
JanaSena: రాజకీయాల్లో ప్రజాస్వామ్యం ఫరిడవిల్లాలి. కొన్ని పార్టీలు చేసిందే శాసనం.. చెప్పిందే వేదం అన్నట్టు ఉండకూడదు. బహుపార్టీల ఉద్భవం జరిగాలి. అప్పుడే ప్రశ్నించే గొంతుకలు తరలివస్తాయి. నిలదీసే ధైర్యాన్ని కూడగట్టుకుంటాయి. తప్పును తప్పుగా ఎత్తిచూపుతాయి. లేదంటే కొన్ని పార్టీల చేతిలో ప్రజాస్వామ్యం నలిగిపోతుంది. ఆ ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత కొత్త పార్టీల పైన ఉంటుంది. ఇప్పుడు ఏపీలో జనసేన పై ఆ బాధ్యత ఉంది.
ఏపీలో మొదటి నుంచి రెండు పార్టీల మధ్యే రాజకీయం నడుస్తోంది. మొదట్లో కాంగ్రెస్, కమ్యూనిస్టుల మధ్య రాజకీయం నడిస్తే.. ఆ తర్వాత కాంగ్రెస్, తెలుగుదేశం మధ్య రాజకీయం నడిచింది. కాంగ్రెస్ అంతర్ధానంతో వైసీపీ తెరపైకి వచ్చింది. అప్పటి నుంచి వైసీపీ, టీడీపీ మధ్య రాజకీయం నడుస్తోంది. ఒకరు పోతే ఇంకొకరు అన్నట్టు ఏపీ రాజకీయం రెండు పార్టీల మధ్య నడుస్తోంది. ప్రజలు కూడా ఒకరి పై విసుగు వస్తే ఇంకొకరిని ఎన్నుకుంటున్నారు. ఇంకో ప్రత్యామ్నాయం లేదు. ఫలితంగా ఆ రెండు పార్టీలు ఆడిందే ఆట అన్నట్టు వ్యవహారం సాగుతోంది.
తొలిసారిగా చిరంజీవి ప్రజారాజ్యం రూపంలో మూడో ప్రత్యామ్నాయం వచ్చింది. కానీ అనుకున్న మేరకు నిలబడలేకపోయింది. దీంతో మళ్లీ ఆ రెండు పార్టీలదే హవా నడిచింది. ఇప్పుడు జనసేన రూపంలో మళ్లీ మరో ప్రత్యామ్నాయం వచ్చింది. ప్రజల్లో మళ్లీ ఓ భరోసా కల్పించింది. ఆ రెండు పార్టీలతో విసిగి వేసారిన ప్రజలకు జనసేన ఇప్పుడొక ప్రత్యామ్నాయంగా నిలిచింది. ప్రత్యామ్నాయ పార్టీగా జనసేన పై గురుతర బాధ్యత ఉందని చెప్పవచ్చు. అటు వైసీపీ, ఇటు టీడీపీ రెండు పార్టీలు ఐదేళ్లు అధికారంలో ఉంటున్నాయి. అధికారంలో ఉన్నన్ని రోజులూ ప్రజా సంపదను దోచుకుంటున్నాయి. ప్రజా సంపదను నిర్వీర్యం చేస్తున్నాయి.
ఒక ప్రభుత్వంలో ప్రారంభించిన ప్రాజెక్టులు, కట్టడాలు మధ్యలోనే ఆగిపోతున్నాయి. మరో ప్రభుత్వం వస్తే కొత్త ప్రాజెక్టులు ప్రారంభిస్తున్నారు. ఇలా వేలకోట్ల ప్రజాధనం బూడిదలో పోసిన పన్నీరవుతోంది. ఒకరు మీద మరొకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ప్రజలు కూడా ఆ పార్టీల దారిలోనే నడుస్తున్నారు. ఇది తప్పు అని చెప్పే పరిస్థితి లేదు. మిగిలిన పార్టీలకు ఆ అవకాశం, స్థాయి లేదు. ఇలాంటి సందర్భంలో ఏపీలో జనసేన కీలకమైన పాత్ర పోషించాల్సిన అవసరం ఉంది. ప్రజాధనాన్ని దుర్వినియోగం కాకుండా కాపాడాల్సిన బాధ్యత ఉంది. ఆ రెండు పార్టీలు చేస్తున్న తప్పులను ఎత్తి చూపాల్సిన బాధ్యత జనసేన పై ఉంది.

జనసేన తన గొంతును ప్రభావవంతంగా వినిపించాలంటే క్షేత్రస్థాయిలో బలోపేతం కావాలి. పవన్ కళ్యాన్ రోడ్డు మీదకు రాకపోయినా సరే.. ఒక్క పిలుపుతో సుశిక్షతులైన క్రియాశీలక కార్యకర్తలు పోరాడాలే ఉండాలి. నిర్మాణాత్మకంగా ప్రశ్నించేలా ఉండాలి. ఆ స్థాయిలో కార్యకర్తల సైన్యాన్ని గ్రామస్థాయి నుంచి నిర్మించాలి. ప్రజాక్షేత్రంలో పోరాటం నేర్పాలి. అప్పుడే మిగిలిన పార్టీలు భయపడతాయి. బాధ్యతాయుతంగా వ్యవహరిస్తాయి.