీష్ గడ్డం ఆరోపిస్తున్నారు. ఆయన మీడియా ముందు బలగం మూవీ యూనిట్ పై విమర్శలు గుప్పించారు. బలగం మూవీ స్టోరీ క్రెడిట్ తనకే ఇవ్వాలని లేదంటే నిర్మాత దిల్ రాజు మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరిస్తున్నారు.
సతీష్ గడ్డం మాట్లాడుతూ… నేను నమస్తే తెలంగాణ పత్రిక కోసం పచ్చుక పేరుతో ఒక కథ రాశాను. అది 2014లో ఆ పత్రిక సండే మ్యాగజైన్ లో ప్రచురించారు. పచ్చుక కథ రాసినందుకు నమస్తే తెలంగాణా పత్రికలో నాకు జర్నలిస్ట్ గా ఉద్యోగం వచ్చింది. పచ్చుక నిజంగా జరిగిన కథ. అది మా ఊరు మానుకొండ లో నా కళ్ళ ముందు జరిగిన యధార్థ సంఘటన. తెలంగాణా మాండలికంలో నేను రాసిన పచ్చుక కథను బలగం చిత్రంగా తెరకెక్కించారు. నామ మాత్రపు మార్పులు మినహాయించి 90 శాతం కథ నాదే.
బలగం కథ క్రెడిట్ నాకు ఇచ్చేలా దిల్ రాజు చర్యలు తీసుకోవాలి లేదంటే నేను చట్టపరమైన చర్యలకు పూనుకుంటాను… అని గడ్డం సతీష్ వివరించారు. బలగం చిత్రాన్ని జబర్దస్త్ ఫేమ్ వేణు తెరకెక్కించారు. దర్శకుడిగా ఆయనకు ఇది మొదటి చిత్రం. ఈ చిత్ర కథ ఆయనదే అని చెప్పుకున్నట్లు సమాచారం. బలగం చిత్రంలో ప్రియదర్శి హీరోగా నటించారు. ఒక పల్లెటూరి ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కింది.

బలగం ప్రీ రిలీజ్ ఈవెంట్ సిరిసిల్లలో జరిపారు. మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా రావడం మూవీకి మంచి ప్రచారం దక్కింది. మార్ఛి 3న విడుదలైన బలగం చిత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. దిల్ రాజు ప్రొడక్షన్స్ పేరుతో బ్యానర్ ఏర్పాటు చేసి ఆయన కుమార్తె హన్షిత రెడ్డి సినిమాలు నిర్మిస్తున్నారు. జర్నలిస్ట్ గడ్డం సతీష్ ఆరోపణలపై దిల్ రాజు, దర్శకుడు వేణు ఎలా స్పందిస్తారో చూడాలి. గడ్డం సతీష్ కథ తనదే అని ప్రకటించాలని పట్టుబడుతున్నారు.