KKR Vs SRH IPL 2024: SRH ఓటమికి. KKR గెలుపునకు మలుపు తిరిగింది ఇక్కడే.. వైరల్ వీడియో

కోల్ కతా జట్టు ముందుగా బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 208 పరుగులు చేసింది. రస్సెల్ (64; 25 బంతుల్లో) మూడు ఫోర్లు, ఏడు సిక్సర్ల తో సునామి సృష్టించాడు. సాల్ట్(54; 40 బంతుల్లో) హాఫ్ సెంచరీ సాధించాడు.

Written By: Anabothula Bhaskar, Updated On : March 24, 2024 1:35 pm

KKR Vs SRH IPL 2024

Follow us on

KKR Vs SRH IPL 2024: గెలుపు వాకిట్లో హైదరాబాద్ బొక్కా బోర్లా పడ్డది.. 208 పరుగుల లక్ష్యాన్ని చేదించేందుకు తీవ్రంగా శ్రమించింది.. క్లాసెన్ ఉతికి ఆరేసినప్పటికీ.. విజయానికి నాలుగు పరుగుల దూరంలో నిలిచిపోయింది. 19.4 ఓవర్ వద్ద తిరిగిన మలుపు వల్ల కోల్ కతా జట్టుకు విజయలక్ష్మి వరించింది.. హైదరాబాద్ జట్టును వెక్కిరించింది. వాస్తవానికి ఈ మ్యాచ్లో రెండు జట్లు పరుగుల వరద పారించాయి. బౌలర్లు వేసిన బంతులు చుక్కల్లో కనిపించాయి. కోల్ కతా తరఫున రస్సెల్ మెరుపులు మెరిపిస్తే.. హైదరాబాద్ నుంచి క్లాసెన్ ఆకాశమేహద్దుగా చెలరేగాడు. క్లాసెన్ మొదట్లో చూపించిన దూకుడు చివరి ఓవర్ లో కొనసాగించి ఉంటే హైదరాబాద్ జట్టు గెలిచి ఉండేది. నెక్ టు నెక్ అన్నట్టుగా ఈ మ్యాచ్ సాగడంతో.. అభిమానులు ముని వేళ్ళ మీద నిలబడ్డారు.

కోల్ కతా జట్టు ముందుగా బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 208 పరుగులు చేసింది. రస్సెల్ (64; 25 బంతుల్లో) మూడు ఫోర్లు, ఏడు సిక్సర్ల తో సునామి సృష్టించాడు. సాల్ట్(54; 40 బంతుల్లో) హాఫ్ సెంచరీ సాధించాడు. రింకూ సింగ్ (23; 15 బంతుల్లో) సత్తా చాటాడు. ఒక దశలో హైదరాబాద్ బౌలర్ల ధాటికి కోల్ కతా 14 ఓవర్లకు ఆరు వికెట్లు కోల్పోయి 119 పరుగులు మాత్రమే చేసింది. కానీ చివరి 6 ఓవర్లలో రస్సెల్ తుఫాన్ లాంటి ఇన్నింగ్స్ ఆడాడు. అందువల్లే కోల్ కతా స్కోరు రాకెట్ లాగా దూసుకెళ్లింది.

చేజింగ్ లో హైదరాబాద్ ఆటగాడు క్లాసెన్(63; 29 బంతుల్లో ఎనిమిది సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. చివరి ఓవర్లో హైదరాబాద్ జట్టుకు 13 పరుగులు కావలసి వచ్చింది. ఆ ఓవర్ ను హర్షత్ రానా వేశాడు. తొలి బంతిని క్లాసెన్ గట్టిగా కొడితే స్టాండ్స్ లో పడింది. ఆ తర్వాత మరో బంతికి సింగిల్ వచ్చింది. స్ట్రైకింగ్ కు వచ్చిన షాబాజ్ (16; ఐదు బంతుల్లో) మూడో బంతిని భారీ షాట్ కొట్టేందుకు ప్రయత్నించి అవుట్ అయ్యాడు. నాలుగో బంతికి జేమ్సన్ సింగిల్ తీశాడు. ఈ క్రమంలో హైదరాబాద్ విజయానికి చివరి రెండు బంతుల్లో ఐదు పరుగులు కావలసి వచ్చింది. అయినప్పటికీ క్లాసెన్ క్రీజ్ లో ఉండడంతో కావ్య మారన్ దగ్గర నుంచి మ్యాచ్ చూస్తున్న అభిమానుల వరకు గట్టి నమ్మకంతో ఉన్నారు. ఐదు బంతిని భారీ షాట్ కొట్టేందుకు క్లాసెన్ ప్రయత్నించాడు. బంతి బ్యాట్ ఎడ్జ్ కు తగిలి అమాంతం గాల్లోకి లేచింది. అయితే అక్కడే కాచుకొని ఉన్న సుయాష్ శర్మ వెనక్కి పరిగెత్తి.. ఒక్కసారిగా గాల్లోకి లేచి కళ్ళు చెదిరే క్యాచ్ అందుకున్నాడు. ఈ క్యాచ్ మ్యాచ్ గమనాన్ని పూర్తిగా మలుపు తిప్పింది. ఒకవేళ ఆ క్యాచ్ కనుక శర్మ జార విడిచి ఉంటే ఫలితం మరో విధంగా ఉండేది. అప్పుడు హైదరాబాద్ జట్టు గెలిచేది. 200 పై చిలుకు స్కోరు ను చేదించిన రికార్డును మూట కట్టుకునేది.