
KTR – Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో తెలంగాణ ముఖ్యమంత్రి తనయ, కల్వకుంట్ల వారసురాలు శనివారం ఈడీ విచారణకు హాజరు కానుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా ఇన్నాళ్లూ మేకబోతు గాంభీర్యం ప్రదర్శించిన కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, కల్వకుంట్ల తారకరామారావలో రెండు రోజులుగా ఆందోళన కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో కూతురుకు అండగా నిలిచేందుకు కేసీఆర్, చెల్లికి అండగా నిలిచేందుకు కేటీఆర్ రంగంలోకి దిగారు.
అరెస్ట్ చేసే అవకాశం..
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్ట్ చేస్తుందన్న ప్రచారం తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తోంది. ఇప్పటికే ఢిల్లీలో ఉన్న కవిత.. శనివారం ఉదయం ఈడీ విచారణకు హాజరుకానున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆమెను ప్రశ్నించిన తర్వాత.. సాయంత్రం అరెస్ట్ చేయవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సీఎం కేసీఆర్ కూడా ఈ విషయాన్ని అంగీకరించారు. ఈ క్రమంలో మంత్రి, కవిత సోదరుడు కేటీఆర్ కూడా ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. శనివారం, ఆదివారం ఆయన ఢిల్లీలోనే ఉండనున్నట్లు తెలుస్తోంది. కవితకు పార్టీ పరంగా.. కుటుంబ పరంగా ధైర్యం చెప్పేందుకు ఆయన ఢిల్లీకి వెళ్లినట్లు తెలుస్తోంది.

న్యాయ నిపుణులతో మంతనాలు..
ఢిల్లీ వెళ్లిన కేటీఆర్ శుక్రవారం రాత్రంతా న్యాయ నిపుణులతో మంతనాలు జరిపినట్లు సమాచారం. ఈడీ విచారణ ఎలా ఉండే అవకాశముంది? అరెస్ట్ చేస్తే ఎలా ముందుకెళ్లాలి? విచారణ పేరుతో మళ్లీ పిలిస్తే ఏం చేయాలి? అనే దానిపై న్యాయ నిపుణులతో చర్చించినట్లు సమాచారం. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవిత ప్రమేయం ఉందని చాలా రోజులుగా రాష్ట్ర రాజకీయాల్లో ప్రచారం జరుగుతోంది. కానీ ఏ రోజు కూడా సీఎం కేసీఆర్ గానీ.. మంత్రి కేటీఆర్ గానీ.. బహిరంగంగా మాట్లాడలేదు. కానీ నిన్నటి నుంచి పరిణామాలు వేగంగా మారిపోయాయి. శుక్రవారం ప్రెస్ మీట్ పెట్టి లిక్కర్ కేసుపై మంత్రి కేటీఆర్ మాట్లాడారు. ఈడీ, సీబీఐ విచారణ పేరుతో కవితను కేంద్రం ఇబ్బంది పెడుతోందని విమర్శించారు. అటు సీఎం కేసీఆర్ కూడా ఈ వ్యవహారంపై ఘాటుగా స్పందించారు. శుక్రవారం సాయంత్రం పార్టీ నేతలతో సమావేశమైన ఆయన… కవిత కేసుపై నేతలతో చర్చించారు. మంత్రులు, ఎంపీల నుంచి ఇప్పుడు తన బిడ్డ వరకూ వచ్చారని.. అన్నారు. ‘‘కవితను అరెస్ట్ చేస్తారట.. చేయనివ్వండి.. ఏం చేస్తారో.. చూద్దాం.. భయపడే ప్రసక్తే లేదు’’ అని నేతలతో అన్నారు.
కవితకు మళ్లీ నోటీసులు
ఇదిలా ఉండగా ఎమ్మెల్సీ కవితకు ఈడీ మరోసారి నోటీసులిచ్చింది. మనీలాండరింగ్ కేసులో శుక్రవారం సాయంత్రం నోటీసులు పంపించారు. శనివారం ఢిల్లీలో మనీశ్ సిసోడియా, రామచంద్ర పిళ్లైతో కలిపి.. కవితను విచారించే అవకాశముంది. ఐతే తాను కవిత బినామీనని ఇటీవల చెప్పిన పిళ్లై.. ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారు. తన వాంగ్మూలాన్ని వెనక్కి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామాల మధ్య శనివారం ఏం జరగబోతుందని అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది.