
Artificial Intelligence: విఠలాచార్య సినిమాలు మీరు చూశారా.. చూస్తున్నంత సేపు మరో లోకంలోకి వెళ్ళిపోతాం. ఇప్పుడంటే సినిమాకు గ్రాఫిక్స్ రకరకాల హంగులు ఉన్నాయి. కానీ అలాంటివి ఏమీ లేని సమయంలోనే ఆయన అద్భుతాలు చేశాడు. అద్భుతమైన ప్రపంచంలోకి ప్రేక్షకులను తీసుకెళ్లాడు.. ఈ కంప్యూటర్ యుగంలో అలాంటి అద్భుతాలను మించేలా చేస్తోంది కృత్రిమ మేథ అలియాస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.. స్మార్ట్ యుగంలో మనిషి కనుగొన్న అద్భుతమైన సాఫ్ట్ వేర్ ఇది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పటికే చాట్ జీపీటీ అనే అద్భుతాన్ని ఆవిష్కరించింది. అయితే చాలామంది కృత్రిమ మేథ అంటే పిజిటి మాత్రమే అనుకుంటున్నారు. అది ముమ్మాటికి కాదు. జనరేటివ్ ఏఐకి అది ఉదాహరణ మాత్రమే. జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఉత్పాదక కృత్రిమ మేధా అని అర్థం. అంటే మీరు ఏదైనా కవిత లేదా వ్యాసమో రాయాలి అనుకుంటే చాట్ జీపీటీ అద్భుతంగా రాసి ఇస్తుంది. సి లాంగ్వేజ్ లో కంప్యూటర్ ప్రోగ్రామ్ రాయమంటే రాసి ఇచ్చేస్తుంది. జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తెలివితేటలు దీనికి మాత్రమే పరిమితం కావడం లేదు. అవి నానాటికి కొత్త పుంతలు తొక్కుతున్నాయి.. కవితలు, కంప్యూటర్ ప్రోగ్రాములు అంటే టెక్స్ట్ మాత్రమే.

జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో తదుపరి దశ టెక్స్ట్ టు ఇమేజ్.. కొన్ని ముఖ కవళికలు చెప్పి వాటి ఆధారంగా ఆ చిత్రాన్ని రూపొందించమంటే ఖచ్చితంగా రూపొందిస్తుంది. ఇప్పుడు దాన్ని కూడా దాటేసి మనం ఇచ్చే టెక్స్ట్ ఇన్ పుట్స్ ఆధారంగా వీడియోలు రూపొందించే దశకు జనరేటివ్ ఏఐ చేరుకుందంటే అతిశయోక్తి కాక మానదు. దీనిని అమెరికాకు చెందిన “రన్ వే” అనే స్టార్ట ప్ రూపొందించింది. “జెన్_2 మోడల్ ఏఐ” ఈ టెక్స్ట్ టూ వీడియో అద్భుతాన్ని సాధించింది. చాట్ జీపీటీ ని రూపొందించిన సృష్టికర్తలే అభివృద్ధి చేసిన “డాల్_ఈ” కూడా ఇంచమించుగా ఇదే పని చేయగలదు. 2022 లో మెటా కంపెనీ కూడా “మేక్ ఏ వీడియో” అనే ఒక టూల్ ను అందుబాటులోకి తెచ్చింది. అయితే ఇది మనం ఇచ్చే టెక్స్ట్ ఇన్ పుట్ తో వీడియోలను తయారు చేస్తుంది. అయితే ఇందులో ఎటువంటి శబ్దాలు ఉండవు. శబ్దాలను తర్వాత జోడించుకోవచ్చు. మెటా విడుదల చేసిన వారం తర్వాత గూగుల్ కూడా “ఇమాజిన్ వీడియో” పేరుతో ఒక టెక్స్ట్ టు వీడియో ఏఐ మోడల్ ను ప్రకటించింది. అయితే ఇవన్నీ కూడా పదినిమిషాల్లోపు నిడివి గల వీడియోలను టెక్స్ట్ ద్వారా రూపొందించేవే. అంతకుమించిన నిడివి గల వీడియోలను రూపొందించే “ఫెనాకి” అనే మరో ఏఐ మోడల్ ను కూడా గూగుల్ అభివృద్ధి చేసింది.
ఒక యానిమేషన్ వీడియో తయారు చేయాలి అంటే బొమ్మలు గీసి వాటి కదలికల్ని నిర్దేశించి, పూర్తి స్థాయి వీడియోగా మార్చడానికి కొన్ని గంటలు.. రోజులు..వారాలు కూడా పడుతుంది. ఉదాహరణకు కు భద్రాచలంలో పాపికొండల డ్రోన్ షాట్ అని ఇన్ పుట్ ఇవ్వగానే ఏఐ మోడల్ ఆ వీడియోను రూపొందించి ఇస్తున్నది. దాన్ని ఎలా వాడుకుంటారన్నది మీ ఇష్టం. కేవలం టెక్స్ట్ టు వీడియో నే కాదు.. ఇమేజ్ టు వీడియో(అంటే మనం పవన్ కల్యాణ్ ఫొటో ఏఐకి ఇన్ ఫుట్ గా ఇచ్చి ఆయన ఎక్కడో పారీస్ వీధుల్లో నడుస్తున్న దృశ్యం కావాలి అంటే తయారు చేసి ఇవ్వమంటే ఇస్తుంది) వంటి సేవలను “రన్ వే” ఏఐ మోడల్ జెన్_2 ఇచ్చేస్తుంది.
ఇక టెక్స్ట్ టు వీడియో ఏఐ మోడళ్ళకు ఇలా కమాండ్లు ఇచ్చి అలా కావాల్సిన వీడియోను రూపొందించుకోవచ్చనుకుంటే పొరబాటే. దీంట్లో చాలా సమస్యలున్నాయి. మనం ఇచ్చే కమాండ్లు చాలా కచ్చితంగా ఉండాలి. లేకుంటే చాలా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. అయితే ఈ కమాండ్ల ద్వారా ఫోర్న్ వీడియోలు తీయకుండా ఏఐ నియంత్రించాల్సి ఉంటుంది.