Atrocity In Hanmakonda: సమాజంలో స్నేహానికి ఉన్న విలువ ఏ బంధానికి లేదు. స్నేహం కోసం ప్రాణం అర్పించేవారు ఉన్నారు. నిజమైన స్నేహం కష్ట, సుఖాల్లో అండగా ఉంటుంది. కానీ, ఇటీవల స్నేహం ముసుగులో మోసాలు పెరుగుతున్నాయి. నమ్మినవాళ్లే నట్టేట ముంచుతున్నారు. తాజాగ వరంగల్ జిల్లాలో ఇలాంటి ఘటనే జరిగింది. స్నేహితురాలు పిలిచిందని వెళితే.. ఆమె దారుణ అఘాయిత్యానికి గురైంది. పిలిచిన స్నేహితురాలు సైడ్ అయిపోయి.. గ్యాంగ్ రేప్ చేయించింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
స్నేహితురాలు పిలిచిందని..
మామునూరు ఏసీపీ తాళ్లపల్లి కృపాకర్ తెలిపిన వివరాల ప్రకారం… వరంగల్ పైడిపల్లికి చెందిన వివాహిత హనుమకొండ భీమారంలోని ఓ కర్రీపాయింట్‌లో పని చేస్తుంది. ఏప్రిల్ 20న ఆమె స్నేహితురాలు ఫోన్ చేసి పని ఉందని, ఆరెపల్లికి రావాలని సూచించింది. దీంతో మహిళ తన భర్త బైక్‌పై ఆరెపల్లికి వెళ్లింది. భర్త ఆమెను దించి వెళ్లిపోయాడు. అప్పటికే స్నేహితురాలు అక్కడ వేచిచూస్తోంది. ఈ క్రమంలో అక్కడికి ఓ కారులో రవి, డి.నాగరాజు వచ్చి వీళ్లిద్దరినీ అందులో ఎక్కించుకున్నారు. కారు ములుగు జిల్లా సరిహద్దుకు వెళ్లాక స్నేహితురాలు దిగిపోయారు. అక్కడ ఎ.రమేశ్, బి.లక్ష్మణ్, బి.సుధాకర్ అనే ముగ్గురు కారులోకి ఎక్కారు.
ఐదుగురు అత్యాచారం..
కారు కదులుతుండగా మహిళకు మత్తు మందు ఇచ్చారు. ఆమెకు మెలకువ వచ్చే సరికి కారు మేడారం అటవీ ప్రాంతంలోకి చేరుకుంది. అక్కడ ఎస్.రవి, డి.నాగరాజు, బి.లక్ష్మణ్ కలిసి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఎ.రమేష్, బి.సుధాకర్ వారికి సహకరించారు. విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించి, ములుగులో బస్సు ఎక్కించారు.
మందలించిన భర్త..
ఆరెపల్లి వద్ద బస్సు దిగి భర్తకు ఫోన్ చేయగా.. ఎందుకు ఆలస్యమైందని మందలించాడు. దాంతో ఆమె కరీంనగర్‌లోని రామడుగులో ఉండే తల్లి వద్దకు వెళ్లారు. రెండు, మూడు రోజులైనా భార్య ఇంటికి రాకపోవడంతో భర్త ఏప్రిల్ 25న ఎనుమాముల ఠాణాలో ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు నమోదైంది. ఈ క్రమంలో బాధితురాలు కులపెద్ద సహకారంతో భర్త వద్దకు వచ్చింది. 20వ తేదీన జరిగిన విషయమంతా తెలిపింది. దాంతో ఏప్రిల్ 29న అయిదుగురు యువకులపై ఎనుమాముల స్టేషన్‌లో బాధితురాలి భర్త ఫిర్యాదు చేశాడు. విచారణ జరిపిన పోలీసులు నిందితులపై అత్యాచారం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి, రిమాండుకు తరలించారు. బాధితురాలి స్నేహితురాలు పరారీలో ఉంది.