Jagan- Ramoji Rao: నాడు వైఎస్ రాజశేఖర్ తొలి 5 ఏళ్ల పాలన ముగియడానికి సరిగ్గా సంవత్సరం ముందు.. ఎన్నికల ఏడాది ఈనాడు రామోజీరావు షురూ చేశారు. నాడు వైఎస్ పాలనలోని జలయజ్ఞం సహా పథకాల్లో అవినీతిపై ‘పెద్దలా గద్దలా’ పేరుతో తన పత్రికలో సీరియల్ గా కథనాలు రాశాడు. వైఎస్ఆర్ ను అవినీతి రారాజుగా ఫోకస్ చేశారు. కానీ ప్రజలు నమ్మలేదు. సంక్షేమం పంచిన వైఎస్ఆర్ నే రెండోసారి 2009లో గెలిపించారు. కట్ చేస్తే.

ఇప్పుడు ఎన్నికలకు ఇంకా రెండేళ్ల ముందే ఈనాడు షురూ చేసింది. ఈరోజు ఏపీ ఎడిషన్ లోని ఈనాడు ప్రధాన సంచిక మెయిన్ పేజీని చూస్తేనే అర్థమవుతోంది.. ‘రాజధానిపై జగన్నాటకం’ పేరుతో జగన్ రోజుకో తీరుగా మాట మార్చి రాజకీయ స్వప్రయోజనాల కోసం ఎంతగా అమరావతిని కుదేలు చేశాడని రాసుకొచ్చింది. దాంతోపాటు నాడు కాంగ్రెస్, టీడీపీలో ఉండి జగన్ ను తిట్టిన వారే నేడు ఆయన కేబినెట్ లో మంత్రిగా ఉండి పొగుడుతున్న తీరును కడిగేసింది. దీన్ని బట్టి క్లియర్ కట్ గా అర్థమైపోతోంది. జగన్ పై దాడి మొదలైందని.. ఈనాడు రామోజీరావు షురూ చేశారని అర్థమవుతోంది.

అయితే జగన్ ఏం సుద్దపూసేం కాదు.. అమరావతికి సపోర్టు చేసి మరీ అధికారంలోకి వచ్చాక అక్కడి రైతుల నోట్లో మట్టి కొట్టి విశాఖ రాజధానిగా అనుకొని అక్కడ భూదందాల పేరుతో సాగిస్తున్న సమరాలు సొంత పార్టీ నేతల నుంచే వినిపిస్తున్న తీరు కనిపిస్తోంది. ఇటీవల విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ తన సొంత పార్టీ కీలక నేతపైనే భూ దందా ఆరోపణలు చేశాడంటే అర్థం చేసుకోవచ్చు.

జగన్ పాలనతో అటు ప్రజలు, ఇటు ప్రతిపక్షాలు ఇబ్బంది పడుతున్న మాట వాస్తవం. ఇది ఎవరూ కాదనలేని సత్యం. దీన్ని టీడీపీ దాడి మొదలుపెట్టడానికి రెడీ అయ్యింది. తన చేతిలో ఉన్న బలమైన మీడియాతో ఎదుర్కొనేందుకు సిద్ధమైంది. అయితే ఎన్నికలకు ఏడాది ముందు సాధారణంగా ఇలాంటి స్ట్రాటజీ వాడుతారు. ప్రజలకు గుర్తుండిపోయేలా ఆ ఎన్నికల వేడిలో ఇలాంటి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడితే ఫలితం ఉంటుంది. టీడీపీ ఇక్కడే తప్పటడుగులు వేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఇక పవన్ కళ్యాణ్ ఏపీ పాలిటిక్స్ లో చాలా ముందుచూపుతో వెళుతున్నారు. ఈ దసరా నుంచే ఆయన బస్సు యాత్ర మొదలు కావాల్సి ఉన్నా దాన్ని వాయిదా వేశారు. ఎన్నికల చివరి ఏడాదికి మార్చారు.అప్పుడే ప్రజల ఫోకస్ అంతా రాజకీయంపై ఉంటుంది. ఇప్పటి నుంచే మొదలుపెడితే అప్పటికి మర్చిపోతారు. అందుకే పవన్ చాలా ముందుచూపుతో వెళుతుండగా.. టీడీపీ, దాని అనుకూల మీడియా ఇప్పుడే దాడి షురూ చేసింది. ఈ విషయంలో పవన్ వ్యూహం కరెక్ట్ అని.. జగన్ పై అదును చూసి దెబ్బకొట్టడానికి పవన్ రంగం సిద్ధం చేస్తున్నారని తెలుస్తోంది. అస్త్రాలను అనువుగా వాడితేనే ప్రయోజనం.. టీడీపీ ఇప్పుడే వృథా చేస్తుండగా.. జనసేన మాత్రం ఎన్నికల కార్యక్షేత్రంలోనే వాటిని వదిలేందుకు రెడీ అయ్యింది. మరి ఎవరి అస్త్రాలు పనిచేస్తాయన్నది వేచిచూడాల్సిందే..