దేశంలో కరోనా మహమ్మారి మరణ మృదంగం మ్రోగుతోంది. ప్రతిరోజూ వేల సంఖ్యలో కొత్త కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. విజృంభిస్తున్న వైరస్ ప్రభావం పండుగలపై సైతం పడింది. మరో రెండు రోజుల్లో వినాయక చవితి పండుగ రానుంది. గతంలో వినాయక చవితి పండుగ అంటే సందడి ఓ రేంజ్ లో ఉండేది. కానీ ఈ సంవత్సరం మాత్రం పండుగ భిన్నంగా జరగనుంది. తెలుగు రాష్ట్రాల సీఎంలు ఇప్పటికే వినాయక చవితి పండుగ విషయంలో ఆంక్షలు విధించారు.
పెద్దగా హడావిడి లేకుండా, ఎక్కువమంది గుమికూడకుండా ఉండేలా ఈ సంవత్సరం వినాయక చవితి వేడుకలు జరుగుతున్నాయి. అయితే కరోనా వల్ల విగ్రహాల తయారీలో కళాకారులు కొత్త పుంతలు తొక్కుతున్నారు. ముంబైలో ఏకంగా శానిటైజర్ వినాయకుడిని తయారు చేశారు. భక్తులు విగ్రహం ముందుకు వెళ్లి చేయి చాచగానే శానిటైజర్ పడే విధంగా రూపొందించిన వినాయకుని విగ్రహం అందరినీ ఆకట్టుకుంటోంది.
నితిన్ రామ్‌దాస్ చౌదరి అనే ముంబైకు చెందిన కళాకారుడు ఈ విగ్రహాన్ని తయారు చేశాడు. ప్రతి సంవత్సరం భిన్నమైన గణేష్ ప్రతిమలను తయారు చేసే నితిన్ రామ్‌దాస్ చౌదరి ఈ సంవత్సరం శానిటైజర్ డిస్పెన్సర్ ప్రతిమను తయారు చేసి వార్తల్లో నిలిచాడు. నితిన్ ఈ ప్రతిమలో లైట్లను కూడా పొందుపరచటం గమనార్హం. రిమోట్ ద్వారా లైట్లను ఆన్/ ఆఫ్ చేయవచ్చని రామ్ దాస్ తెలిపాడు. రామ్ దాస్ మీడియాతో మాట్లాడుతూ వినాయకుడు మనం ఎదుర్కొంటున్న సమస్యలన్నింటినీ పటాపంచలు చేస్తాడని… దేవుని ఆయుధంగా శానిటైజర్‌ను ప్రతిమలో పొందుపరిచానని చెప్పారు.