Delhi Liquor Scam- Arvind Kejriwal: మొన్నటిదాకా చప్పబడింది అనుకుంటున్న ఢిల్లీ లిక్కర్ స్కాం మళ్లీ తెర పైకి వచ్చింది.. ఈసారి ఏకంగా ఢిల్లీ ముఖ్యమంత్రి పేరు వెలుగులోకి వచ్చింది.. అంతేకాదు ఈ స్కామ్ లో కవిత పాత్ర పై మరిన్ని ఆధారాలు లభించినట్టు తెలుస్తోంది.. దీంతో రాజకీయ వర్గాల్లో మరోసారి చర్చ మొదలైంది.. సరిగ్గా కేంద్ర బడ్జెట్ ముగిసిన ఒకరోజు తర్వాత ఈ కేసు కు సంబంధించి పలు వివరాలను దర్యాప్తు సంస్థలు మీడియాకు లీక్ చేయడం విశేషం.

ఢిల్లీ లిక్కర్ స్కాం లో నిందితులుగా సమీర్ మహేంద్ర ఏ1, ఖావో గల్లి రెస్టారెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఏ2, బబ్లీ బేవరేజస్ ప్రైవేట్ లిమిటెడ్ ఏ3, ఇండోస్పిరిట్స్ ఏ4, ఇండో స్పిరిట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఏ5, విజయ్ నాయక్ ఏ6, అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి ఏ7, అవంతిక కాంట్రాక్టర్స్ లిమిటెడ్ ఏ9, ఆర్గానమిక్స్ ఎకో సిస్టం లిమిటెడ్ ఏ10, బినయ్ బాబు ఏ11, ఫెర్నాడ్ రికార్డ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఏ 12, అభిషేక్ బోయినపల్లి ఏ 13, అమిత్ ఆరోరా ఏ 14, కె ఎస్ ఏ ఎం స్పిరిట్స్ ఎల్ఎల్ పీ ఏ 15, బడ్డీ రిటైల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఏ 16, పాపులర్ స్పిరిట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఏ 17 లను పేర్కొన్న విషయం తెలిసిందే. అరవింద్ కేజ్రివాల్, మనిష్ సిసోడియా, కవిత పేర్లను నిందితుల జాబితాలో చేర్చకున్నా… ఈ స్కామ్ లో వారి పాత్ర ఉందంటూ ఈడి తన చార్జిషీట్లో ప్రస్తావించింది.. అందుకు సంబంధించి నిందితుల వాంగ్మూలాల్లో వారి పేరు ఉన్నట్లు తెలిపింది. ఢిల్లీ మద్యం విధానాన్ని ఆప్ అగ్రనేతలే రూపొందించారని, ముడుపులు చెల్లించిన వ్యాపారులకు మార్జిన్ రూపంలో ఆ మొత్తం తిరిగి వచ్చేలా మంత్రివర్గ ఉప సంఘం ముసాయిదాలో సవరణలు చేశారని పేర్కొన్నది.
మద్యం పాలసీ స్కామ్ కు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ ఇంట్లోనే వ్యూహరచన జరిగిందని ఈడీ స్పష్టం చేసింది.. 2021 డిసెంబర్ 7న నివాసంలోనే ఉపముఖ్యమంత్రి మనిష్ సిసోడియా కార్యదర్శి అరవింద్ ఓ సమావేశాన్ని ఏర్పాటు చేశారని, ప్రైవేట్ సంస్థలకు 12% మార్జిన్ కేటాయించాలని, తద్వారా ఆరు శాతం ముడుపులు తీసుకోవాలనే కుట్రకు బీజం పడిందని పేర్కొన్నది.. జీవో ఎం ఈ మద్యం పాలసీ ముసాయిదాను ఆమోదించే ముందు.. అందులో ఈ మేరకు ప్రతిపాదనలను చేర్చారని స్పష్టం చేసింది. ఈ కుంభకోణానికి వ్యూహకర్త అయిన విజయ్ నాయర్ ఆప్ లో సాధారణ కార్యకర్త కాదు.. ఆయన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు అత్యంత సన్నిహితుడు. విజయ్ నాయర్ తరచూ ఉప ముఖ్యమంత్రి మనిషి సిసోడియా తో సమావేశాలు నిర్వహించారు.. కేజ్రీవాల్ క్యాంపు కార్యాలయంలో కూడా విజయ్ నాయర్ ఈ స్కామ్ లో భాగంగా సమావేశాలు ఏర్పాటు చేశారు.. ఢిల్లీ మంత్రి కైలాష్ గెహ్లోత్ కు సర్కార్ కేటాయించిన బంగ్లాలో 2020 నుంచి విజయ్ నాయక్ నివసిస్తున్నారు.. కైలాష్ కూడా జీవోఎం లో ఒక సభ్యుడు.. విజయ్ నాయరే ఇండో స్పిరిట్ యజమాని సమీర్ మహేంద్ర సమావేశాన్ని ఏర్పాటు చేశారు.. ఈ సమావేశంలో డీల్ కుదరకపోవడంతో తన ఫోన్ ద్వారా ఫేస్ టైంలో వీడియో కాల్ ఏర్పాటు చేశారు.. విజయ్ తన మనిషని, ఆయనను విశ్వసించి పనులు చేయాలని కేజ్రీవాల్ పలుమార్లు సమీర్ మహేంద్ర కు చెప్పారు.. విజయ్ కి ఢిల్లీ ప్రభుత్వంలో ఏ పోస్ట్ లేకపోయినప్పటికీ వ్యాపారుల నుంచి ముడుపులు వసూలు చేసి పెట్టేందుకు మధ్యవర్తిగా వ్యవహరించారు.. మాట వినని వ్యాపారులను బెదిరించేవారు. విజయ్ నాయర్, దినేష్ అరోడా, అమిత్ అరోడా కలిసి కొందరు ఉత్పత్తిదారులు తమ లైసెన్సులను తిరిగి ఇచ్చేలా ఒత్తిడి చేశారు.

ఆప్ నేతల తరఫున సౌత్ గ్రూప్ నుంచి 100 కోట్ల ముడుపులు సేకరించింది విజయ్ నాయర్. సౌత్ గ్రూప్ లో కెసిఆర్ కుమార్తె కవిత, వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఆయన కుమారుడు రాఘవ్, అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్ చంద్ర రెడ్డి ఉన్నారు. అయితే ఆ గ్రూపునకు అభిషేక్ బోయినపల్లి, అరుణ్ పిళ్లై, బుచ్చిబాబు ప్రాతినిధ్యం వహించారు.. విజయ్ నాయర్, తన సహచరుడు దినేష్ అరోడా తో కలిసి అభిషేక్ బోయినపల్లి ద్వారా వందకోట్ల ముడుపులు తీసుకున్నారు.. ఆ ముడుపులను 2020లో జరిగిన గోవా అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి ఉపయోగించారు.. గోవాలో ఆప్ తరఫున సర్వే బృందాల్లో పనిచేసిన వాలంటీర్లకు 70 లక్షలను ఈ నిధుల నుంచే మళ్ళించారు. ప్రకటనలు, హోర్డింగుల బిల్లుల చెల్లింపులకు కూడా ఈ ముడుపులనే వినియోగించారు.. విజయ్ నాయర్ ఈ ముడుపులను హవాలా మార్గాల్లో గోవాకు తరలించారు. కేజ్రీవాల్ ఇంట్లో సమావేశానికి ముందు 2021 జూన్ 18న హైదరాబాద్లోని ఐటీసీ కోహినూర్ హోటల్లో విజయ్ నాయర్, దినేష్ అరోడా, అరుణ్ , అభిషేక్ బోయినపల్లి, బుచ్చిబాబు సమావేశమైనట్టు ఈడి అనుబంధ చార్జ్ షీట్ చెబుతోంది.. 21 సెప్టెంబర్ 20న సౌత్ గ్రూప్ కోసం ఫెర్నార్డ్ రికార్డ్ ఏర్పాటు చేసిన విందులో సమీర్ మహేంద్రు, శరత్ చంద్రారెడ్డి, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, అభిషేక్ బోయినపల్లి తదితరులు హాజరయ్యారని వెల్లడించింది. 2022 ఏప్రిల్ 8న ఢిల్లీలోని ఓబెరాయ్ మైడెన్స్ హోటల్లో కవిత, అరుణ్, విజయ్ నాయర్, దినేష్ అరోడా మధ్య సమావేశం జరిగింది. ముడుపులు చెల్లించిన వారికి ఢిల్లీలో మద్యం హోల్సేల్ సంస్థలు ఏర్పాటు చేసుకోవడం, స్వేచ్ఛగా రిటైల్ జోన్లలో వాటాలు పొందడం, ముడుపులు చెల్లించిన వారికి మార్జిన్ రూపంలో తిరిగి ఆ మొత్తాలు వచ్చేలా పాలసీని రూపొందించారు.