
Avinash Reddy- Viveka Murder Case: పలు మలుపులు తిరుగుతున్న వివేకా హత్య కేసు కొలిక్కి వచ్చే సూచనలు కనిపించడం లేదు.వైసీపీ ప్రభుత్వ మెడకు చుట్టుకోవడంతో తప్పించుకునేందుకు నానా తిప్పలు పడుతుంది. ముఖ్యంగా అవినాష్ రెడ్డి ఈ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సీబీఐ మూడు సార్లు ప్రశ్నించింది. ఈ క్రమంలో ఆయన ఈ కేసు విషయంలో మరో కోణాన్ని తెరపైకి తీసుకువచ్చారు.
తెలంగాణ కోర్టులో పిటీషన్ దాఖలు చేసి అరెస్టు నుంచి తాత్కాలిక ఉపశమనం పొందిన ఆయన సీబీఐపై పలు ఆరోపణలు చేశారు. కేసు విచారణ సమయంలో కేవలం ఒక ల్యాప్ ట్యాప్ మాత్రమే తీసుకువస్తున్నారని, తన లాయర్ ను కూడా అనుమతించడం లేదని,
ఆడియో, వీడియో రికార్డింగ్ జరగడం లేదని అన్నారు. తనను ఇబ్బంది పెట్టేందుకు సీబీఐ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలంగాణ హైకోర్టు దృష్టికి తీసుకువచ్చారు.
మొదటి నుంచి తను ఏ పాపం ఎరుగనని అంటున్న అవినాష్ రెడ్డి మీడియాకు వివేకా హత్య కేసులో మరో కోణాన్ని వెల్లడి చేశారు. అల్లుడే అసలు సూత్రధారని స్పష్టం చేశారు. వివేకా రెండో పెళ్లి నేపథ్యంలోనే హత్య జరిగి ఉండవచ్చని మీడియాతో అన్నారు. ఇదే కీలకమని దీనిని పోలీసులు ఎందుకు పట్టించుకోవడంలేదో అర్థం కావడం లేదని అన్నారు. 2010లో షమీమ్ అనే మహిళను పెళ్లి చేసుకొని 2015లో ఓ కుమారుడికి జన్మనిచ్చారని ఆరోపించారు. ఈ రెండో పెళ్లి వివేకా తనయురాలు సునీతారెడ్డి, ఆమె భర్త రాజశేఖర్ రెడ్డి, బావ శివ ప్రకాష్ రెడ్డికి నచ్చలేదని వివరించారు.

ఈ పెళ్లి కారణంగానే వివేకానందరెడ్డి కుటుంబంలో విభేదాలు మొదలయ్యాయని మీడియాతో చెప్పుకొచ్చారు అవినాష్ రెడ్డి. వారసుడిని రాజకీయాల్లోకి తీసుకురావాలని వివేకా భావించారని, ఆస్తులను కూడా రెండో భార్య పేరు మీద రాయాలని అనుకున్నారని అన్నారు. ఆస్తుల పంపకాల విషయంలో హత్య జరిగి ఉండవచ్చని అవినాష్ రెడ్డి చెప్పుకొచ్చారు.
కాగా, అవినాష్ రెడ్డి తాజా ఆరోపణలు వివేకా హత్య కేసును తప్పుదోవ పట్టించేందుకా లేదా ఆరోపలు ఎంత వరకు నిజమన్నది తేలాల్సి ఉంది.
ఇదిలా ఉండగా, వివేకా హత్య కేసులో నిందితులు సునీల్ యాదవ్, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, ఉమాశంకర్, గంగిరెడ్డి, దస్తగిరి హైదరాబాద్ లోని సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. ఇరు వాదనలు విన్న కోర్టు ఈ నెల 31కి విచారణ వాయిదా వేసింది. అనంతరం వీరిని చంచల్ గూడ జైలుకు తరలించారు.