Vikarabad: సినిమాల్లో రౌడీలను చూశాం.. ఇగో మన తాండూర్ లో ఇప్పుడే చూస్తున్నాం.. వైరల్ వీడియో

వికారాబాద్ జిల్లా తాండూరులో బాలయ్య అనే యువకుడు స్థానికంగా చిన్నచిన్న పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. అతడు మేతరి రవి అనే వ్యాపారి వద్ద వడ్డీకి 5000 అప్పుగా తీసుకున్నాడు.

Written By: Anabothula Bhaskar, Updated On : March 24, 2024 2:45 pm

Vikarabad

Follow us on

Vikarabad: కాబూలీ వాళ్ళ దగ్గర అప్పుడు తీసుకుంటే.. ముక్కు పిండి వసూలు చేసేవారట. వడ్డీకి, చక్రవడ్డీ, బారు వడ్డీ కలిపి లెక్క కట్టే వారట. ఒకవేళ తీసుకున్న డబ్బును సకాలంలో ఇవ్వకుంటే భౌతిక దాడులు చేసేవారట. వెనుకటి వెనుకటి రోజుల్లో ఇలాంటి ఘటనలు జరిగాయి కాబట్టి.. మన పెద్దవాళ్లు వాటి గురించి కథలుగా చెప్పేవారు. కానీ తాండూరు పట్టణంలో వడ్డీ వ్యాపారి వెనుకటి రోజులను గుర్తు చేశాడు. అప్పు తీసుకున్న పాపానికి.. వడ్డీ చెల్లించని కర్మానికి అతడు ఓ యువకుడి ని విచక్షణారహితంగా కొట్టాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

వికారాబాద్ జిల్లా తాండూరులో బాలయ్య అనే యువకుడు స్థానికంగా చిన్నచిన్న పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. అతడు మేతరి రవి అనే వ్యాపారి వద్ద వడ్డీకి 5000 అప్పుగా తీసుకున్నాడు. తీసుకున్న అప్పుకు సంబంధించి వడ్డీ చెల్లిస్తుంటాడు. అయితే గత మూడు నెలలుగా పనులు లేకపోవడంతో బాలయ్య వడ్డీ చెల్లించడం లేదు. ఈ నేపథ్యంలో రవి పలుమార్లు బాలయ్యను వడ్డీ గురించి అడిగాడు. పనులు దొరకగానే చెల్లిస్తానని బాలయ్య మాటిచ్చాడు. కానీ అతను చెప్పినట్టుగా పనులు లభించకపోవడంతో వడ్డీ చెల్లించలేకపోతున్నాడు. దీంతో రవి బాలయ్యను ఇంటికి రప్పించుకున్నాడు.

బాలయ్య ఇంటికి రాగానే రెచ్చిపోయాడు. తన కుమారుడికి ఫోన్ ఇచ్చి.. తను బాలయ్యను కొడుతున్న దృశ్యాలను వీడియో తీయాలని ఆదేశించాడు. అలా తన కొడుకు వీడియో తీస్తుండగా.. బాలయ్యను రవి ఇష్టానుసారంగా కొట్టాడు. పిడి గుద్ధులు గుద్దాడు. డొక్కలో గట్టిగా గుద్దాడు. కర్రతో వీపు మీద కొట్టాడు. డబ్బులు చెల్లిస్తానని, కొంచెం గడువు కావాలని వేడుకున్నప్పటికీ బాలయ్య పై రవి కనికరం చూపించలేదు. పైగా అతనిని కొట్టుకుంటూ రాక్షసానందం పొందాడు.

ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు వడ్డీ వ్యాపారి రవి పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. “అప్పు ఇచ్చినప్పుడు నిదానంగా వసూలు చేసుకోవాలి. లేదా అతని వద్ద ఏదైనా విలువైన వస్తువులు ఉంటే తనఖా పెట్టుకోవాలి. 5000 అప్పుగా ఇచ్చి.. పనులు లభించక వడ్డీ చెల్లించడం ఆలస్యమయితే ఇలా చేయడం ఎంతవరకు సరైంది. పైగా అతని ఆ స్థాయిలో కొడుతుంటే వ్యాపారి కుమారుడు వీడియో తీశాడు. తన చేష్టల ద్వారా ఆ వ్యాపారి ఎటువంటి సందేశాలు ఇస్తున్నట్టు.. ఆ వ్యాపారిపై కఠిన చర్యలు తీసుకోవాలని” నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. ఈ వీడియో పోలీసుల దృష్టికి వెళ్లడంతో.. వారు ఆ వ్యాపారిపై చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది.