Tollywood Heroes: నా పాటైనా పోటీ ఉంటేనే మజా. అయితే అది ఆరోగ్యకరమైన పోటీయై ఉండాలి. కాంపిటీషన్ ఉన్నప్పుడే క్వాలిటీ బయటకు వస్తుంది. స్టార్ హీరోల మధ్య టఫ్ కాంపిటీషన్ నడుస్తుంది. హిట్స్,ప్లాప్స్, కలెక్షన్స్, రికార్డ్స్ ఆధారంగా హీరోల ర్యాంక్స్, పొజీషన్స్ డిసైడవుతూ ఉంటాయి. అయితే ఈ టాప్ పొజిషన్స్ మారుతూ ఉంటుంది. సీనియర్ ఎన్టీఆర్, చిరంజీవి లాంటి స్టార్స్ మాత్రమే దశాబ్దాల పాటు నంబర్ వన్ హీరోలుగా వెండితెరకు ఏలారు. ప్రస్తుతం టాలీవుడ్ లో అరడజనకు పైగా టాప్ హీరోలు ఉన్నారు. మరో అరడజను టైర్ టూ హీరోలు ఉన్నారు. టాలీవుడ్ అతిపెద్ద మార్కెట్ గా ఎదగడానికి కారణం ఇదే.

అయితే మన టాలీవుడ్ హీరోలు గొప్ప సంప్రదాయం పాటిస్తున్నారు. హెచ్చుతగ్గులు, తారతమ్యాలు పక్కన పెట్టి స్నేహితులుగా మారిపోయారు. ప్రతి హీరో ఇద్దరు ముగ్గురు హీరోలతో ఘాడమైన స్నేహం కొనసాగిస్తున్నారు. దోస్త్ మేరా దోస్త్ అంటూ స్నేహ గీతాలు పాడుకుంటున్నారు. టాలీవుడ్ హీరోల బాండింగ్ చూసి పక్క పరిశ్రమల వాళ్ళు కూడా నొచ్చుకుంటున్నారు. కోలీవుడ్ లో అజయ్-విజయ్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే వైరం కొనసాగుతుంది. ఫ్యాన్ వార్స్ పేరుతో దారుణాలు జరుగుతున్నాయి. వారిద్దరూ కలిసి ఓ ఫోటోకి ఫోజిస్తే కొంతలో కొంత ఫ్యాన్ వార్స్ సద్దుమణుగుతాయనే ఆలోచన చేయడం లేదు.
అదే సమయంలో మన హీరోలు సందర్భం ఉన్నా లేకున్నా వేదికలు పంచుకుంటున్నారు. పోటీ సినిమాల వరకే మా మధ్య కాదని నిరూపిస్తున్నారు. టాలీవుడ్ హీరోల కలయికలు అభిమానులకు ఊహించని అనుభూతులు పంచుతున్నాయి. బాలయ్య అన్ స్టాపబుల్ షోకి రెబల్ స్టార్ ప్రభాస్ వచ్చారు. ఆయనతో మరో హీరో గోపీచంద్ జాయిన్ అయ్యారు. ఆఫ్ స్క్రీన్లో వారు ఎంత క్లోజ్ గా ఉంటారో అన్ స్టాపబుల్ వేదికగా బయటపడింది. చిన్న పిల్లల్లా అల్లరి చేశారు. మధ్యలో ఫోన్ ద్వారా చరణ్ జాయిన్ అయ్యాక ఫన్ డబుల్ అయ్యింది. చరణ్, ప్రభాస్, గోపీచంద్ మంచి మిత్రులమని చెప్పకనే చెప్పారు .

చాలా రిజర్వ్డ్ గా ఉండే మహేష్ కి చరణ్, ఎన్టీఆర్ థిక్ ఫ్రెండ్స్. ఫ్యామిలీతో కాకుండా ట్రిప్ కి వెళ్లాలనుకుంటే నా ఛాయిస్ ఎన్టీఆర్, చరణ్ అని మహేష్ ఓ సందర్భంలో చెప్పారు. రామ్ చరణ్ కి రానా, శర్వానంద్ బెస్ట్ ఫ్రెండ్స్. వీరు క్లాస్ మేట్స్ కూడాను. హీరోలుగా వీరి స్టార్డమ్స్, ఇమేజెస్ వేరు. అవేమీ వారి స్నేహానికి అడ్డుకాలేదు. ఇక నందమూరి హీరోతో మెగా హీరో ఒక మల్టీస్టారర్ చేస్తారని అసలు ఎవరైనా ఊహించారా!. ఎన్టీఆర్-చరణ్ ల స్నేహం దాన్ని సుసాధ్యం చేసింది. రెండు రైవల్ ఫ్యామిలీ హీరోలు కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. చిరంజీవి-బాలయ్య చేయలేనిది ఈ జనరేషన్ చేసి చూపారు.
ఈ జనరేషన్ హీరోల్లో అల్లరి నరేష్-నాని మంచి మిత్రులు. తనకంటే సీనియర్ అయిన నరేష్ ని నాని బాబాయ్ అని సరదాగా పిలుస్తారు. అక్కినేని యంగ్ హీరో అఖిల్ తో నితిన్ కి స్నేహం కుదిరింది ఇద్దరూ చాలా క్లోజ్. సీనియర్ హీరోల్లో చిరంజీవి-నాగార్జున బెస్ట్ ఫ్రెండ్స్. తరచుగా కలుస్తుంటారు. కలిసి విహారాలకు వెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. అలా మన హీరోలు ఒకరినొకరు గౌరవించుకుంటూ, సపోర్ట్ చేసుకుంటూ ఇతర పరిశ్రమల హీరోలకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు.