
Minister Seediri Appalaraju: ఏపీ మంత్రి అప్పలరాజు మళ్లీ తప్పులో కాలేశారు. మొన్నటికి మొన్న తెలంగాణ ప్రజలకు బుర్రలేదు అంటూ హాట్ కామెంట్స్ చేసి రెండు రాష్ట్రాల మధ్య వివాదానికి కారణమయ్యారు. రాజకీయ విమర్శలు పక్కదారి పట్టించి ప్రజల మధ్య భావోద్వేగం రెచ్చగొట్టేలా అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై సీఎం జగన్ తో చీవాట్లు తిన్నట్టు వార్తలు వచ్చాయి. దీంతో ఆయన సీఎం జగన్ కు ఏదో రూపంలో ఆకట్టుకోవాలని.. తనపై ఉన్న కోపాన్ని తగ్గించుకోవాలని చూస్తున్నట్టున్నారు. టీడీపీకి సెల్ఫీ చాలెంజ్ విసిరే క్రమంలో అడ్డంగా బుక్కయ్యారు. వైసీపీ ప్రభుత్వ పనితీరును బయటపెట్టేశారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో నిర్మాణంలో కిడ్నీ ఆస్పత్రి భవనాన్ని ఆకస్మికంగా సందర్శించారు. ముఖానికి జగన్ ఫొటో ఉన్న మాస్కు పెట్టుకొని టీడీపీకి సెల్ఫీ చాలెంజ్ విసిరారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిపై టీడీపీకి దమ్ముంటే చర్చకు రావాలని అచ్చెన్నాయుడుకు సవాల్ చేశారు.
పవన్ కృషితోనే…
వాస్తవానికి ఈ భవనాన్ని మంజూరు చేసింది చంద్రబాబు. దానికి కారణం జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఉద్దానంలో కిడ్నీ మహమ్మారి దశాబ్దాలుగా ఉన్నా.. దాని ప్రపంచానికి చాటిచెప్పింది మాత్రం పవనే. నాడు చంద్రబాబుతో ఉన్న సన్నిహిత సంబంధాలతో ఉద్దానం కిడ్నీ భూతం గురించి సమగ్రంగా వివరించారు. కిడ్నీ వ్యాధులపై ఒక రీసెర్చ్ సెంటర్ అవసరమని భావించారు. దీంతో చంద్రబాబు ఆస్పత్రి నిర్మాణానికి రెడీ అయ్యారు. శంకుస్థాపన చేశాక ఓడిపోయారు. అధికారంలోకి వచ్చిన సీఎం జగన్ మరోసారి దానికి శంకుస్థాపన చేశారు. పనులు పూర్తిచేయడంలో మాత్రం జాప్యం చేస్తూ వస్తున్నారు. శంకుస్థాపన చేసి నాలుగేళ్లు అయినా నిర్మాణాన్ని మాత్రం పూర్తిచేయలేకపోయారు.
ప్రజలకు వాస్తవాలు తెలుసు…
ఆస్పత్రి చంద్రబాబు హయాంలో మంజూరైందని తెలుసు. దాని వెనుక పవన్ కృషి ఉందని ఉద్దానం ప్రజలకు తెలుసు. అయినా మంత్రి అప్పలరాజు ఓవరాక్షన్ తో మరోసారి దొరికిపోయారు. ఏకంగా జగన్ ఫేస్ మాస్కు పెట్టుకొని చాలెంజ్ కు దిగడంతో నెటిజన్లకు అడ్డంగా బుక్కయ్యారు. వైసీపీ పాలనా తీరుపై ఆగ్రహంగా ఉన్న ప్రజలు ఇదే మంచి చాన్స్ అన్నట్టు మంత్రి అప్పలరాజుపై విమర్శలకు దిగుతున్నారు. ఆయన సెల్ఫీ చాలెంజ్ పై ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు. తెలంగాణ ప్రజలపై ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలను ముడిపెడుతూ కామెంట్స్ చేస్తున్నారు. ఇవి తెగ వైరల్ అవుతున్నాయి. మూడేళ్లలో అమరావతి కట్టలేదని ఎద్దేవా చేసిన వారు..ఓ చిన్నపాటి ఆస్పత్రి భవనానికి నాలుగేళ్లలో పూర్తిచేయలేకపోయారా? అంటూ ఎద్దేవా చేస్తున్నారు.

తప్పుల మీద తప్పులు
మంత్రి అప్పలరాజుది దూకుడు స్వభావం. రాజకీయాల్లోకి వచ్చిన స్వల్పకాలంలోనే ఆయన ఎదిగిపోయారు. అయితే ఎదిగే క్రమంలో ఒదిగి ఉండాలన్న సూత్రాన్ని మరిచిపోయారు. అందుకే తనకు అలవాటైన దూకుడునే ప్రదర్శిస్తున్నారు. చిన్నా పెద్దా తారతమ్యం చూడడం లేదు. మహిళలని గౌరవించడం లేదు. నోటికి ఎంత వస్తే అంత మాట అనేస్తున్నారు. జనాలు మాత్రం ఆయన మాటలకు విరక్తి అయ్యారు. నాలుగేళ్ల కాలంలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ నిర్మాణం పూర్తిచేయలేకపోయారని ఉద్దానం ప్రజలు విమర్శిస్తునే ఉన్నారు. అవేవీ పట్టించుకోకుండా మంత్రి ఇప్పుడు సెల్ఫీ చాలెంజ్ లకు దిగడం అవసరమా? అని సొంత పార్టీ శ్రేణులే ప్రశ్నిస్తున్నారు. ఈ చాలెంజ్ తో ఉన్న కాస్తా పరువు కూడా పాయేనంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.