Vijayawada Minor Girl: ఏపీలో మహిళలు, బాలికలపై అకృత్యాలు తగ్గడం లేదు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో కఠిన చట్టాలు అమలుచేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటిస్తున్నా నేరాలు తగ్గుముఖం పట్టడం లేదు. తాజాగా విజయవాడలో ఓ 14 ఏళ్ల బాలికపై ఐదు నెలల కిందట ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ప్రస్తుతం బాలిక గర్భం దాల్చడంతో విషయం వెలుగులోకి వచ్చింది. 14 ఏళ్ల బాలికకు తల్లిదండ్రులు లేరు. విజయవాడ పడమటిలో అమ్మమ్మ తాతయ్యల వద్దే పెరుగుతోంది. పాఠశాలకు వెళ్లి వస్తున్న బాలికను సాయి అనే యువకుడు మాయ మాటలు చెప్పి లోబరచుకున్నాడు. పాఠశాల సమీపంలో ఓ గదికి తీసుకెళ్లి లైంగిక దాడి జరిపాడు. అంతటితో ఆగకుండా మరోసారి బాలికపై అత్యాచారం చేశాడు. స్నేహితుడు ప్రకాష్ తో పాటు మరో బాలుడితో అత్యాచారం చేయించాడు. అటు తరువాత ఆ బాలిక మచిలీపట్నం వెళ్లిపోయింది.

అయితే బాలిక శరీరాకృతిలో మార్పు రావడాన్ని గుర్తించిన కుటుంబసభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయించారు. దీంతో వైద్యుడు బాలిక గర్భవతి అని చెప్పడంతో వారు షాక్ కు గురయ్యారు. బాలికను ఆరా తీయగా..ఆ ముగ్గురు పైశాచికత్వాన్ని బయటపెట్టింది. దీంతో వారు హుటాహుటిన విజయవాడ చేరుకున్నారు. స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదుచేశారు. బాధిత బాలిక నగరంలోని ఓ ఆస్పత్రిలో చికిత్సపొందుతుంది. షాక్ నుంచి ఆ బాలిక ఇంకా తేరుకోలేదు. బాధిత బాలికను పరామర్శించేందుకు వెళుతున్న టీడీపీ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

ప్రధాన నిందితుడు సాయిది నేర ప్రవృత్తి. ఆయనపై దొంగతనం కేసులున్నాయి. ఇంటీవల ఓ దేవాలయంలో దొంగతనం కేసునకు సంబంధించి అరెస్టయ్యాడు. బెయిల్ పై బయటకు వచ్చాడు. చోరీలకు పాల్పడడం.. వచ్చిన సొమ్ముతో జల్సా చేయడం అలవాటు చేసుకున్నాడు. అటు ఆడపిల్లలను ఇట్టే ట్రాప్ చేస్తాడు. సాయితో పాటు స్నేహితుడు ప్రకాష్ ను అదుపులోకి తీసుకున్నారు. మరో బాలుడు ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. విజయవాడలో వరుసగా ఇటువంటి తరహా ఘటనలే చోటుచేసుకోవడం పోలీసులకు సవాల్ గా మారుతోంది. మరోవైపు ఏపీ ప్రభుత్వం దిశ వంటి పటిష్ట కేసు ఏర్పాటు చేసినట్టు ఆర్భాటంగా ప్రకటిస్తున్నా.. అదేదీ మహిళలు, బాలికలపై అఘాయిత్యాలను నియంత్రించడానికి అక్కరకు రావడం లేదు. దీనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.