Mobile Use In Toilet: స్మార్ట్ ఫోన్.. ఇది మన జీవితంలో ఒక భాగం అయిపోయింది. మాటల దగ్గర నుంచి మొదలుపెడితే బ్యాంకు లావాదేవీల వరకు ప్రతిదీ కూడా దీని ద్వారానే జరుగుతోంది. అందుకే దీని వాడకం కూడా విపరీతంగా పెరిగిపోయింది. చివరికి టాయిలెట్ కి వెళ్ళేటప్పుడు కూడా ఫోన్ తీసుకెళ్లడం, ఆ పని చేస్తూ కూడా ఫోన్ చూడటం పరిపాటిగా మారింది. నూటికి 70 నుంచి 80 మందికి ఈ అలవాటు ఉంది. ఇంతకీ ఇది మంచి అలవాటేనా? స్మార్ట్ ఫోన్ కు మనిషి అంతలా బానిసగా మారిపోయాడా? స్మార్ట్ ఫోన్ చూడకుండా చివరికి తన దేహంలో ఉన్న వ్యర్ధాలను తొలగించుకోలేకపోతున్నాడా? ఈ ప్రశ్నలు కొంచెం క్లిష్టమైనవే. కానీ శాస్త్రవేత్తలు తమ పరిశోధనలు ఆధారంగా చెప్పిన వివరాలను చదివితే ఒకింత ఆశ్చర్యం తప్పక కలుగుతుంది.
ఇప్పటిది కాదు
చాలామంది వైద్యులు టాయిలెట్ వెళ్లే ముందు స్మార్ట్ ఫోన్లు వాడొద్దు అని చెబుతుంటారు.. దీనివల్ల శౌచాలయాల్లో ఉండే రకరకాల బ్యాక్టీరియాలు ఫోన్ పై చేరి, ఆ తర్వాత అవి మన ఆరోగ్యం మీద ప్రభావం చూపుతుంటాయని హెచ్చరిస్తుంటారు. అయినప్పటికీ చాలామంది ఆ అలవాటును మానుకోలేరు. అయితే ఈ అలవాటు స్మార్ట్ ఫోన్ వచ్చినప్పుడే మొదలైందా? లేకుంటే అంతకు ముందు ఉందా? ఈ సందేహం మనలో చాలామందికి ఉంటుంది. అయితే అమెరికన్ విశ్లేషకుడు ఒట్టో ఫెనిచెల్ 1937 లోనే ఒక అధ్యయనం చేశాడు.
వార్త పత్రికలు కూడా అలానే చదివే వారు
వార్తాపత్రికల విప్లవం మన దగ్గర అంతంత మాత్రంగా ఉన్న రోజుల్లో.. పాశ్చాత్య దేశాల్లో మాత్రం వార్తాపత్రికలు విరివిగా వాడుకలో ఉండేవి. అయితే అప్పట్లో ప్రజలు వార్తాపత్రికలను, వివిధ సంచికలను టాయిలెట్ కు వెళ్లి చదువుకునేవారు. ఇది వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ.. అప్పట్లో అక్కడ నిత్యకృత్యం లాగా ఉండేది. దీనిపై ఒట్టో ఫినిచెల్ సుదీర్ఘకాలం పరిశోధన నిర్వహించాడు. “సాధారణంగా మనిషిలో కొంత అహం ఉంటుంది. తన శరీరంలో ఏదైనా భాగాన్ని కోల్పోతున్నప్పుడు అది తీవ్రంగా ఉంటుంది. అలాంటప్పుడు కోల్పోతున్న పదార్థానికి ప్రత్యామ్నాయంగా కొత్తదానిని దేహంలోకి స్వీకరించాలి అనుకుంటాడు. అయితే ఆ పదార్థాన్ని కళ్ళ ద్వారా స్వీకరిస్తున్నప్పుడు మంచి అనుభూతికి లోనవుతుంటాడు. టాయిలెట్ వెళ్ళినప్పుడు మన దేహంలో పేరుకుపోయిన వ్యర్ధం బయటికి వెళ్తుంటుంది. అది మనిషిలో ఒకింత అసహనానికి కారణమవుతుంటుంది. అలాంటప్పుడు కళ్ళతో న్యూస్ పేపర్ చదువుతున్నప్పుడు మనం కొత్త పదార్థాన్ని దేహంలోకి తీసుకుంటున్నంత అనుభూతి కలుగుతుంది. అందుకే చాలామంది టాయిలెట్ వెళ్తున్నప్పుడు వార్తాపత్రికలు లేదా సంచికలు చదువుతున్నారని” ఒట్టో ఫెనిచెల్ అప్పట్లో ప్రకటించాడు.
సిగ్మండ్ ఫ్రాయిడ్ ఏం చెప్పాడంటే
“వాస్తవంగా చదవడం లేదా రాయడం అనేవి ఒక రచయిత తాలూకు పదాలను తినడం వంటివి. దాన్ని కొంతమంది ఆస్వాదిస్తూ ఉంటారు. ముఖ్యంగా టాయిలెట్ లో పత్రికలు లేదా సంచికలు చదవడానికి వారు ఇష్టపడతారు. వారు తమ దేహంలోని విసర్జక పదార్థాలను బయటికి పంపిస్తున్నప్పుడు.. ఒకింత ఉద్వేగంతో ఉంటారు. దానిని భర్తీ చేసేందుకు న్యూస్ పేపర్ లేదా ఇతర పుస్తకాలు చదువుతారు. దీనివల్ల దేహంలోకి కొత్త పదార్థాలను పంపించినంత అనుభూతి చెందుతుంటారు.” సిగ్మండ్ ఫ్రాయిడ్ అప్పట్లో ప్రకటించాడు. ప్రస్తుతం వార్తాపత్రికలు తగ్గిపోయి ఆ స్థానాన్ని స్మార్ట్ ఫోన్లు ఆక్రమించిన నేపథ్యంలో.. వాటిని టాయిలెట్ కి వెళ్ళినప్పుడు కూడా తీసుకెళ్లడం పరిపాటిగా మారింది.
66.7 మంది స్మార్ట్ ఫోన్ వాడుతున్నారు
ఇక ప్రస్తుతం ప్రపంచ జనాభాలో 66.7% మంది స్మార్ట్ ఫోన్లు వినియోగిస్తున్నారు. వివిధ రకాలుగా డిజిటల్ ప్రపంచానికి కనెక్ట్ అయిపోయారు. తినేటప్పుడు నుంచి మొదలు పెడితే పడుకునేంతవరకు కూడా స్మార్ట్ ఫోన్లోనే గడుపుతున్నారు. చివరికి టాయిలెట్ వెళ్ళినప్పుడు కూడా స్మార్ట్ ఫోన్లు వదలడం లేదు. వాడకం మితిమీరిపోవడం వల్లనే కొత్త కొత్త రోగాలు వస్తున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. టాయిలెట్ వెళ్తున్నప్పుడు స్మార్ట్ ఫోన్ వినియోగించడం వల్ల ఇన్ఫెక్షన్లు ఎక్కువగా వచ్చే ప్రమాదం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. “ఫోన్ స్క్రీన్ లపై బ్యాక్టీరియా చేరి అది ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. దానిని మనం చేతులతో టచ్ చేయగానే అది వెంటనే మనకు సోకుతుంది. వీటి వల్ల లేనిపోని రోగాలు వస్తుంటాయి. ఇక టాయిలెట్లో ఫోన్ అదే పనిగా చూస్తూ.. టాయిలెట్ బేసిన్ పై అదే పనిగా కూర్చుంటే పాయువు మీద ఒత్తిడి పెరుగుతుంది. ఇది అంతిమంగా నొప్పి, వాపు, రక్తస్రావానికి దారితీస్తుంది. సో కాబట్టి స్మార్ట్ ఫోన్ ను ఎంత అవసరమో అంతే వాడితే మంచిది. లేకుంటే లేనిపోని రోగాలు వస్తాయి.” అని వైద్యులు హెచ్చరిస్తున్నారు.