James Cameron- Avatar: కష్టాల్లో ఉన్నప్పుడు… ధర్మం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు… నీతికి అవినీతి చీడ పట్టినప్పుడు.. దేవుడే వస్తాడో.. ఎవరినైనా దేవుడే ఆవహిస్తాడో.. తెలియదు గాని.. మొత్తానికి దేవుడే దిక్కు అనిపిస్తాడు.. ఇలా పుట్టిన కథలే ఓ ఖలేజా, అఖండ, కార్తీ కేయ, కాంతారా.. అలా దేవుడు వస్తే బాగుండు. ఆ దేవుడే ఒక మనిషిని ఆవహిస్తే బాగుండు. పేరుకుపోయిన చీకటిని, అలముకున్న అంధ కారాన్ని తొలగిస్తే బాగుండు. ఇలాంటి ఉద్వేగమే, ప్రేక్షకుల వేదనా భరితమే ఆ సినిమాల విజయ రహస్యం.. వాస్తవానికి ఏ సినిమా చూసుకున్నా.. అది ఏ భాష అయినప్పటికీ… చెడు పై మంచి విజయం సాధించినప్పుడు ప్రేక్షకులు అందులో తమను ఊహించుకుంటారు. దానికి వారు కనెక్ట్ అయితే సినిమా విజయవంతమైనట్టే. పుష్కరకాలం క్రితం విడుదలైన అవతార్ సినిమా కూడా ఇటువంటి కోవలోకే వస్తుంది. ఇప్పుడు ఆ సినిమాకు కొనసాగింపు వస్తున్నది. డిసెంబర్ నెలలో విడుదలకు సిద్ధంగా ఉంది.

మన దేవుళ్లే ఆ సినిమాకు ప్రేరణ
హిందూ పురాణాల్లో దేవుళ్లకు ఎంతో ప్రాధాన్యం ఉంది.. మన పండుగలు, ఆచార వ్యవహారాలు అన్ని కూడా అందులో నుంచి పుట్టుకొచ్చినవే. ముఖ్యంగా రాముడు మన ఆరాధ్య దైవం. భారతదేశంలోని ప్రతి ఊరిలో రాముడి కోవెల కచ్చితంగా ఉంటుంది. కృష్ణుడి ప్రస్తావన రాకుండా మనకు రోజు గడవదు. మనదంటే సనాతన సంప్రదాయ దేశం కాబట్టి.. ఏదో ఒక సందర్భంలో పురాణాలను గుర్తు చేసుకుంటూ ఉంటాం. దేవుళ్లను తలుచుకుంటూ ఉంటాం. మనం మాత్రమే కాదు ఇతర దేశస్థులు కూడా మన దేవుళ్లను అమితంగా ఆరాధిస్తున్నారు. అంతే కాదు మన దేవుళ్లకు గాథలను సినిమాలుగా మలుస్తున్నారు. త్వరలో విడుదలయ్యే అవతార్ సినిమాకు రాముడు, కృష్ణుడినే ప్రేరణగా తీసుకున్నారు.
ఇలా సాగుతుంది కథ
అవతార్ మొదటి భాగంలో పండోరా గ్రహం నేపథ్యంలో సినిమా సాగుతుంది. అందులో ఉన్న విలువైన ఖనిజాలు తరలించేందుకు కొందరు ప్రయత్నిస్తూ ఉంటారు. అందులో భాగంగానే పండోరా గ్రహంలోకి ఒక మనిషిని గ్రహాంతరవాసిగా పంపుతారు.. అతడు వారిలో కలిసిపోతాడు.. ఆ తర్వాత అనేక పరిణామాల తర్వాత ఆ మనిషి రూపంలో ఉన్న గ్రహాంతరవాసి నిజం తెలుసుకుంటాడు. ఈ సినిమాలోని అన్ని పరిణామాలు కూడా ఆ మహాభారతాన్ని గుర్తుకు తెస్తాయి.కామెరూన్ కూడా ఇదే విషయాన్ని పలు ఇంటర్వ్యూల్లో చెప్పాడు.

రెండో భాగంలో రాముడి ప్రస్తావన
ఇక త్వరలో విడుదల కాబోతున్న అవతార్ 2 కు సంబంధించి తీసుకున్న కథా నేపథ్యం రాముడిది. అండర్ వాటర్ నేపథ్యంలో సాగే ఈ కథ రామాయణాన్ని పోలి ఉంటుందని సమాచారం. అయితే ఈ సినిమాకి భారీగా ఖర్చయింది.. పూర్తి గ్రాఫిక్స్ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాను ప్రత్యేక తెరల్లో మాత్రమే ప్రదర్శిస్తున్నారు. టికెట్ ధర కూడా భారీగానే ఉండబోతోంది. సుమారు 23 వేల కోట్లకు నుంచి వసూలు చేస్తుందని ఈ చిత్ర నిర్మాతలు భావిస్తున్నారు. ఒకవేళ అదే గనుక నిజమైతే ప్రపంచ సినీ చరిత్రలోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా అవతార్_2 నిలుస్తుంది. ఇప్పటికే అవతార్_1 అత్యధిక వసూళ్ళు సాధించిన చిత్రంగా రికార్డుల్లోకి ఎక్కింది. కాగా భారతదేశ పురాణాలను సినిమా కథ వస్తువుగా హాలీవుడ్ నిర్మాతలు ఎంచుకోవడం భారతదేశానికి దక్కిన గౌరవం అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.