
Nandamuri Balakrishna: కాలు జారితే తీసుకోగలం కానీ మాట జారితే తీసుకోలేము. పురాణాలు వల్లించే బాలయ్యకు ఈ చిన్న సామెత తెలియక పోవడం శోచనీయం. నందమూరి బాలయ్య అంటే ఒక స్టార్ హీరో. ఎన్టీఆర్ వారసుడు. ఎమ్మెల్యేగా రెండు సార్లు గెలిచిన ప్రజాప్రతినిధి. అలాంటి బాలయ్య ఎంత హుందాగా ప్రవర్తించాలి. పబ్లిక్ లో ఎంత జాగ్రత్తగా మాట్లాడాలి. కానీ బాలయ్యకు అవేమీ పట్టడం లేదు. రోజుకో వివాదంతో పరువు పోగొట్టుకుంటున్నారు. నోటికొచ్చింది మాట్లాడటం విమర్శలపాలు కావడం పరిపాటిగా మారిపోయింది. ఆరుపదుల వయసు దాటినా ఎక్కడ ఎలా మాట్లాడాలనే పరిపక్వత రావడం లేదు.
రోజుల వ్యవధిలో బాలయ్య మూడు వివాదాల్లో చిక్కుకున్నాడు. దేవాంగకుల నాయకుడు రావణాసురుడిని చెప్పడం ఆ కులస్తుల మనోభావాలు దెబ్బతీసింది. వారు నిరసన తెలపడం జరిగింది. అనంతరం అక్కినేని తొక్కినేని అంటూ ఏఎన్నార్ గౌరవానికి భంగం కలిగేలా మాట్లాడారు. తాజాగా నర్సులను ఉద్దేశిస్తూ అనుచిత కామెంట్స్ చేశారు. ”దానెమ్మ ఆ నర్సు కత్తిలా ఉంది” అని పబ్లిక్ లో చెప్పడం బాలయ్యకే చెల్లింది.
అడుసు తొక్కనేల కాలు కడగనేల అన్న తీరుగా ఏది పడితే అది మాట్లాడడం ఎందుకు. తర్వాత క్షమాపణలు చెప్పడం ఎందుకు. అసలు క్షమాపణ విలువ బాలయ్యకు తెలుసో లేదో. తప్పు చేసినప్పుడు తప్పదు. పెద్దవాళ్ళు అక్కడి దాకా తెచ్చుకోరు. ఒక చిన్న గ్రామంలోనే ఒకరికి మరొకరు క్షమాపణ చెప్పడం పెద్ద విషయం. నామోషీగా ఫీల్ అవుతారు. బాలయ్య సెలెబ్రిటీ హోదాలో ఉండి ప్రపంచానికి తెలిసేలా క్షమాపణ చెబుతున్నారు.

ఈ మాట మాట్లాడితే అది ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందనే సెన్స్ బాలయ్యకు లేకపోవడం విచారకరం. ఆఫ్ స్క్రీన్ లో కూడా నేను హీరోనే అనిపించుకునే క్రమంలో బాలయ్య ఇలా ప్రవర్తిస్తూ ఉంటారు. ఒకటి రెండుసార్లు జరిగితే పొరపాటు అనుకుంటారు. ప్రతిసారీ జరుగుతుంటే ఏమనుకోవాలి. గత నాలుగైదేళ్లలో బాలయ్య తోటి హీరోలను కూడా కించపరుస్తూ మాట్లాడారు. ఏ హీరో మాత్రం మా బ్లడ్ వేరు, మా బ్రీడ్ వేరని మాట్లాడతారు చెప్పండి. పరోక్షంగా ఇతర కులాలను, జాతులను కించపరిచినట్లు ఆయన కామెంట్స్ ఉన్నాయి. అమ్మాయి కనిపిస్తే ముద్దైనా పెట్టాలి, కడుపైనా చేయాలని చెప్పడం పిచ్చికి పరాకాష్ట. ఇక్కడ పరువు పోతుంది బాలయ్యది. మాట పడుతున్న వాళ్ళది కాదు.